CM YS Jagan : సొంత జనానికి ప్రజాధనం

ABN , First Publish Date - 2022-11-08T04:45:54+05:30 IST

రాగద్వేషాలకు అతీతంగా, ఆశ్రిత పక్షపాతం లేకుండా బాధ్యతలు నిర్వహిస్తానని ముఖ్యమంత్రిగా వైఎస్‌ జగన్మోహన్‌రెడ్డి ప్రమాణం చేశారు.

CM YS Jagan : సొంత జనానికి  ప్రజాధనం
CM Jagan

‘సాక్షి’ సిబ్బందికి సర్కారు కొలువులు

సలహాదారుల నుంచి పీఆర్వోల వరకు వారే

200 కోట్ల సమర్పణ!

సీఎంవో నుంచి కార్పొరేషన్ల వరకు

మంత్రుల ఆఫీసుల్లోనూ సాక్షి సిబ్బంది నియామకం

సమాచార పౌరసంబంధాల శాఖలో కంటెంట్‌ రైటర్లూ వీరే

డిజిటల్‌ కార్పొరేషన్‌లోనూ వారికి భారీగా చోటు

ఓపక్క ‘సాక్షి’కి రూ.కోట్ల కొద్దీ ప్రభుత్వ ప్రకటనలు జారీ

ఇంకోపక్క అందులోని సిబ్బందికి రాష్ట్ర, జిల్లా స్థాయి పదవులు

సజ్జల రామకృష్ణారెడ్డి, జీవీడీ కృష్ణమోహన్‌, దేవులపల్లి అమర్‌, కొమ్మినేని శ్రీనివాసరావు, ఆర్‌ఎం భాషా.. ఇలా చెప్పుకొంటూ పోతే ఎందరో! ఒకప్పుడు జగన్‌ సొంత మీడియాలో ఉద్యోగం! ఇప్పుడు సర్కారులో కొలువు! సలహాదారుల నుంచి పీఆర్వోల వరకు పదుల సంఖ్యలో ‘సాక్షి’ సిబ్బందే! అక్కడ భారమైన వారిని ‘సర్కారు’లో విలీనం చేయడం! లేదా.. ప్రభుత్వ జీతంతో పార్టీ పనులు చేయించుకోవడం! ఇదీ వరస!

సలహాదారుల నుంచి పీఆర్వోల వరకు 40 మందికి పైగా ‘సాక్షి’ సిబ్బందికి ప్రభుత్వంలో కొలువులు ఇచ్చారు. వీరుకాక, డిజిటల్‌ కార్పొరేషన్‌లోనూ పెద్దసంఖ్యలో సాక్షి, వైసీపీ సోషల్‌ మీడియా ‘మాజీ’లను చేర్చుకున్నారు.

(అమరావతి-ఆంధ్రజ్యోతి)

రాగద్వేషాలకు అతీతంగా, ఆశ్రిత పక్షపాతం లేకుండా బాధ్యతలు నిర్వహిస్తానని ముఖ్యమంత్రిగా వైఎస్‌ జగన్మోహన్‌రెడ్డి ప్రమాణం చేశారు. మరుక్షణమే దానిని ఉల్లంఘించారు. సొంత మీడియా ‘సాక్షి’లో కీలక స్థానాలు, బాధ్యతల్లో ఉన్న వారి నుంచి జిల్లా స్థాయిలో పనిచేసే చాలా మందిని ప్రభుత్వంలో వివిధ పదవుల్లో కూర్చోబెట్టారు. తన పత్రికలో ఎడిటోరియల్‌ డైరెక్టర్‌గా ఉన్న సజ్జల రామకృష్ణారెడ్డిని ప్రభుత్వ సలహాదారుగా తీసుకున్నారు. కేబినెట్‌ హోదా ఇచ్చారు. ‘సాక్షి’లో కీలక బాధ్యతలు నిర్వహిస్తూనే జగన్‌కు సలహాలు, సూచనలూ అందిస్తూ వచ్చిన జీవీడీ కృష్ణమోహన్‌ను మీడియా సలహాదారుగా నియమించారు. అదేవిధంగా సొంత చానల్లో పనిచేస్తూ.. తన పర్యటనలు, ప్రసంగాలకు ప్రత్యేక కవరేజీ ఇవ్వడంలో కీలక పాత్ర పోషించే పూడి శ్రీహరికి నేరుగా చీఫ్‌ పబ్లిక్‌ రిలేషన్స్‌ ఆఫీసర్‌(సీపీఆర్వో)గా జగన్‌ నియమించుకున్నారు. వైసీపీలోకి వచ్చేందుకు సిద్ధపడిన రాజకీయ నేతలకు, ఆయనకు మధ్య శ్రీహరి సంధానకర్తగా వ్యవహరించారు. ఇక అదే మీడియాలో సేవలందిస్తూ వచ్చిన చంద్రకాంత్‌, రాజారమేశ్‌, ఈశ్వర్‌ వంటి వారిని సీఎం కార్యాలయం (సీఎంవో)లోకి తీసుకొచ్చారు. ముఖ్యమంత్రి సమీక్షలను కవర్‌ చేసేందుకు, ఆయన ప్రసంగాలు రాయడానికి వారిని నియమించుకున్నారు. వీరికి అగ్ర తాంబూలమిచ్చారు. తర్వాత రాజారమేశ్‌ను ఇటీవల రాష్ట్ర ఖనిజాభివృద్ధి సంస్థ(ఏపీఎండీసీ)లో ఏకంగా జనరల్‌ మేనేజర్‌ పోస్టులో కూర్చోబెట్టారు.

ఈ పదవిలో నియమించాలంటే ప్రత్యేక విద్యార్హతలు ఉండాలని.. దీని భర్తీకి పత్రికా ప్రకటన ఇవ్వాల్సి ఉంటుందని కూడా చెబుతున్నారు. కానీ ఇలాంటి విధానాలేవీ పాటించకుండా పోస్టు కేటాయించేశారు. ప్రభుత్వ సలహాదారు సజ్జల ముఖ్య సలహాదారు అయ్యారు. ఆయన పదవీకాలాన్ని కూడా మరో రెండేళ్లు పెంచారు. మీడియా సలహాదారు జీవీడీకీ మరో టెర్మ్‌ పెంచారు. ఇక రెండో వరుసలో.. సాక్షి మీడియాలోనే పనిచేస్తున్న దేవులపల్లి అమర్‌ను జాతీయ మీడియా సలహాదారుగా జగన్‌ నియమించారు. ఆయన ఏమేం సలహాలిచ్చారో/ఇస్తున్నారో తెలియదు గానీ.. ఆయనకిచ్చిన రెండేళ్ల పదవీకాలం పూర్తయి మరో రెండేళ్లకు రెన్యువల్‌ కూడా ఇచ్చారు. తాజాగా మరో సాక్షి ఉద్యోగి కొమ్మినేని శ్రీనివాసరావును రాష్ట్ర ప్రెస్‌ అకాడమీ చైర్మన్‌గా నియమించారు. వీరికి కేబినెట్‌ హోదా కూడా కల్పించారు. సాక్షి దినపత్రికలో పనిచేసి పదవీ విరమణ చేసిన విలేకరి ఆర్‌ఎం బాషాను సమాచార హక్కు చట్టం (ఆర్‌టీఐ) ప్రధాన కమిషనర్‌గా ముఖ్యమంత్రి జగన్‌ నేతృత్వంలోని కమిటీ ఎంపిక చేసింది. వీరే కాకుండా సాక్షి మీడియాలో రాష్ట్ర, జిల్లా స్థాయుల్లో పనిచేసిన పలువురు ఉద్యోగులను రాష్ట్రస్థాయి కార్పొరేషన్లలోను, మంత్రులకు పీఆర్వోలుగా నియమించారు. జిల్లాల్లోనూ భారీ సంఖ్యలో పీఆర్వోలను నియమించారు. వీరందరికీ ప్రభుత్వ ఖజానా నుంచే జీతాలు ఇస్తున్నారు.

దేశంలో ఎక్కడా లేదు..

ఇలా సొంత మీడియా సంస్థలో పనిచేసేవారిని ప్రభుత్వంలో కీలక పదవుల్లో కూర్చోబెట్టి వేలు, లక్షల్లో వేతనాలివ్వడం దేశంలో మరే రాష్ట్రంలోనూ కనిపించదు. జగన్‌ వచ్చాకే ఇలాంటి అడ్డగోలు నియామకాలతో ప్రజాధనాన్ని దుర్వినియోగం చేస్తున్నారన్న విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. ఈ సంతర్పణ గత మూడేళ్లలో రూ.200 కోట్లకు పైనే ఉంటుందని ప్రభుత్వ వర్గాల్లోనే ప్రచారం జరుగుతోంది. పాలనలో పారదర్శకత ఉంటుందని.. కోరిన వెంటనే సంబంధిత ఫైళ్లను అందరి ముందూ ఉంచుతామని గొప్పలకు పోయిన ప్రభుత్వ పెద్దలు.. అసలు సాక్షి మీడియా నుంచి ఎంత మందిని తీసుకున్నారో.. వారికి ప్రతి నెలా అందిస్తున్న జీతభత్యాలెంతో.. బహిర్గతపరచాలన్న డిమాండ్‌ బలీయంగా వినిపిస్తోంది.

కంటెంట్‌ రైటర్లు..

రాష్ట్ర, జిల్లా స్థాయుల్లో పనిచేస్తున్న పలువురు విలేకరులను ప్రభుత్వ శాఖల్లోకి తీసుకున్నారు. ముఖ్యంగా వీరిలో చాలా మందిని సమాచార పౌరసంబంధాల శాఖ ప్రభుత్వ పథకాలపై కథనాలు రాసేందుకు కంటెంట్‌ రైటర్‌లుగా తీసుకుంది. నెలనెలా వేలల్లో జీతాలిస్తోంది. మరికొందరు సాక్షి ఉద్యోగులను ప్రభుత్వ సామాజిక మీడియాకు వినియోగించుకుంటోంది. సొంత మీడియాలో పనిచేసే కెమేరామెన్‌, వీడియోగ్రాఫర్లను కూడా సీఎంవోలో డబుల్‌ ధమాకా జీతాలతో జగన్‌ నియమించుకున్నారు. ఒక్కొక్కరూ రూ.75 వేలకు తగ్గకుండా రూ.లక్షన్నర వరకూ అందుకుంటున్నారు. వీరితో పాటు రియల్‌ టైమ్‌ గవర్నెన్స్‌లో.. ప్రభుత్వ పథకాలను ప్రజలకు చేరవేసే మిషతో దాదాపు 100 మంది సాక్షి ఉద్యోగులు సమాచార పౌర సంబంధాల శాఖ పరిధిలో పనిచేస్తున్నారు. సామాజిక మాధ్యమాల ద్వారా పథకాలను జనాలకు చేరవేయడం వీరి ప్రధాన విధి. కానీ ప్రతిపక్షాలపై రాజకీయంగా బురద జల్లేందుకే వీరిలో కొందరు పనిచేస్తున్నారన్న విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. సమాచార పౌరసంబంధాల శాఖ వీరికి జీతాలిస్తోంది. కానీ దానికి వీరిపై ఎలాంటి అజమాయిషీ ఉండదు. అంతేకాదు.. జగన్‌ సర్కారు ఏర్పడిన ఏడాదిలోపే.. తమ జీతాలను రూ.లక్షకు చేర్చాలంటూ అప్పటి పౌరసంబంధాల మంత్రి పేర్ని నానిపై వీరు తీవ్ర స్థాయిలో ఒత్తిడి తెచ్చారు. దాని ఫలితంగానే సామాజిక మాధ్యమ విభాగంలో పనిచేస్తున్న సిబ్బంది జీతభత్యాలు ఇబ్బడిముబ్బడిగా పెరిగాయని చెబుతున్నారు.

Updated Date - 2022-11-08T06:37:54+05:30 IST