పీజీ కేంద్రంలో వైసీపీ ఆఫీసా?

ABN , First Publish Date - 2022-04-19T08:56:34+05:30 IST

రాష్ట్రవ్యాప్తంగా నిబంధనలకు విరుద్ధంగా నీటి వనరుల(చెరువులు, నదులు, కాలువలు) సమీపంలో ఏర్పాటు చేసిన పెట్రోల్‌ బంకుల వివరాలను తమ ముందు ఉంచాలని

పీజీ కేంద్రంలో వైసీపీ ఆఫీసా?

కౌంటర్‌ దాఖలు చేయండి

 ప్రభుత్వానికి హైకోర్టు ఆదేశం 

అమరావతి, ఏప్రిల్‌ 18(ఆంధ్రజ్యోతి): కాకినాడ జిల్లా, తిమ్మాపురం గ్రామంలోని సర్వే నెంబర్లు 110, 113లోని ఎంఎస్‌ నాయకర్‌ పీజీ కేంద్రానికి సంబంధించిన భూమిలో అధికార వైసీపీ ఆఫీస్‌ ఏర్పాటుకి జరుగుతున్న ప్రయత్నాలను నిలువరించాలని కోరుతూ దాఖలైన పిల్‌పై హైకోర్టు స్పందించింది. ఈ వ్యవహారంపై కౌంటర్‌ దాఖలు చేయాలని వ్యాజ్యంలో ప్రతివాదులుగా ఉన్న రెవెన్యూశాఖ ముఖ్యకార్యదర్శి, కాకినాడ జిల్లా కలెక్టర్‌, తిమ్మాపురం గ్రామపంచాయితీ సెక్రెటరీ, నాయకర్‌ పీజీ కాలేజ్‌ ప్రిన్సిపల్‌, కాకినాడ వైసీపీ పార్టీ జనరల్‌ సెక్రెటరీకి నోటీసులు జారీ చేసింది. పార్టీ కార్యాలయం ఏర్పాటుకి అక్కడ ఉన్న చెట్లను నరికివేస్తున్నారని.. మధ్యంతర ఉత్తర్వులు ఇవ్వాలని పిటిషనర్‌ చేసిన అభ్యర్థనను తిరస్కరించింది. పార్టీ కార్యాలయం ఏర్పాటు అంశం తామిచ్చే తుదితీర్పుకి లోబడి ఉంటుందని స్పష్టం చేసింది. విచారణను 4 వారాలకు వాయిదా వేసింది. ఈ మేరకు హైకోర్టు ప్రధాన న్యాయమూర్తి జస్టిస్‌ ప్రశాంత్‌కుమార్‌ మిశ్రా, జస్టిస్‌ ఎం. సత్యనారాయణమూర్తితో కూడిన ధర్మాసనం సోమవారం ఆదేశాలిచ్చింది. పిటిషనర్‌ గణేశ్‌ తరఫు న్యాయవాది కేఎస్‌ మూర్తి వాదనలు వినిపించారు. 


నీటి వనరుల సమీపంలో ఉన్న పెట్రోల్‌ బంకుల వివరాలివ్వండి

రాష్ట్రవ్యాప్తంగా నిబంధనలకు విరుద్ధంగా నీటి వనరుల(చెరువులు, నదులు, కాలువలు) సమీపంలో ఏర్పాటు చేసిన పెట్రోల్‌ బంకుల వివరాలను తమ ముందు ఉంచాలని ఏపీ కాలుష్య నియంత్రణ మండలి(పీసీబీ) కార్యదర్శిని హైకోర్టు ఆదేశించింది. నివేదిక ఆధారంగా వాటి తొలగింపునకు ఆదేశాలు జారీ చేస్తామని స్పష్టం చేసింది. ఈమేరకు ప్రధాన న్యాయమూర్తి జస్టిస్‌ ప్రశాంత్‌కుమార్‌ మిశ్రా, జస్టిస్‌ ఎం.సత్యనారాయణమూర్తితో కూడిన ధర్మాసనం సోమవారం ఆదేశాలిచ్చింది. పీసీబీ మార్గదర్శకాలకు, నేషనల్‌ గ్రీన్‌ ట్రైబ్యునల్‌ ఆదేశాలకు విరుద్ధంగా చిత్తూరు జిల్లా యలమందలో పాఠశాల, నీటివనరులకు సమీపంలో పెట్రోల్‌ బంక్‌ ఏర్పాటు చేశారని పిటిషనర్‌ బి.భాస్కర్‌ రెడ్డి తరఫు న్యాయవాది పి.సరస్వతి తెలిపారు.  


డిప్యూటీ ఇంజనీర్‌పై క్రిమినల్‌ కేసు పెట్టండి

బిల్లులు సర్టిఫై చేసే విషయంలో యునివర్సిటీ డిప్యూటీ ఇంజనీర్‌ అవకతవకలకు పాల్పడి ఉంటే ఆయనపై క్రిమినల్‌ కేసు పెట్టాలని ఎన్టీఆర్‌ హెల్త్‌ యునివర్సిటీ వైస్‌ చాన్స్‌లర్‌కు హైకోర్టు ఆదేశించింది. తప్పు చేశారని నిర్ధారణ అయిన తరువాత మెమో ఇచ్చి వదిలేయడం ఏంటని వీసీని నిలదీసింది. యూనివర్సిటీ స్నాతకోత్సవం కోసం షామియానా ఏర్పాటు చేసి, పెట్టుకొన్న బిల్లులో వివాదంలేని రూ.3.50 లక్షలను పిటిషనర్‌కు వారంలో చెల్లించాలని ఆదేశించింది. కౌంటర్‌ దాఖలు చేయాలని ప్రతివాదులను ఆదేశించింది. విచారణను జూన్‌ 14కి వాయిదా వేసింది. ఈ మేరకు హైకోర్టు న్యాయమూర్తి జస్టిస్‌ బట్టు దేవానంద్‌ సోమవారం ఆదేశాలిచ్చారు. యునివర్సిటీ స్నాతకోత్సవం కోసం షామియానా ఏర్పాటు చేసిన లక్ష్మీనరసింహ షామియానా సప్లయర్స్‌ యజమాని వెంకటేశ్వర్లు వర్సిటీ అధికారులు తమను వేధిస్తున్నారంటూ హైకోర్టును ఆశ్రయించారు. గతంలో ఈ వ్యాజ్యంపై విచారణ జరిపిన న్యాయమూర్తి.. ఈ విషయంపై కోర్టుముందు హాజరుకావాలని వర్సిటీ వీసీ శాంప్రసాద్‌, రిజిస్ట్రార్‌లను ఆదేశించారు. దీంతో వారు సోమవారం కోర్టుకు వచ్చారు. పిటిషనర్‌ తరఫు న్యాయవాది షేక్‌ ఖాదర్‌వల్లి వాదనలు వినిపిస్తూ.. ‘స్నాతకోత్సవం కోసం కావాల్సిన సామాగ్రిని సరఫరా చేశాం. చెల్లింపుల కోసం సమర్పించిన బిల్లులో అధికారులు కోత విధించారు. పూర్తి సొమ్మును చెల్లించేలా ఆదేశాలు ఇవ్వండి’ అని కోరారు. వర్సిటీ తరఫు న్యాయవాది విజయ్‌కుమార్‌ వాదనలు వినిపిస్తూ.. డిప్యూటీ ఇంజనీర్‌ దురుద్దేశపూర్వకంగా బిల్లులను సర్టిఫై చేశారన్నారు.  


ఎయిడెడ్‌ టీచర్ల జీతాలు చెల్లించండి

  ఎయిడెడ్‌ కళాశాలల నుంచి ప్రభుత్వ కాలేజీల్లో విలీనమైన ప్రిన్సిపాల్స్‌, టీచర్ల జీతాలను తక్షణం చెల్లించాలని రాష్ట్ర ప్రభుత్వాన్ని హైకోర్టు ఆదేశించింది. ఈ మేరకు హైకోర్టు న్యాయమూర్తి బట్టు దేవానంద్‌ సోమవారం మధ్యంతర ఉత్తర్వులు జారీ చేశారు. తమకు 8 నెలలుగా జీతాలు చెల్లించడం లేదంటూ ఎయిడెడ్‌  పలువురు టీచర్లు, ప్రిన్సిపాల్స్‌ హైకోర్టును ఆశ్రయించారు. ఈ వ్యాజ్యం సోమవారం విచారణకు రాగా.. పిటిషనర్ల తరఫున న్యాయవాది నర్రా శ్రీనివాస్‌ వాదనలు వినిపించారు.

Read more