ఔను.. అవినాశ్‌ రెడ్డే!

ABN , First Publish Date - 2022-02-23T07:49:12+05:30 IST

‘వైఎస్‌ వివేకానంద రెడ్డి గుండెపోటుతో మరణించారు’... అనే కట్టుకథ అల్లింది కడప ఎంపీ అవినాశ్‌ రెడ్డే! ఇది సీబీఐ చార్జిషీటులో చెప్పిన మాట! నాటి పులివెందుల సీఐ శంకరయ్యదీ అదే మాట! ‘‘వైఎస్‌ వివేకానంద రెడ్డి గుండెపోటుతో మృతి చెందారని...

ఔను.. అవినాశ్‌ రెడ్డే!

  • వివేకా గుండెపోటుతో చనిపోయారన్నారు
  • ఆనాడు ఏం జరిగిందీ చెప్పిన సీఐ శంకరయ్య
  • రక్తపు వాంతులు చేసుకున్నారన్నారు
  • ఉదయాన్నే ఫోన్‌ చేసి నన్ను రమ్మన్నారు
  • క్రైమ్‌ సీన్‌ మొత్తం భాస్కర్‌ రెడ్డి గుప్పిట్లో
  • ఎవ్వరూ లోపలికి రాకుండా గడియ వేశారు
  • అప్పుడప్పుడూ అవినాశ్‌ లోపలికి వెళ్లి వచ్చారు
  • కాంపౌండర్లను పిలిపించి కుట్లు వేయించారు
  • మృతదేహం తరలింపునకు బాక్స్‌ తెప్పించారు
  • గుండెపోటు కాదని, తరలించవద్దని చెప్పా
  • నన్ను బెదిరించారు.. వీడియో తీస్తుంటే వద్దన్నారు
  • వారి ఆధ్వర్యంలోనే సాక్ష్యాధారాలు చెరిపేశారు
  • సీబీఐకి నాటి పులివెందుల సీఐ వాంగ్మూలం


ఒక దారుణ హత్య! చనిపోయింది... నాటి విపక్ష నేత, నేటి ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్‌ సొంత చిన్నాన్న వైఎస్‌ వివేకానంద రెడ్డి! ఎన్నికల ముందు జరిగిన ఆ సంఘటన... తెలుగు రాష్ట్రాల్లోనే సంచలనం సృష్టించింది. ‘చంద్రబాబే చంపించారు’ అని నాడు వైసీపీ గగ్గోలు పెట్టింది. ఆ తర్వాత సీబీఐ రంగంలోకి దిగింది. ఒక్కో కూపీ లాగింది. ఇప్పుడు అన్ని వేళ్లూ... వైఎస్‌ అవినాశ్‌ రెడ్డి వైపే చూపిస్తున్నాయి. వివేకానంద రెడ్డి గుండెపోటుతో చనిపోయారని చెప్పింది అవినాశ్‌ రెడ్డే అని నాటి పులివెందుల సీఐ శంకరయ్య సీబీఐకి చెప్పారు. ‘వాంగ్మూలంలో ఏం చెప్పావ్‌... అవినాశ్‌ రెడ్డి పిలుస్తున్నాడు రా!’ అంటూ అప్రూవర్‌గా మారిన నిందితుడు దస్తగిరికి బెదిరింపులు వచ్చాయి. ‘లోపల ఏం జరిగిందో  చెబితే నరికేస్తా’ అని ఎర్ర గంగిరెడ్డి తనను బెదిరించినట్లు వాచ్‌మ్యాన్‌ రంగన్న చెప్పారు. దీనికి సంబంధించిన లేఖలు, వాంగ్మూలాలు ఇప్పుడు వెలుగులోకి వచ్చాయి. అందులో... అనేక సంచలన సంగతులు!


అమరావతి, ఫిబ్రవరి 22 (ఆంధ్రజ్యోతి): ‘వైఎస్‌ వివేకానంద రెడ్డి గుండెపోటుతో మరణించారు’... అనే కట్టుకథ అల్లింది కడప ఎంపీ అవినాశ్‌ రెడ్డే! ఇది సీబీఐ చార్జిషీటులో చెప్పిన మాట! నాటి పులివెందుల సీఐ శంకరయ్యదీ అదే మాట! ‘‘వైఎస్‌ వివేకానంద రెడ్డి గుండెపోటుతో మృతి చెందారని ఎంపీ అవినాశ్‌రెడ్డి నాకు ఫోన్‌లో చెప్పారు’ అని సీఐ సీబీఐ అధికారులకు ఇచ్చిన వాంగ్మూలంలో తెలిపారు. రక్తపు వాంతుల కథ, బెడ్‌రూమ్‌లో దుప్పటి మార్చడం, మృత దేహానికి కుట్లు వేయించడం... ఇలా అన్నీ అనుమానాస్పదంగానే జరిగాయని తెలిపారు. వైఎస్‌  భాస్కర్‌ రెడ్డి, అవినాశ్‌ రెడ్డి, మనోహర్‌ రెడ్డి ఆధ్వర్యంలోనే ఆధారాలను చెరిపేశారని స్పష్టంగా వివరించారు.


సీబీఐ అధికారులకు సీఐ శంకరయ్య ఇచ్చిన వాంగ్మూలం... ‘‘వివేకానంద రెడ్డి మృతి చెందిన రోజు ఉదయం అవినాశ్‌ రెడ్డి పీఏ రాఘవరెడ్డి నుంచి ఫోన్‌ వచ్చింది. ఆ తర్వాత నాతో అవినాశ్‌ రెడ్డి మాట్లాడారు. ఒక బ్యాడ్‌ న్యూస్‌... అంటూ వివేకానంద రెడ్డి గుండెపోటుతో చనిపోయినట్లు చెప్పారు. వెంటనే పోలీసు సిబ్బందిని వివేకా ఇంటి వద్దకు తీసుకురావాలన్నారు. ఈ విషయాన్ని నేను స్థానిక డీఎస్పీకి తెలియజేసి ఎస్‌ఐలు, కానిస్టేబుళ్లకు ఫోన్లు చేస్తుండగా...  ఐదు నిముషాల్లోనే దేవిరెడ్డి శంకర్‌ రెడ్డి మరోసారి నాకు ఫోన్‌ చేశారు. ఎందుకు ఆలస్యం అవుతోందంటూ కోప్పడ్డారు. నేను సిబ్బందితో అక్కడికి వెళ్లే సమయానికి... లోపల వైఎస్‌  భాస్కర్‌ రెడ్డి, మనోహర్‌ రెడ్డి, ప్రతాప్‌ రెడ్డి, యర్ర గంగిరెడ్డి, దొండ్లవాగు శంకర్‌ రెడ్డి, కాంపౌండర్లు వెంకటేశ్‌ నాయక్‌, జయప్రకాశ్‌ రెడ్డి, శ్రీనివాసరెడ్డి (రాజారెడ్డి, గంగిరెడ్డి ఆస్పత్రుల్లో పని చేస్తారు) ఉన్నారు. అక్కడ ఫొటోలు తీసి ఏడు గంటల ప్రాంతంలో ఎస్పీ రాహుల్‌ దేవ్‌ శర్మకు వాట్సాప్‌ ద్వారా పంపాను. బాత్‌ రూమ్‌ లోపల టైల్స్‌పై రక్తం, బెడ్‌ రూమ్‌లో దుప్పటిపై రక్తపు మరకలు, వివేకానందరెడ్డి తలపై బలమైన గాయాలు కనిపించడంతో... ఇది గుండెపోటు కాదని వాదించాను. అయితే... ఎర్ర గంగిరెడ్డి, దేవిరెడ్డి శంకర్‌ రెడ్డి నోర్మూసుకో.. అని నన్ను బెదిరించారు. సైలెంట్‌గా ఉండకపోతే తీవ్ర పరిణామాలుంటాయని హెచ్చరించారు. 






వివేకానంద రెడ్డి గుండెపోటుతో బాత్‌ రూమ్‌లో రక్తపు వాంతులు చేసుకుని పడిపోయినట్లు అవినాశ్‌ రెడ్డి చెప్పారు. తల వెనుక గాయం చూసి నేను ఇనయ్‌ తుల్లాను సైతం గట్టిగా అడిగాను. ‘అంతా పెద్దోళ్లు చూసుకుంటారు’ అని అన్నాడు. అక్కడ సివిల్‌ డ్రెస్‌లో ఉన్న హోంగార్డు నాగభూషణ రెడ్డిని సెల్‌ఫోన్‌తో సీన్‌ మొత్తం వీడియో తీయిస్తుండగా... శంకర్‌ రెడ్డి కోప్పడ్డాడు. దాంతో రికార్డింగ్‌ ఆపేయాల్సి వచ్చింది.  క్రైమ్‌ సీన్‌ పూర్తిగా కడప ఎంపీ అవినాశ్‌ రెడ్డి తండ్రి వైఎస్‌ భాస్కర్‌ రెడ్డి ఆధీనంలోకి తీసుకున్నారు. గడియ పెట్టుకుని లోపలే ఉన్నారు.  వైఎస్‌ కుటుంబీకులకు చెందిన రాజారెడ్డి ఆస్పత్రి, సీఎం జగన్‌ సతీమణి భారతి తండ్రికి చెందిన గంగిరెడ్డి ఆస్పత్రి సిబ్బందిని మాత్రం గాయాలు కనిపించకుండా కుట్లు వేసేందుకు లోపలికి అనుమతించారు. మధ్య మధ్యలో అవినాశ్‌ రెడ్డి కూడా లోపలికి వెళ్లారు. కుట్లు వేసి, కట్లు కట్టడం పూర్తయ్యాక... మృతదేహాన్ని పెట్టేందుకు రిఫ్రిజిరేటర్‌ బాక్స్‌ తెప్పించారు. అయితే... అందులో వివేకా మృతదేహం పెట్టేందుకు నేను అంగీకరించలేదు. ఫిర్యాదు లేకుండా కుదరదని చెప్పాను. ‘కేసు ఏదీ వద్దు’ అని అవినాశ్‌ రెడ్డి చెప్పారు. నేను అందుకు ఒప్పుకోకపోవడంతో... దేవిరెడ్డి శంకర్‌ రెడ్డి డిక్టేట్‌ చేసిన విధంగా వివేకా పీఏ కృష్ణా రెడ్డి ఫిర్యాదు రాసిచ్చారు. ఈ కేసులో అవినాశ్‌ రెడ్డి, దొండవాగు శంకర్‌ రెడ్డి, దస్తగిరి, ఎర్ర గంగిరెడ్డి, ఎంవీ కృష్ణా రెడ్డి, ఉమా శంకర్‌ రెడ్డి, సునీల్‌ యాదవ్‌ ప్రవర్తన అక్కడ అనుమానాస్పదంగా ఉన్నట్లు గుర్తించాను’’ అని శంకరయ్య పేర్కొన్నారు.


వివేకా హత్య కేసు కడప సెషన్స్‌ కోర్టుకు బదిలీ

పులివెందుల కోర్టులో నిందితుల హాజరు

పులివెందుల, ఫిబ్రవరి 22: సీఎం వైఎస్‌ జగన్మోహన్‌రెడ్డి చిన్నాన్న, మాజీ మంత్రి వైఎస్‌ వివేకానందరెడ్డి హత్య కేసు కడప సెషన్స్‌ కోర్టుకు బదిలీ అయింది. మంగళవారం ఉదయం 11 గంటల ప్రాంతంలో హత్య కేసులోని నలుగురు నిందితులు.. ఏ-1 ఎర్రగంగిరెడ్డి, ఏ-2 సునీల్‌యాదవ్‌, ఏ-3 ఉమాశంకర్‌రెడ్డి, ఏ-4 షేక్‌ దస్తగిరి (అప్రూవర్‌) పులివెందుల కోర్టులో హాజరయ్యారు. ఏ-5గా ఉన్న దేవిరెడ్డి శివశంకర్‌రెడ్డి అనారోగ్యం కారణంగా కడప సెంట్రల్‌ జైలు నుంచి రాలేదు. సెంట్రల్‌ జైలు నుంచి సునీల్‌ యాదవ్‌, ఉమాశంకర్‌రెడ్డిలను పోలీసులు ప్రత్యేక వాహనంలో తీసుకురాగా.. అప్పటికే కోర్టుకు చేరుకున్న ఎర్రగంగిరెడ్డి, దస్తగిరి న్యాయమూర్తి ఎదుట హాజరయ్యారు. వీరికి కోర్టు దాదాపు 17వేల పేజీల చార్జిషీటు ప్రతులను లాయర్ల ద్వారా అందించింది. అనంతరం కేసును కడప సెషన్స్‌ కోర్టుకు బదిలీ చేస్తున్నట్లు తెలిపింది. సునీల్‌ యాదవ్‌, ఉమాశంకర్‌రెడ్డిలను పోలీసులు సెంట్రల్‌ జైలుకు తరలించారు. 


శంకర్‌రెడ్డి బెయిల్‌పై విచారణ నేటికి వాయిదా

వివేకా హత్య కేసులో ఐదో నిందితుడైన దేవిరెడ్డి శివశంకర్‌రెడ్డి బెయిల్‌ పిటిషన్‌పై మంగళవారం కడప నాలుగో అదనపు జిల్లా కోర్టులో విచారణ జరిగింది.  తదుపరి వాదనల కోసం విచారణను జడ్జి శ్రీనివాస్‌ శివరామ్‌ బుధవారానికి వాయిదావేశారు.


వివేకా హత్య కేసులో మరో ట్విస్ట్‌!

సీబీఐ అధికారిపై కేసు నమోదు

కడప(క్రైం/రూరల్‌), ఫిబ్రవరి 22: వివేకా హత్య కేసులో మరో ట్విస్ట్‌ చోటుచేసుకుంది. ఈ కేసును దర్యాప్తు చేస్తున్న సీబీఐ అధికారి రామ్‌సింగ్‌పై స్థానిక రిమ్స్‌ పోలీసులు కేసు నమోదు చేశారు. హత్య కేసు విచారణ పేరుతో ఆయన తనను వేధిస్తున్నారని పులివెందుల బాకరాపురానికి చెందిన ఉదయ్‌కుమార్‌రెడ్డి ఈ నెల 15న ఏఆర్‌ అదనపు ఎస్పీ మహేశ్‌కుమార్‌ను కలిసి లిఖితపూర్వకంగా ఫిర్యాదు చేశారు. కేసుకు సంబంధించి తనకు తెలిసిన విషయాలన్నీ చెప్పినా సీబీఐ అధికారులు పట్టించుకోవడం లేదని, వారు చెప్పినట్లు వినాలని వేధించడంతో పాటు తనను మానసిక, శారీరక ఇబ్బందులు పెడుతున్నట్లు ఆరోపించారు. అనంతరం కడప కోర్టులో పిటిషన్‌ దాఖలు చేశారు. కేసు నమోదు చేయాలని ఈ నెల 18న కోర్టు ఉత్తర్వులు ఇవ్వడంతో.. రామ్‌సింగ్‌పై ఐపీసీ 195ఏ, 323, 506 రెడ్‌విత్‌ 34 సెక్షన్ల కింద రిమ్స్‌ సీఐ సదాశివయ్య కేసు (క్రైం నంబర్‌ 29/2022) నమోదు చేశారు.


భద్రత కల్పించండి!

వాంగ్మూలం తర్వాత నాకు బెదిరింపులు: దస్తగిరి

పులివెందుల, ఫిబ్రవరి 22: మాజీ మంత్రి వైఎస్‌ వివేకానందరెడ్డి హత్య కేసులో భార్య, బిడ్డల కోసం మాత్రమే తాను అప్రూవర్‌గా మారానని దస్తగిరి పేర్కొన్నారు. మంగళవారం పులివెందులలో తన నివాసం వద్ద మీడియాతో మాట్లాడారు.  ‘‘రెండుసార్లు కోర్టులో అప్రూవర్‌ స్టేట్‌మెంట్‌ ఇచ్చాను. మొదటి వాంగ్మూలం ఇచ్చిన సమయంలో కొంతమంది బెదిరించారు. ప్రలోభాలకు గురి చేశారు. ఈ విషయాన్ని సీబీఐ ఎస్పీకి లేఖ ద్వారా వివరించాను. దీనిపై ఆయన కడప ఎస్పీకి లేఖ రాశారు. ఎస్పీ ఆదేశాల మేరకు భద్రత కోసం ఒక కానిస్టేబుల్‌ను నియమించారు. నేను ఎక్కడికి వెళ్లినా ముందుగా చెప్పాలన్నారు. ఒక కానిస్టేబుల్‌తో పూర్తిస్థాయి రక్షణ లభించదు. నాకు, నా కుటుంబానికి భద్రత కరువైంది. ప్రసుత్తం కేసు కీలక దశకు చేరుకుంది. మాకు పూర్తిస్థాయి భద్రత కల్పించాలి’’ అని దస్తగిరి కోరారు. రెండోసారి  స్టేట్‌మెంట్‌ ఇచ్చిన అనంతరం తనతో ఎవరూ మాట్లాడలేదని, బెదిరింపులు చేయలేదన్నారు. తాను డబ్బు కోసమే అప్రూవర్‌గా మారానని వచ్చిన వార్తల్లో నిజం లేదన్నారు. కేవలం భార్య, పిల్లలు అనాథలు అవుతారని అప్రూవర్‌గా మారానన్నారు. ‘‘నేను ఎవ్వరి వద్దా డబ్బులు తీసుకోలేదు. డబ్బు తీసుకొని అప్రూవర్‌గా మారినట్లు రాయవద్దు’’ అని దస్తగిరి మీడియాను కోరారు. 

Updated Date - 2022-02-23T07:49:12+05:30 IST