చంద్రబాబు ఆస్తులపై..దర్యాప్తు కోరడానికి మీరెవరు?

ABN , First Publish Date - 2022-09-10T08:32:29+05:30 IST

వైసీపీ నాయకురాలు, ఆంధ్రప్రదేశ్‌ తెలుగు అకాడమీ చైర్‌పర్సన్‌ లక్ష్మీపార్వతికి సుప్రీంకోర్టులో ఎదురుదెబ్బ తగిలింది.

చంద్రబాబు ఆస్తులపై..దర్యాప్తు కోరడానికి మీరెవరు?

  • ఈ వ్యవహారంతోమీకేం సంబంధం? 
  • మాజీ ముఖ్యమంత్రి భార్య అయితే
  • అలా కోరేందుకు హోదా ఉన్నట్లా?
  • సుప్రీంకోర్టు తీవ్ర వ్యాఖ్యలు లక్ష్మీపార్వతి పిటిషన్‌ కొట్టివేత


న్యూఢిల్లీ, సెప్టెంబరు 9 (ఆంధ్రజ్యోతి): వైసీపీ నాయకురాలు, ఆంధ్రప్రదేశ్‌ తెలుగు అకాడమీ చైర్‌పర్సన్‌ లక్ష్మీపార్వతికి సుప్రీంకోర్టులో ఎదురుదెబ్బ తగిలింది. మాజీ సీఎం, టీడీపీ అధినేత చంద్రబాబు ఆస్తులపై దర్యాప్తు జరిపించాలని దాఖలు చేసిన పిటిషన్‌ను సర్వోన్నత న్యాయస్థానం కొట్టివేసింది. ఇదే అభ్యర్థనను గతంలో దిగువ కోర్టు, తెలంగాణ హైకోర్టు తిరస్కరించడంతో ఆమె సుప్రీంకోర్టును ఆశ్రయించారు. ఈ పిటిషన్‌పై శుక్రవారం జస్టిస్‌ దినేశ్‌ మహేశ్వరి, జస్టిస్‌ బేలా ఎం త్రివేదితో కూడిన ద్విసభ్య ధర్మాసనం విచారణ చేపట్టింది. ‘ఎవరు మీరు? ఈ వ్యవహారంతో మీకేం సంబంధం’ అని ధర్మాసనం ప్రశ్నించింది. లక్ష్మీపార్వతి మాజీ ముఖ్యమంత్రి ఎన్టీఆర్‌ భార్య అని ఆమె తరఫున సీనియర్‌ న్యాయవాది సి.నాగేశ్వర రావు సమాధానమివ్వగా.. ‘మాజీ సీఎం సతీమణి అయితే ఆస్తులపై దర్యాప్తు కోరడానికి హోదా ఉన్నట్లా? అలా కోరేందుకు చట్టబద్ధత ఉన్నట్లా’ అని ధర్మాసనం నిలదీసింది. లక్ష్మీపార్వతి మాజీ సీఎం సతీమణి అన్న కారణంగా చంద్రబాబుతో రాజకీయ వైరం ఉందని భావించి పిటిషన్‌ను దిగువ కోర్టు కొట్టివేసిందని న్యాయవాది వ్యాఖ్యానించారు. ఆ కోర్టు తీర్పు ప్రతిలోని కొన్ని భాగాలు చదవి వినిపించారు. 


ఆ సందర్భంగా ‘తెలిసిన ఆదాయ మార్గాలు’ అన్న పదం రాగానే.. ఎవరికి తెలిసిన మార్గాల్లో అని ధర్మాసనం ప్రశ్నించింది. ప్రభుత్వం లేదా సంబంధిత ఏజెన్సీలకు తెలిసిన మార్గాల్లో అని న్యాయవాది బదులిచ్చారు. దాంతో.. ‘మీరు సరిగ్గా చెప్పారు. ప్రభుత్వాల దృష్టిలో.. తెలిసిన ఆదాయ మార్గాల ద్వారా సమకూరిన ఆదాయం అని ఇదే కోర్టు గతంలోనే స్పష్టత ఇచ్చింది. ఇక్కడ మీకేం సంబంధం’ అని ధర్మాసనం అడిగింది. ఎన్నికల సంఘానికి చంద్రబాబు సమర్పించిన ఎన్నికల అఫిడవిట్‌లోనూ వివరాలు ఉన్నాయని న్యాయవాది చెప్పగా.. ‘ఏ సంస్థ పట్టించుకోవాలో ఆ సంస్థ పట్టించుకుంటుంది. ప్రస్తుతం ఈ కేసులో హైకోర్టు చట్టపరంగా, వాస్తవాలపరంగా చాలా చక్కగా సమర్థనీయంగా తీర్పు ఇచ్చింది’ అని సుప్రీంకోర్టు వ్యాఖ్యానించింది. ఇందులో జోక్యం చేసుకోబోమంటూ పిటిషన్‌ను కొట్టివేస్తున్నట్లు ప్రకటించింది.

Read more