ముగిసిన బదిలీలపై ఇదేం చోద్యం?!

ABN , First Publish Date - 2022-09-13T09:14:22+05:30 IST

ప్రభుత్వ గడువు మేరకు జలవనరుల శాఖలో డిప్యూటీ ఇంజనీర్ల నుంచి చీఫ్‌ ఇంజనీర్ల దాకా గత నెలలోనే బదిలీల ప్రక్రియ ముగిసిపోయింది. ప్రాంతాల వారీగా ఎవరికివారు మంత్రులూ ..

ముగిసిన బదిలీలపై ఇదేం చోద్యం?!

  • గత నెలలోనే పూర్తయిన ఇంజనీర్ల బదిలీల ప్రక్రియ
  • పైరవీలు వద్దంటూ ఇప్పుడు మెమో.. జలవనరుల శాఖ వింతవైఖరి

అమరావతి, సెప్టెంబరు 12(ఆంధ్రజ్యోతి): ప్రభుత్వ గడువు మేరకు జలవనరుల శాఖలో డిప్యూటీ ఇంజనీర్ల నుంచి చీఫ్‌ ఇంజనీర్ల దాకా గత నెలలోనే బదిలీల ప్రక్రియ ముగిసిపోయింది. ప్రాంతాల వారీగా ఎవరికివారు మంత్రులూ .. ఎమ్మెల్యేలూ .. ఎమ్మెల్సీల నుంచి ఇలా ఎన్ని వీలయితే అన్ని సిఫారసు లేఖలు ఇంజనీరింగ్‌ అధికారులు పోగేసుకున్నారు. సంబంధిత విభాగాల ఉన్నతాధికారుల ద్వారా ఇంజనీర్‌ ఇన్‌ చీఫ్‌ (అడ్మిన్‌) ద్వారా ప్రభుత్వానికి బదిలీల విజ్ఞప్తులను పంపారు. వాటిన్నింటినీ జల వనరుల శాఖ మంత్రి అంబటి రాంబాబు క్షుణ్ణంగా పరిశీలించారు. చాలావరకు సిఫారసు లేఖల ఆధారంగానే  బదిలీలు జరిగాయి. ఈ ప్రక్రియ అంతా గత నెల 30వ తేదీతోనే ముగిసిపోయింది. ఇక బదిలీలకు అవకాశం లేదు. సిఫారసు లేఖలను తెచ్చేందుకు ఆస్కారమే లేదు. అయితే.. దొంగలు పడ్డ ఆర్నెల్లకు అన్నట్లు.. జల వనరుల శాఖ ఇంజనీర్‌ ఇన్‌ చీఫ్‌ (ఈఎన్‌సీ) అడ్మినిస్ట్రేషన్‌ ఆర్‌.సతీ్‌షకుమార్‌.. ఈ నెల ఐదో తేదీన జారీ చేసిన ఒక మెమో ఇప్పుడు విమర్శలకు తావిస్తోంది. సర్వీసు నిబంధనల మేరకు తనపైన ఉండే పర్యవేక్షక అధికారి ద్వారానే బదిలీలకు సంబంధించిన వినతులను శాఖాధిపతులకు పంపాలని.. అలా కాకుండా నేరుగా శాఖాధిపతికి, ఇంజనీర్‌ ఇన్‌ చీఫ్‌కు సిఫారసు లేఖలను పంపడం క్రమశిక్షణా రాహిత్యమని, దీనిని ఉపేక్షించేదిలేదన్నది ఈ మెమో (ఆర్‌సీ/ఈఎన్‌సీ/జీ2/డైరెక్ట్‌ రిప్రజేంటేషన్స్‌/2022)సారాంశం. బదిలీల కోసం పుంఖానుపుంఖాలుగా మంత్రులు, ఎమ్మెల్యేల సిఫరాసు లేఖలు వచ్చినప్పుడు వాటిని పరిగణనలోనికి తీసుకుని.. ఇప్పుడు అంతా పూర్తయ్యాక.. 1964 నాటి ప్రభుత్వోద్యోగుల కాండక్ట్‌ సర్వీసెస్‌ ప్రవర్తనా నిబంధనావళిని ఈఎన్‌సీ ఉటంకించడం ఎందుకన్నది ఇప్పుడు ఆ శాఖ ఉద్యోగుల్లో చర్చనీయాంశమైంది.  

Updated Date - 2022-09-13T09:14:22+05:30 IST