జగనన్నకు జనం గుర్తుకొచ్చారు!

ABN , First Publish Date - 2022-03-16T08:31:00+05:30 IST

ఎడాపెడా తగులుతున్న ఎదురు దెబ్బలతో వైసీపీ అధిపతి, ముఖ్యమంత్రి జగన్‌కు దాదాపు మూడేళ్లకు ‘పార్టీ శాసనసభాపక్షం’ అనేది ఒకటి ఉందని గుర్తుకొచ్చింది. ఐదేళ్ల తర్వాత ‘ప్లీనరీ’ ఏర్పాటు చేయాలని

జగనన్నకు జనం గుర్తుకొచ్చారు!

మారిన పరిస్థితులే కారణమా?

2017లో చివరిసారిగా పార్టీ ప్లీనరీ

మళ్లీ ఇప్పుడు నిర్వహణకు నిర్ణయం


(అమరావతి - ఆంధ్రజ్యోతి)

ఎడాపెడా తగులుతున్న ఎదురు దెబ్బలతో వైసీపీ అధిపతి, ముఖ్యమంత్రి జగన్‌కు దాదాపు మూడేళ్లకు ‘పార్టీ శాసనసభాపక్షం’ అనేది ఒకటి ఉందని గుర్తుకొచ్చింది. ఐదేళ్ల తర్వాత ‘ప్లీనరీ’ ఏర్పాటు చేయాలని అనిపించింది. అన్నింటికంటే ముఖ్యంగా... అధికారంలోకి వచ్చి మూడేళ్లవుతున్నందున ఎమ్మెల్యేలు ఇక ‘ప్రజల్లోకి వెళ్లాల్సిన’ అవసరమూ తెలిసొచ్చింది. అంతేకాదు... బూత్‌ కమిటీలు, మండల కమిటీలు కూడా ఏర్పాటు చేయాలని అనిపించింది. ‘పార్టీ అధ్యక్షుడిలో ఇన్ని మార్పులకు కారణమేమిటో!’ అని వైసీపీ వర్గాలే  విస్తుపోతున్నాయి. అధికారంలో ఉన్నా, ప్రతిపక్షంలో ఉన్నా... పార్టీ అధ్యక్షుడు తమ ఎమ్మెల్యేలతో (శాసనసభాపక్ష) సమావేశం కావడం సంప్రదాయం. అదేపనిగా కాకపోయినా... కనీసం అసెంబ్లీ సమావేశాలప్పుడైనా ఈ భేటీ ఏర్పాటు చేస్తుంటారు. కానీ జగన్‌ తీరేవేరు. 2019 ఎన్నికల్లో గెలిచాక వైసీఎల్పీ సమావేశం జరిగింది. ఎమ్మెల్యేలంతా కలిసి తమ నాయకుడిగా జగన్‌ను ఎన్నుకున్నారు.  జగన్‌ దర్శనం  గగనకుసుమమైపోయిన సమయంలో... కనీసం శాసనసభాపక్ష సమావేశమైనా ఏర్పాటు చేస్తే, ఆయనను కలిసి తమ అభిప్రాయాలు చెప్పే అవకాశం లభిస్తుందని ఎమ్మెల్యేలు ఆశగా ఎదురు చూస్తూ వచ్చారు. జగన్‌ ఆ చాన్స్‌ ఇవ్వలేదు. ఎట్టకేలకు... మంగళవారం ఆ భేటీ ఏర్పాటు చేశారు. కానీ... ‘మీరెవరూ మాట్లాడొద్దు’ అంటూ హుకుం జారీ చేసి, తాను చెప్పాల్సింది మాత్రమే చెప్పారు. 


ప్లీనరీ... ఎన్నాళ్లకెన్నాళ్లకు!

ప్రతి పార్టీ కనీసం రెండేళ్లకోసారి ప్లీనరీ (మహాసభ) నిర్వహించాలి. పార్టీ అధ్యక్షుడిని అధికారికంగా ఎన్నుకోవాలి. టీడీపీ ‘మహానాడు’ పేరుతో ఈ సమావేశాలను జరుపుతుంది. కానీ వైసీపీ తీరే వేరు. 2017లో జగన్‌ పాదయాత్ర ప్రారంభించేముందు గుంటూరులో ప్లీనరీ ఏర్పాటు చేశారు. ఆ తర్వాత ఆ ఊసే మరిచిపోయారు. ఇప్పుడు మళ్లీ... ఈ ఏడాది జూలై 8న ప్లీనరీ నిర్వహిస్తున్నట్లు మంగళవారం ప్రకటించారు. ఇప్పటిదాకా పార్టీకి మండల కమిటీలు లేవు. వాటినీ నియమించాలని ఆదేశాలు జారీ చేశారు. మరోవైపు... అన్ని పార్టీలకూ అనుబంధ సంఘాలు ఉంటాయి. వైసీపీకి మాత్రం అనుబంధ సంఘాలేవీ లేవు. అన్నీ... జగనే, అంతా జగనే!


భ్రమలు వీడుతున్నాయా...

‘నేనే లీడర్‌. ఎవరు గెలిచినా నా బొమ్మతోనే’ అనేది జగన్‌ వైఖరి అని పార్టీ నేతలు చెబుతారు. కానీ... మంగళవారం జరిగిన సమావేశంలో ‘మీరు గెలవండి. జిల్లాలోని ఇతర అభ్యర్థులనూ గెలిపించండి’ అని కాబోయే మాజీ మంత్రులకు జగన్‌ చెప్పడం విశేషం. దాదాపు మూడేళ్లకు ఎల్పీ భేటీ ఏర్పాటు, ఐదేళ్ల తర్వాత ప్లీనరీ నిర్వహణకు నిర్ణయం, పార్టీ మండల కమిటీలపై దృష్టి, ప్రజల్లోకి వెళ్లాలనే ఆదేశం... ఇవన్నీ మారిన పరిస్థితులకు అద్దం పడుతున్నాయని వైసీపీ నేతలు అంతర్గతంగా చర్చించుకుంటున్నారు. ‘మాకు వలంటీర్లు చాలు. వాళ్లే గెలిపిస్తారు’ అని ఇన్నాళ్లుగా భావిస్తూ వచ్చారు. కానీ ఇటీవల ప్రభుత్వానికి ప్రజా వ్యతిరేక వేడి బాగా తలుగుతోంది. ఉద్యోగులు, ఉపాధ్యాయులు, అంగన్‌వాడీలు, ఆశా వర్కర్లు ఉద్యమాల బాట పట్టారు. కాంట్రాక్టు, అవుట్‌ సోర్సింగ్‌ ఉద్యోగులూ సకాలంలో వేతనాలు అందడంలేదంటూ తీవ్ర అసంతృప్తితో ఉన్నారు. ఇసుక, మద్యం, చెత్త పన్ను, ఆస్తిపన్ను, ఓటీఎస్‌, టిడ్కో ఇళ్లు ఇవ్వకపోవడం, జగనన్న ఇళ్లు కొలిక్కి రాకపోవడం... ఇలాంటి ఎన్నో అంశాలు ప్రజల్లో వ్యతిరేకతను పెంచినట్లు వైసీపీ గ్రహించింది. ఈ నేపథ్యంలోనే జగన్‌కు సంస్థాగత నిర్మాణం, ప్రజల్లోకి వెళ్లాల్సిన అవసరం గుర్తొచ్చాయనే వ్యాఖ్యలు వినిపిస్తున్నాయి. మరోవైపు... ‘టీడీపీని పట్టించుకోవాల్సిన అవసరం లేదు’ అని పైకి చెబుతున్నా.. తాడేపల్లి క్యాంపు కార్యాలయానికి సమీపంలోనే ఉన్న టీడీపీ కేంద్ర కార్యాలయంలో నానాటికీ కార్యకలాపాలు పెరగడమూ వైసీపీని ఆలోచింపజేస్తున్నాయని రాజకీయవర్గాలు చెబుతున్నాయి.

Updated Date - 2022-03-16T08:31:00+05:30 IST