అవును.. డ్రైవర్‌ను నేనే హత్య చేశా.. నిజం ఒప్పుకున్న YCP ఎమ్మెల్సీ!

ABN , First Publish Date - 2022-05-23T19:41:43+05:30 IST

డ్రైవర్ సుబ్రహ్మణ్యం హత్య కేసులో వైసీపీ ఎమ్మెల్సీ ఉదయ్‌ భాస్కర్‌ను పోలీసులు రహస్యంగా విచారిస్తున్నారు.

అవును.. డ్రైవర్‌ను నేనే హత్య చేశా.. నిజం ఒప్పుకున్న YCP ఎమ్మెల్సీ!

కాకినాడ : వైసీపీ ఎమ్మెల్సీ అనంత ఉదయ్ భాస్కర్(Anantha uday bhaskar) డ్రైవర్ సుబ్రహ్మణ్యం హత్య రాష్ట్ర వ్యాప్తంగా సంచలనం సృష్టించిన సంగతి తెలిసిందే. అటు ప్రతిపక్షాల నుంచి.. ఇటు ప్రజా సంఘాల నుంచి పెద్ద ఎత్తున తీవ్ర విమర్శలు వస్తుండటం.. ఇంతజరుగుతున్నా పోలీసులు ఏం చేస్తున్నారు..? అధికార పార్టీకి కొమ్ముకాస్తున్నారనే ఆరోపణలు వస్తుండటంతో ఈ  కేసును సీరియస్‌గా తీసుకున్న పోలీసులు సోమవారం నాడు ఛేదించారు.! ఇవాళ ఉదయం నుంచీ ఓ వైపు అరెస్ట్ చేశారని పుకార్లు షికార్లు చేస్తుండటం.. మరోవైపు అస్సలు అరెస్టే చేయలేదని.. అదంతా ఒట్టిదే అని ఇలా పెద్ద హైడ్రామానే నడిచింది. అయితే తాజాగా అందిన విశ్వసనీయ వర్గాల సమాచారం మేరకు.. ఇవాళ ఉదయం ఎమ్మెల్సీ అనంతను అరెస్ట్ చేసి రహస్య ప్రదేశంలో విచారిస్తున్నట్లు తెలుస్తోంది.


నేనొక్కడినే హత్య చేశా..!

అవును.. నేనే హత్య చేశాను.. ఇందులో ఎవరి ప్రమేయం లేదు.. నేనొక్కడినే హత్య చేశాను. వ్యక్తిగత వ్యవహారాల్లో జోక్యం చేసుకున్నందుకే సుబ్రమణ్యంను హత్య చేశాను. నా వ్యక్తిగత విషయాలు అందరికీ చెబుతానని బ్లాక్‌మెయిల్ చేశాడు. మొదట సుబ్రమణ్యంను కొట్టి బెదిరిద్దామనుకున్నా.. కానీ అదంతా అలా జరిగిపోయింది’ అని పోలీసు విచారణలో ఎమ్మెల్సీ నిజం ఒప్పుకున్నట్లు తెలుస్తోంది. ఈ విచారణ అనంతరం ఇంటికొచ్చి డ్రైవర్‌ను తీసుకెళ్లిన దగ్గర్నుంచి.. హత్యచేసి ఇంటికి మృతదేహాన్ని తరలిచినంత వరకు పోలీసులు సీన్ రీకన్‌స్ట్రక్షన్ కూడా చేసినట్లు సమాచారం. అయితే అరెస్ట్ చేసినట్లు కానీ.. సీన్ రీకన్‌స్ట్రక్షన్ చేసినట్లు కానీ పోలీసులు ఎక్కడా ఇసుమంత కూడా మీడియాకు సమాచారం ఇవ్వలేదు. అయితే విశ్వసనీయవర్గాల సమాచారం మేరకు మాత్రం పైన చెప్పిన సంచలన విషయాలన్నీ బయటికొచ్చాయి.


అరెస్ట్ చూపుతారా..!?

ఇదిలా ఉంటే.. అసలెందుకు ఇలా హత్య చేయాల్సి వచ్చింది..? అనే విషయాలపై లోతుగా పోలీసులు విచారణ జరుపుతున్నట్లు తెలియవచ్చింది. మరోవైపు.. మృతుడి భార్య, తల్లిదండ్రుల ఆరోపణలపైన కూడా పోలీసులు విచారిస్తున్నారని తెలుస్తోంది. అయితే.. కనీసం హత్య జరిగిన స్థలానికి కూడా తీసుకెళ్లకుండా ప్రాథమికంగా పోలీసులు వివరాలు సేకరిస్తున్నారట. ఇప్పటి వరకూ.. ఉదయ్‌భాస్కర్ అరెస్ట్‌  చేసినట్లు కోర్టుకు చూపించడం కానీ.. మీడియా ముందుకు తీసుకురావడం కానీ చేయలేదు. అయితే సాయంత్రం ఇవాళ సాయంత్రం అనంతబాబును పోలీసులు అరెస్ట్ చేసినట్లు అధికారికంగా మీడియా ముందుకు తీసుకురావడమే కాకుండా.. వైద్య పరీక్షల నిమిత్తం జీజీహెచ్‌కు తరలించే అవకాశాలున్నట్లు తెలుస్తోంది. కాగా.. అనంతబాబును అరెస్ట్ చేసి.. బాధిత  కుటుంబానికి ప్రభుత్వం న్యాయం చేయాలని మొదట్నుంచీ ప్రతిపక్ష పార్టీలు, ప్రజాసంఘాలు డిమాండ్ చేస్తూనే ఉన్నాయి. ఇవన్నీ ఒకఎత్తయితే అనంత బాబు విషయంలో మాత్రం వైసీపీ నేతలు పెద్దగా రియాక్ట్ అవ్వకపోవడం కొసమెరుపు.

Updated Date - 2022-05-23T19:41:43+05:30 IST