ఎందుకీ కవ్వింపు..?

ABN , First Publish Date - 2022-10-03T09:29:50+05:30 IST

రాజకీయంగా బలహీనపడుతున్నప్పుడల్లా తెలంగాణ మంత్రులపై కయ్యానికి కాలుదువ్వేలా వ్యవహరించడం వైసీపీకి సర్వసాధారణమైపోయింది.

ఎందుకీ కవ్వింపు..?

సెంటిమెంటుతో లబ్ధి పొందే ఎత్తు!

రాజకీయంగా బలహీనపడినప్పుడల్లా తెరపైకి కొత్త వివాదాలు

వైసీపీ, టీఆర్‌ఎస్‌ నేతల తీరు


(అమరావతి-ఆంధ్రజ్యోతి): రాజకీయంగా బలహీనపడుతున్నప్పుడల్లా తెలంగాణ మంత్రులపై కయ్యానికి కాలుదువ్వేలా వ్యవహరించడం వైసీపీకి సర్వసాధారణమైపోయింది. నేను నిన్ను కొట్టినట్లు.. నువ్వు నన్ను తిట్టినట్లు నటించాలన్న ఇచ్చిపుచ్చుకునే ధోరణి ఉభయ రాష్ట్రాల పాలకపక్షాల నేతల మాటల్లో కనిపిస్తోంది. రాజకీయంగా ఎదురుదెబ్బలు తగిలినప్పుడు.. కీలక సమస్యలపై ప్రజల దృష్టి మళ్లించడానికి.. ఇక్కడ వైసీపీ మంత్రులు, పెద్దలు ఈ పంథా అనుసరిస్తున్నారు. గతంలో ఆంధ్రలో కరెంటు, పరిశ్రమలపై తెలంగాణ మంత్రి కేటీఆర్‌ చేసిన వ్యాఖ్యలపై దుమారం రేగింది. తాజాగా ఉపాధ్యాయులకు ఏపీ ఇస్తున్న పీఆర్‌సీని తెలంగాణ మంత్రి హరీశ్‌రావు ఎద్దేవాచేయడంతో రాష్ట్ర మంత్రులు బొత్స సత్యనారాయణ, గుడివాడ అమర్నాథ్‌ తీవ్రంగా స్పందించారు. అయితే నాడు కేటీఆర్‌ వ్యాఖ్యలకు వైసీపీ నేతలు సౌమ్యంగా సమాధానాలిచ్చారు. 


ప్రజలను మభ్యపెట్టేందుకే..!

జగన్‌ ప్రభుత్వంపై ప్రజల్లో ఎంత వ్యతిరేకత ఉందో ‘గడప గడపకు మన ప్రభుత్వం’ కార్యక్రమంలో తేలిపోతోంది. రోజూ ఎమ్మెల్యేలకు నిలదీతలే ఎదురవుతున్నా యి. ఆ కార్యక్రమానికి ప్రజాస్పందన భారీగా ఉందని చెప్పుకోవడానికి సర్కారు నానా తంటాలు పడుతోంది. ప్రభుత్వాలపై వ్యతిరేకత పెరుగుతున్నప్పుడు ఇలా రెండు రాష్ట్రాల నేతలు కవ్వింపు ధోరణిలో మాట్లాడుకుంటూ సెంటిమెంటు రాజేసే ప్రయత్నం చేస్తున్నారని.. తద్వారా రాజకీయ లబ్ధి పొందాలని చూడడం రివాజుగా మారిందని రాజకీయ వర్గాలు మండిపడుతున్నాయి. పోలవరం ప్రాజెక్టు అంశాన్ని ఈ సందర్భంగా గుర్తుచేస్తున్నారు. ఇటీవల గోదావరి వరదలకు పోలవరం ప్రాజెక్టు క్షేత్రం మునిగిపోవడంతో పనులు ఆగిపోయాయి. వరదలకు భద్రాచలం కూడా జలమయమైంది. పోలవరం బ్యాక్‌వాటర్‌వల్లే భద్రాచలం మునిగిపోయిందని.. విలీన మండలాలను తిరిగి తమకు ఇచ్చేయాలంటూ తెలంగాణ మంత్రి పువ్వాడ అజయ్‌.. కొత్త వివాదాన్ని తెరపైకి తీసుకొచ్చారు. తమకు హైదరాబాద్‌ ఇచ్చేయాలంటే ఇచ్చేస్తారా అని ఇటు ఏపీ మంత్రి అంబటి రాం బాబు స్పందించారు. నిజానికి ఆ సమయంలో వరద సాయం అందక ముంపుమండలాల ప్రజలు అల్లాడుతున్నారు. తెలంగాణలో ఒక్కో బాధితుడికీ రూ.పది వేలిస్తే.. ఏపీలో రూ.2 వేలు మాత్రమే ఇవ్వడంతో విమర్శలు వ్యక్తమయ్యాయి.  కీలక సమస్యల నుంచి ప్రజల దృష్టి మళ్లించడానికి ఉభయ రాష్ట్రాల మంత్రులు పోటీపడుతున్నారని విపక్షాలు విమర్శిస్తున్నాయి.


తర్వాత దావోస్‌ సదస్సు సందర్భంగా సీఎం జగన్‌ ఆయన్ను కలిసి తన వ్యాఖ్యలపై వివరణ ఇవ్వడంతో వివాదానికి తెరపడిం ది. అయితే ఇప్పుడు హరీశ్‌రావుపై బొత్స, అమర్నాథ్‌ వ్యాఖ్యలు కవ్వించేలా ఉన్నాయి. వాస్తవానికి ఆయన అన్నమాటల్లో అవాస్తవం లేదని రాజకీయ వర్గాలు అంటున్నాయి. ‘ఉద్యోగులు, ఉపాధ్యాయులపై జగన్‌ సర్కారు కర్కశంగా వ్యవహరిస్తుండడం అబద్ధమా..? కేసులు, బైండోవర్లు, అరెస్టులతో వేధించడం నిజంకాదా’ అని ప్రశ్నిస్తున్నాయి. ఆంధ్రలో టీచర్ల పరిస్థితిపై హరీశ్‌రావు యథాలాపంగా చేసి న వ్యాఖ్యలు బొత్సకు గుచ్చుకున్నాయి. హరీశ్‌ ఇక్కడకు వచ్చి ఉపాధ్యాయులను గానీ, ఇతరులను గానీ అడిగితే వాస్తవం తెలుస్తుందని.. తెలంగాణ టీచర్ల పీఆర్సీ, మన టీచర్ల పీఆర్సీని పక్కపక్కన పెట్టి చూస్తే ఎవరిది బాగుందో తెలుస్తుందనీ బొత్స చెప్పారు. అదే జరిగితే ఏపీ పీఆర్‌సీలో డొల్లంతా బయటపడడం ఖాయమని ప్రతిపక్షాలు అంటున్నాయి. మేనమామ కేసీఆర్‌తో హరీశ్‌రావుకు విభేదాలుంటే నేరుగా ఆయన్నే తిట్టాలని, మధ్యలో ఏపీ వ్యవహారాలు లాగడం తగదని అమర్నాథ్‌ అన్నారు. సలహాదారు సజ్జల సైతం రంగంలోకి దిగి.. హరీశ్‌ తన రాష్ట్రం సమస్యలపై దృష్టిపెట్టాలని సూచించారు. అయితే.. కేటీఆర్‌ వ్యాఖ్యలపై వైసీపీ పెద్దలు స్పందించిన తీరుకు, ఇప్పుడు హరీశ్‌వ్యాఖ్యలపై మాట్లాడిన తీరుకూ చాలా వ్యత్యాసం కనిపిస్తోంది. మంత్రులు కవ్వింపు ధోరణిలో మాట్లాడం వెనుక రాజకీయ కోణం ఉందన్న అభిప్రాయం వ్యక్తమవుతోంది. 

Updated Date - 2022-10-03T09:29:50+05:30 IST