రియల్‌ ఎస్టేట్‌లోకి వైఎస్‌ ఫ్యామిలీ

ABN , First Publish Date - 2022-07-31T07:58:53+05:30 IST

విశాఖపట్నం రియల్‌ ఎస్టేట్‌ రంగంలోకి వైఎస్‌ కుటుంబం అడుగుపెట్టింది. విశాఖను రాష్ట్ర పరిపాలనా రాజధానిగా ప్రకటించిన నేపథ్యం

రియల్‌ ఎస్టేట్‌లోకి వైఎస్‌ ఫ్యామిలీ

‘విల్లాసం’ పేరిట విశాఖలో భారీ ప్రాజెక్టు

భాగస్వాముల్లో జగన్‌ బాబాయి రవీంద్రనాథ్‌రెడ్డి 

ఈయన వైఎస్‌ రాజశేఖరరెడ్డి చివరి తమ్ముడు

కాపులుప్పాడలో 11 ఎకరాల్లో విల్లాల నిర్మాణం

ఇక్కడే ‘రాజధాని’ వస్తుందని తొలినుంచీ ప్రచారం

ఆగ్‌మెంట్‌ రియాల్టీ ఎల్‌ఎల్పీ పేరిట సంస్థ

ఒక్కో విల్లా రూ.3 కోట్లు నుంచి రూ.6 కోట్లు


విశాఖపట్నం, జూలై 30(ఆంధ్రజ్యోతి): విశాఖపట్నం రియల్‌ ఎస్టేట్‌ రంగంలోకి వైఎస్‌ కుటుంబం అడుగుపెట్టింది. విశాఖను రాష్ట్ర పరిపాలనా రాజధానిగా ప్రకటించిన నేపథ్యం లో వారిక్కడ స్థిరాస్తి వ్యాపారం ప్రారంభించ డం అందరి దృష్టిని ఆకర్షిస్తోంది. అది కూడా రాజధాని కార్యాలయాలు వస్తాయని ప్రకటించిన భీమిలి మండలం కాపులుప్పాడలో ఈ ప్రాజెక్టును ప్రారంభించడం గమనార్హం. దీనికి సంబంధించిన వ్యవహారాలను శనివారం విశాఖలో వివరించారు. ‘ఆగ్‌మెంట్‌ రియాల్టీ ఎల్‌ఎల్‌పీ’ పేరుతో భాగస్వామ్య సంస్థ ఏర్పాటుచేసి, దాని పేరు మీద విశాఖలో అతి పెద్ద విల్లా ప్రాజెక్టు చేపడుతున్నట్టు... భాగస్వాముల్లో ఒకరైన వైఎస్‌ రవీంద్రనాథ్‌రెడ్డి ప్రకటించారు. ఈయన వైఎస్‌ రాజశేఖరరెడ్డి చివరి తమ్ముడు, సీఎం జగన్‌కు బాబాయి. ఈ సంస్థలో మరో ఇద్దరు భాగస్వాములు ఉన్నారు. వారిలో ఒకరు వైఎస్‌ రాగ్‌దీ్‌పరెడ్డి, మరొకరు వైఎస్‌ సుమధుర్‌రెడ్డి. ‘‘మాకు గత 38 ఏళ్లుగా పరిచయం ఉన్న విజయ్‌ మిట్టల్‌ అనే వ్యక్తికి కాపులుప్పాడలో 30 ఎకరాల స్థలం ఉంది. అందులోని 11 ఎకరా ల్లో తొలి ప్రాజెక్టుగా ‘విల్లాసం’ పేరుతో విల్లాల నిర్మాణం చేపడుతున్నాం. కేవలం 62 విల్లాలు మాత్రమే నిర్మిస్తున్నాం. ఒక్కొక్కటి 400 గజాల నుంచి 600 గజాల విస్తీర్ణంలో నాలుగు వేల చదరపు అడుగుల నుంచి 6,500 చదరపు అడుగుల వైశాల్యంలో ఉంటుంది. దీనిని ఏప్రి ల్‌ 2024 నాటికి పూర్తిచేస్తాం. ఒక్కొక్కటి రూ.3 కోట్ల నుంచి రూ.6 కోట్ల వరకు ఉంటుంది’’ అని రవీంద్రనాథ్‌రెడ్డి తెలిపారు.  


వ్యాపారాలన్నీ హైదరాబాద్‌లోనే...

‘ఆగ్‌మెంట్‌ రియాల్టీ ఎల్‌ఎల్‌పీ’ ఏర్పాటుచేసిన వైఎస్‌ కుటుంబీకులు ముగ్గురూ హైదరాబాద్‌ మాదాపూర్‌ కేంద్రంగా వ్యాపారాలు చేస్తున్నారు. ఎంటర్‌ప్రైజెస్‌, ఇన్‌ఫ్రా ప్రాజెక్ట్స్‌, గ్యాస్‌, బిజినెస్‌ కన్సల్టెన్సీ, సాఫ్ట్‌వేర్‌ సొల్యూషన్స్‌ పేరు తో వ్యాపారాలు చేస్తున్నారు. వాటిని మాదాపూర్‌లోని విఠల్‌నగర్‌ అడ్రస్‌ పేరుతోనే రిజిస్టర్‌ చేయించారు. ఈ రియాల్టీ సంస్థ కూడా ఆ అడ్ర్‌సతోనే నమోదై ఉండటం విశేషం. 

Read more