చార్జిషీట్లను పదేపదే ఎందుకు ఉపసంహరించారు?

ABN , First Publish Date - 2022-12-13T03:15:08+05:30 IST

తన డ్రైవర్‌ సుబ్రహ్మణ్యాన్ని హత్య చేసిన కేసులో వైసీపీ ఎమ్మెల్సీ అనంత బాబుపై రాష్ట్రప్రభుత్వం చార్జిషీట్లు దాఖలు చేయడం.. పదేపదే ఉపసంహరించుకుని మళ్లీ కొత్త చార్జిషీట్లు వేయడాన్ని సుప్రీంకోర్టు ఆక్షేపించింది.

చార్జిషీట్లను పదేపదే ఎందుకు  ఉపసంహరించారు?

తప్పులతడకగా దాఖలు చేశారు

వైసీపీ ఎమ్మెల్సీ అనంతబాబు కేసులో

రాష్ట్ర ప్రభుత్వంపై సుప్రీం ఆగ్రహం

మధ్యంతర బెయిల్‌ మంజూరు

న్యూఢిల్లీ, డిసెంబరు 12 (ఆంధ్రజ్యోతి): తన డ్రైవర్‌ సుబ్రహ్మణ్యాన్ని హత్య చేసిన కేసులో వైసీపీ ఎమ్మెల్సీ అనంత బాబుపై రాష్ట్రప్రభుత్వం చార్జిషీట్లు దాఖలు చేయడం.. పదేపదే ఉపసంహరించుకుని మళ్లీ కొత్త చార్జిషీట్లు వేయడాన్ని సుప్రీంకోర్టు ఆక్షేపించింది. అనంతబాబుకు మధ్యంతర బెయిల్‌ మంజూరు చేసింది. తగు షరతులు విధించాలని ట్రయల్‌ కోర్టుకు సూచించింది. 90 రోజుల్లోపు చార్జిషీటు దాఖలు చేసి ఉపసంహరించుకున్న నేపథ్యంలో అనంతబాబుకు డీఫాల్ట్‌ బెయిల్‌ వర్తిస్తుందా లేదా అన్న అంశంపై విచారణ జరుపుతామని స్పష్టం చేసింది. తదుపరి విచారణను వచ్చే ఏడాది మార్చి 14కి వాయిదా వేసింది. అనంతబాబు దాఖలుచేసిన బెయిల్‌ పిటిషన్‌ను రాష్ట్ర హైకోర్టు అక్టోబరు 12న కొట్టివేస్తూ ఆదేశాలిచ్చింది. దీనిపై ఆయన సుప్రీంకోర్టును ఆశ్రయించారు. ఆయన పిటిషన్‌పై సోమవారం జస్టిస్‌ ఎస్‌కే కౌల్‌, జస్టిస్‌ అభయ్‌ ఎస్‌ ఓకాతో కూడిన ధర్మాసనం విచారణ జరిపింది. డీఫాల్ట్‌ బెయిల్‌కు పిటిషన్‌ దాఖలు చేసిన మర్నాడే ప్రభుత్వం చార్జిషీటు ఉపసంహరించుకున్నట్లు గుర్తించింది.

‘90 రోజులు పూర్తయ్యాయి కాబట్టి తప్పులతడకగా కూడిన చార్జిషీటును దాఖలు చేయడం.. దానిని ఉపసంహరించుకోవడం.. తర్వాత మళ్లీ దాఖలు చేయడం.. మళ్లీ వెనక్కి తీసుకోవడం.. మళ్లీ కొత్తది వేయడం.. ఏమిటిది? దీనిని మేం ఆమోదిస్తామనుకున్నారా’ అని నిలదీసింది. అనంతబాబు ఎమ్మెల్సీ గనుక జైలు నుంచి బయటకు వస్తే సాక్షులను బెదిరించే అవకాశముందని.. పశ్చిమ గోదావరి, తూర్పు గోదావరి జిల్లాల్లోకి ప్రవేశించకుండా ఆయన్ను నిరోధించాలని మృతుడి తల్లి తరఫు సీనియర్‌ న్యాయవాదులు మీనాక్షి అరోరా, సిద్ధార్థ అగర్వాల్‌ చేసిన విజ్ఞప్తిని కోర్టు తోసిపుచ్చింది.

Updated Date - 2022-12-13T03:15:09+05:30 IST