500 కొత్త విమానాలు

ABN , First Publish Date - 2022-12-12T01:10:15+05:30 IST

టాటా గ్రూప్‌పరమైన ఎయిరిండియా వ్యాపార విస్తరణ కోసం 500 వరకు కొత్త విమానాల కొనుగోలుకు ఆర్డర్‌ చేయనున్నట్లు తెలిసింది...

500 కొత్త విమానాలు

  • కొనుగోలు చేయనున్న ఎయిరిండియా!

  • త్వరలో ఎయిర్‌బస్‌, బోయింగ్‌తో ఒప్పందం

  • ప్రపంచంలో ఇదే అతిపెద్ద ఆర్డర్‌!!

న్యూఢిల్లీ: టాటా గ్రూప్‌పరమైన ఎయిరిండియా వ్యాపార విస్తరణ కోసం 500 వరకు కొత్త విమానాల కొనుగోలుకు ఆర్డర్‌ చేయనున్నట్లు తెలిసింది. 400 వరకు నారో బాడీ, 100 లేదా అంతకు పైగా వైడ్‌ బాడీ విమానాల డెలివరీ కోసం ఎయిర్‌బస్‌, బోయింగ్‌తో త్వరలోనే ఒప్పందం కుదుర్చుకోనున్నట్లు ఇండస్ట్రీ వర్గాలు తెలిపాయి. ఈ డీల్‌ ద్వారా ఎయిర్‌బస్‌ ఏ350, బోయింగ్‌ 787, 777 విమానాలను సమకూర్చుకోనుందని, మొత్తం విమానాల ఆర్డర్‌ విలువ 10,000 కోట్ల డాలర్ల (రూ.8.2 లక్షల కోట్ల) పై స్థాయిలోనే ఉండవచ్చని వారన్నారు. ప్రపంచంలో ఇదే అతిపెద్ద విమానాల కొనుగోలు ఆర్డర్‌ కానుంది. దశాబ్దం క్రితం అమెరికన్‌ ఎయిర్‌లైన్స్‌ 460 విమానాల కొనుగోలుకు ఎయిర్‌బస్‌, బోయింగ్‌తో డీల్‌ కుదుర్చుకుంది.

ఎయిరిండియాలో విస్తారా ఎయిర్‌లైన్స్‌ను విలీనం చేస్తున్నట్లు టాటా గ్రూప్‌ గత నెలాఖరులో ప్రకటించింది. విలీనం పూర్తయ్యాక ఎయిరిండియాలో సింగపూర్‌ ఎయిర్‌లైన్స్‌(ఎస్‌ఐఏ)కు 25 శాతానికి పైగా వాటా లభించనుంది. సంబంధిత నియంత్రణ సంస్థల అనుమతులకు లోబడి ఈ ప్రక్రియ 2024 మార్చి నాటికి పూర్తి కావచ్చని అంచనా. విస్తారాలో టాటా గ్రూప్‌ 51 శాతం వాటా కలిగి ఉండగా.. మిగతా 49 శాతం వాటా ఎస్‌ఐఏ చేతుల్లో ఉంది. విస్తారాను విలీనం చేశాక దేశీయ, అంతర్జాతీయ మార్గాల్లో ఎయిరిండియా అగ్రగామి ఎయిర్‌లైన్స్‌గా ఎదగనుందని, సంస్థ విమానాల సంఖ్య 218కు చేరుకోనుందని టాటా గ్రూప్‌ తన ప్రకటనలో పేర్కొంది. దేశంలోనే అతిపెద్ద అంతర్జాతీయ విమానయాన సేవల సంస్థగా, రెండో అతిపెద్ద డొమెస్టిక్‌ ఎయిర్‌లైన్స్‌గా అవతరించనుంది.

Updated Date - 2022-12-12T01:10:18+05:30 IST