Dwakra Sanghalu‘డ్వాక్రా’ల్లో నాటి వెలుగేదీ?

ABN , First Publish Date - 2022-11-19T03:17:40+05:30 IST

ఒకప్పుడు ఓ వెలుగు వెలిగిన డ్వాక్రా సంఘాలు వైసీపీ సర్కార్‌ నిర్ణయాలతో ప్రాభవం కోల్పోతున్నాయి. తాము పొదుపు చేసుకున్న ప్రతి రూపాయితో.. దిన దిన ప్రవర్ధమానమై ఇతరులకు రుణాలిచ్చే సంస్థలుగా ఎదిగిన పొదుపు సంఘాలు.. ఇప్పుడు సీఎం సభలకు జనాలను తరలించేందుకు మాత్రమే పరిమితమయ్యాయన్న విమర్శలు

Dwakra Sanghalu‘డ్వాక్రా’ల్లో నాటి వెలుగేదీ?

బతుకులు మార్చిన పొదుపు సంఘాలు

దేశానికి ఆదర్శంగా ఆంధ్రప్రదేశ్‌

వైసీపీ సర్కార్‌ నిర్ణయాలతో తగ్గుతున్న ప్రాభవం

బహిరంగ సభల జనసమీకరణకే పరిమితం

వలంటీర్ల పెత్తనంలోకి తెచ్చేందుకు సన్నాహాలు

ప్రధాని మోదీ నోటి వెంట కూడా ఇదే ప్రస్తావన

వైసీపీని ఎండగట్టాలని బీజేపీ శ్రేణులకు ఆదేశం!

(అమరావతి-ఆంధ్రజ్యోతి): ఒకప్పుడు ఓ వెలుగు వెలిగిన డ్వాక్రా సంఘాలు వైసీపీ సర్కార్‌ నిర్ణయాలతో ప్రాభవం కోల్పోతున్నాయి. తాము పొదుపు చేసుకున్న ప్రతి రూపాయితో.. దిన దిన ప్రవర్ధమానమై ఇతరులకు రుణాలిచ్చే సంస్థలుగా ఎదిగిన పొదుపు సంఘాలు.. ఇప్పుడు సీఎం సభలకు జనాలను తరలించేందుకు మాత్రమే పరిమితమయ్యాయన్న విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. ఒకప్పుడు డ్వాక్రా సంఘాలంటే ఆంధ్రప్రదేశ్‌ పేరు చెప్పుకునే దేశంలో ఇప్పుడు ఆ ఊసే లేదు. సాక్షాత్తు ప్రధాని మోదీ విశాఖ పర్యటనలో తమ సొంత పార్టీ నేతలతో చర్చ సందర్భంగా రాష్ట్రంలో డ్వాక్రా సంఘాల పరిస్థితిపై ఆరా తీశారని సమాచారం. ప్రాభవం కోల్పోతున్న డ్వాక్రా సంఘాల విషయంపై జనాల్లో చైతన్యం తీసుకు రావాలని, వైసీపీని ఎండగట్టాలని ఆ పార్టీ నేతలకు దిశా నిర్దేశం చేశారు. దేశ ప్రధాని దృష్టిలోకి మన డ్వాక్రా సంఘాల పరిస్థితి వెళ్లిందంటే రాష్ట్రంలో ఏం జరుగుతుందో అర్థం చేసుకోవచ్చు.

చంద్రబాబు హయాంలో సరికొత్త వెలుగు

దేశంలో 9 కోట్ల కుటుంబాలను స్వయం సహాయక సభ్యులుగా మారేందుకు స్ఫూర్తినిచ్చింది మన రాష్ట్రమేనని చెప్పవచ్చు. మన రాష్ట్రంలోనే సుమారు 94 లక్షల మంది సభ్యులు పొదుపు గ్రూపులుగా ఏర్పడి ఆర్థిక కార్యకలాపాలు నిర్వహించుకుంటున్నారు. నెల్లూరు జిల్లాలో ప్రారంభమైన పొదుపు సంఘాలు రాష్ట్రమంతా విస్తరించి చివరకు సారా ఉద్యమం లాంటి సామాజిక ఉద్యమాలకు స్ఫూర్తినిచ్చాయి. 2014 నుంచి మన రాష్ట్రంలోని 654 మండలాలతో పాటు పట్టణ ప్రాంతాల్లోనూ ప్రతి ఇంటిలో కనీసం ఒక స్వయం సహాయక సభ్యురాలు ఉండేలా ప్రభుత్వం చర్యలు తీసుకుంది. దేశంలో మూడు కోట్లకు పైగా పేద మహిళలు 26.9 లక్షల గ్రూపులుగా ఏర్పడితే అందులో ఒక్క మన రాష్ట్రంలో 10 లక్షలకు పైగా గత ఐదేళ్లలో నమోదయ్యారు. గత ఐదేళ్లలో దేశ వ్యాప్తంగా రూ.1.96 లక్షల కోట్లు పొదుపు సంఘాలకు బ్యాంకులు రుణాలుగా ఇచ్చాయంటే వాటి ప్రభావం ఏ మేరకు ఉందో అర్థం చేసుకోవచ్చు. బ్యాంకుల్లో నాన్‌ పెర్మార్మెన్స్‌ అసెట్‌ రేట్‌ కూడా 2.64 శాతానికి దిగివచ్చింది. సకాలంలో బ్యాంకులకు రుణాలు తిరిగి చెల్లించడంతోనే ఇది సాధ్యమైంది. ఒకప్పుడు గ్రామీణ పేదలకు రుణాలివ్వాలంటే భయపడే బ్యాంకులు ఇప్పుడు సంఘటిత శక్తిగా ఉన్న డ్వాక్రా గ్రూపులకు రుణాలివ్వడానికి రెడ్‌ కార్పెట్‌ పరుస్తున్నాయి. మన రాష్ట్రంలో డిసెంబరు 2018 నాటికి 3.32 లక్షల స్వయం సహాయక బృందాలకు రూ.10,752 కోట్లు రుణాలిచ్చాయి. రాష్ట్ర వ్యాప్తంగా మహిళా సంఘాల సభ్యుల్లో 3050 మంది బ్యాంకింగ్‌ కరస్పాండెంట్‌ ఏజెంట్లుగా మారి గ్రామీణ ప్రాంతాల్లో బ్యాంకింగ్‌ సేవలందిస్తున్నారు.

డిపాజిట్లు, అప్పులివ్వడం, జమ చేసుకోవడం, పెన్షన్లు, స్కాలర్‌షిప్పులు, ఉపాధి వేతనాల పంపిణీ, బీమామిత్రలుగాను పనిచేస్తున్నారు. మహిళా రైతుల ఆధ్వర్యంలో సేంద్రీయ వ్యవసాయం మన రాష్ట్రంలో సరికొత్త విప్లవం తెచ్చింది. ఐదేళ్లలో 3 లక్షల మహిళా రైతులు అదనంగా మహిళా రైతులు సేంద్రీయ సేద్యంలోకి ప్రవేశించారు. ప్రకృతి సేద్యంలోనూ మన రాష్ట్రం ఆదర్శంగా నిలిచింది. డ్వాక్రా గ్రూపుల ఆధ్వర్యంలో అన్న సంజీవని పేరుతో జనరిక్‌ మెడికల్‌ షాపులు నడుస్తున్నాయి. ఉపాధి హామీ పథకంలో అవెన్యూ ప్లాంటేషన్‌ మహిళా సంఘాల ద్వారా నిర్వహించారు. ప్రతి గ్రామంలో, వార్డుల్లో ప్రభుత్వ పథకాలు పేదల దరి చేర్చేందుకు ప్రతి 33 కుటుంబాలకు ఒక సాధికారమిత్రను నియమించి రాష్ట్ర ప్రభుత్వం వారికి గుర్తింపునిచ్చింది. చంద్రన్న పెళ్లికానుక పథకంలో పెళ్లి పెద్దగా వ్యవహరించి వారికి కానుకను అందించేందుకు కల్యాణమిత్రగా ఎంపికయ్యారు. కోటి మంది స్వయం సహాయక సభ్యులతో పాటు రెండున్నర కోట్ల అసంఘటితరంగ కార్మికుల బీమాకు సంబంధించి చంద్రన్న బీమా పథకం ద్వారా పేదలకు సేవలందించారు. ప్రభుత్వంలో అనేక కీలక పథకాలు వారి ఆధ్వర్యంలో నడిచాయి దీంతోపాటు గ్రామాల్లో ఉపాధి వేతనాలు పంపిణీ చేసేందుకు, పెన్షన్ల పంపిణీకి డ్వాక్రా సంఘాల సభ్యులనే ఎంపిక చేశారు.

ఇప్పుడు అక్కచెల్లెమ్మల సొమ్ముకు ఎసరు

రాష్ట్రంలో స్వయం సహాయక సంఘాల సొమ్ముకు ఎసరు పెట్టేందుకు సర్కార్‌ గత ఏడాది సన్నాహాలు ప్రారంభించింది. డ్వాక్రా సంఘాల సార్వభౌమాధికారాలను గ్రామ, వార్డు సచివాలయాల పరిధిలోకి తీసుకురావడం ద్వారా ప్రభుత్వ పెత్తనంలోకి డ్వాక్రా సంఘాలను తెచ్చేందుకు ప్రయత్నాలు ప్రారంభించారు. గత ఏడాది జూలైలో గ్రామీణ పేదరిక నిర్మూలన సంస్థ(సెర్ప్‌) డ్వాక్రా సంఘాలకు సింగిల్‌ విండో విధానమంటూ ఇచ్చిన సర్క్యులర్‌తో డ్వాక్రా సంఘాలు నివ్వెరపోయాయి. దర్జాగా బ్యాంకుల నుంచి రుణాలు తీసుకుంటున్న పొదుపు సంఘాల సభ్యులు ఇక గ్రామ, వార్డు వలంటీర్ల దయాదాక్షిణ్యాలతో రుణాలు తీసుకోవాల్సిన పరిస్థితి వస్తుందని ఆందోళన చెందారు. పొదుపు చేసిన మొత్తాన్ని డ్రా చేసుకుని ఆ తర్వాత బ్యాంకు రుణాలకు వెళ్లాలన్న ప్రభుత్వ యోచన డ్వాక్రా సంఘాలకు ఇస్తున్న సున్నా వడ్డీ ఎగ్గొట్టేందుకేనంటూ ప్రభుత్వంపై అనుమానం వచ్చింది. డ్వాక్రా సంఘాలు రోడ్డెక్కి నిరసనలు తెలపడంతో వెనక్కి తగ్గారు. కానీ, ఏ రోజుకైనా డ్వాక్రా సంఘాలు గ్రామ, వార్డ్‌ సచివాలయ పరిధిలోకి రావాలని, వలంటీర్ల ఆధ్వర్యంలోనే పొదుపు సంఘాల నిర్వహణ చేపట్టాలని ప్రభుత్వం కృత నిశ్చయంతో ఉంది. పైగా గతంలో రూ.5 లక్షల వరకు రుణం తీసుకున్న డ్వాక్రా సంఘాలకు జీరో వడ్డీ ఇచ్చేవారు. ఈ ప్రభుత్వం వచ్చిన తర్వాత దానిని రూ.3 లక్షలకే పరిమితం చేశారు.

బీమామిత్రల తొలగింపు !

2008లో అప్పటి ప్రభుత్వం ఆమ్‌ ఆద్మీ బీమా యోజన, అభయహస్తం లాంటి బీమా పథకాల ఫలాలను కల్పించేందుకు రాష్ట్ర వ్యాప్తంగా చురుకుగా ఉన్న డ్వాక్రా సంఘాల సభ్యుల నుంచి సుమారు 1350 మంది పదోతరగతి పాసైన మహిళలను ఎంపిక చేశారు. చంద్రబాబు హయాంలో చంద్రన్న బీమా కోసం పనిచేశారు. కాల్‌సెంటర్లకు వచ్చిన కాల్స్‌ను రిసీవ్‌ చేసుకుని మండలస్థాయిలో బీమాకు సంబంధించిన సమస్యలకు పరిష్కారం చూపేవారు. పేద కుటుంబంలోని వ్యక్తి ఎక్కడ మరణించినా వారి కాల్‌ సెంటర్లకు ఫోన్లు వెళ్లేవి. చనిపోయిన కుటుంబాలకు ఆసరాగా నిలబడుతూ మట్టి ఖర్చుల కింద రూ.5 వేలు బీమా మిత్రల ఆధ్వర్యంలో చెల్లించేవారు. అప్పటి ప్రభుత్వం వారి సేవలకు రూ.3 వేలు పారితోషికం అందించేంది. అలాంటి సిబ్బందికి వైసీపీ సర్కార్‌ వచ్చిన వెంటనే కష్టాలు ప్రారంభమయ్యాయి. ఈ ప్రభుత్వం వచ్చిన వెంటనే చంద్రన్న బీమాకు స్వస్తి పలికారు. మళ్లీ వైఎ్‌సఆర్‌ బీమా ప్రారంభించేందుకు ఏడాది పట్టింది. వైఎ్‌సఆర్‌ బీమా దరఖాస్తులతో పాటు క్లయింలకు సంబంధించిన లావాదేవీలన్నీ గ్రామ, వార్డు సచివాలయాల్లో ఉన్న వలంటీర్లకు బాధ్యతలు అప్పగించడంతో వారికి బాధ్యతలు లేకుండా పోయాయి. చంద్రన్న పెళ్లికానుక అందించేందుకు కళ్యాణ మిత్రలుగా డ్వాక్రా సభ్యులను గతంలో నియమించారు. మూడేళ్ల పాటు పెళ్లికానుక లేకపోవడంతో డ్వాక్రా సభ్యులందరినీ తొలగించారు. సీఎం సభకు జనాలను తరలించేందుకు మాత్రం డ్వాక్రా సంఘాలను, సభ్యులను ఉపయోగించుకుంటున్నారని, స్వయం సహాయక సంఘాల అభివృద్ధికి ప్రభుత్వం ఎలాంటి చర్యలూ తీసుకోలేదన్న అసంతృప్తి అందరిలోనూ ఉంది.

Updated Date - 2022-11-19T03:17:40+05:30 IST

Read more