కేసుకు, ఖాతా ఫ్రీజ్‌కు లింక్‌ ఏమిటి?

ABN , First Publish Date - 2022-10-04T07:43:49+05:30 IST

ప్రభుత్వ ఉద్యోగిపై దాడి, విధులకు ఆటంకం కలిగించారనే ఆరోపణలతో కేసు నమోదు చేసి, బ్యాంక్‌ ఖాతా ఫ్రీజ్‌ ఉత్తర్వులు ఇచ్చిన వ్యవహారంలో పోలీసులపై హైకోర్టు మండిపడింది. పోలీసులు నమోదు చేసిన కేసుకి,

కేసుకు, ఖాతా ఫ్రీజ్‌కు లింక్‌ ఏమిటి?

అలాంటి ఆదేశాలు ఎందుకిచ్చారు?

ఇది అధికార దుర్వినియోగమే.. పోలీసులపై రాష్ట్రహైకోర్టు సీరియస్‌

చర్య తప్పదని ఏలూరు సీఐకి హెచ్చరిక

తక్షణం ఖాతా పునరుద్ధరణకు ఆదేశాలు


అమరావతి, అక్టోబరు 3 (ఆంధ్రజ్యోతి): ప్రభుత్వ ఉద్యోగిపై దాడి, విధులకు ఆటంకం కలిగించారనే ఆరోపణలతో కేసు నమోదు చేసి, బ్యాంక్‌ ఖాతా ఫ్రీజ్‌ ఉత్తర్వులు ఇచ్చిన వ్యవహారంలో పోలీసులపై హైకోర్టు మండిపడింది. పోలీసులు నమోదు చేసిన కేసుకి, నిందితుడి బ్యాంక్‌ అకౌంట్‌కి ఏం సంబంధమని ప్రశ్నించింది. ఇది అధికార దుర్వినియోగానికి పాల్పడడం కాదా అని సీఐని నిలదీసింది. సీఐపై శాఖపరమైన చర్యలు తీసుకోవాలని డీజీపీని ఆదేశిస్తామని హెచ్చరించింది. పిటిషనర్‌ బ్యాంక్‌ ఖాతాను తక్షణం పునరుద్ధరించాలని బ్యాంక్‌ అధికారులను ఆదేశించింది. ఈ మేరకు హైకోర్టు న్యాయమూర్తి జస్టిస్‌ సీహెచ్‌ మానవేంద్రనాథ్‌ రాయ్‌ ఇటీవల ఉత్తర్వులు ఇచ్చారు.


ఏలూరు గ్రామీణ అప్పటి సీఐ శ్రీనివాసరావు రాసిన లేఖ మేరకు తన బ్యాంక్‌ ఖాతాను బ్యాంక్‌ ఆఫ్‌ బరోడా అధికారులు స్తంభింపజేశారని, ఖాతాను డీ-ఫ్రీజ్‌ చేసేలా ఆదేశించాలని కోరుతూ ఏలూరుకు చెందిన మాజీ జర్నలిస్టు దొండ సాయి బాలాజీ హైకోర్టును ఆశ్రయించారు. పిటిషనర్‌ తరఫున న్యాయవాది పీవీజీ ఉమేశ్‌చంద్ర వాదనలు వినిపించారు. ‘‘పిటిషనర్‌పై వ్యక్తిగత కక్షతో సీఐ కేసు నమోదు చేశారు. ప్రభుత్వ ఉద్యోగి విధులకు ఆటంకం కలిగించారనేది కేసులో ప్రధాన అభియోగం. అయితే, కేసుతో ఎలాంటి సంబంధం లేకున్నా పిటిషనర్‌ బ్యాంకు ఖతాను ప్రీజ్‌ చేయాలని సీఐ బ్యాంకు అధికారులకు లేఖ రాశారు’’ అని వాదించారు. ఈ వివరాలు పరిగణనలోకి తీసుకున్న న్యాయమూర్తి...సీఐ తీరుపై తీవ్ర అసహనం వ్యక్తం చేశారు. బ్యాంకు ఖాతా సీజ్‌ చేయించాల్సిన అవసరం ఏమొచ్చిందని ప్రశ్నించారు. సహాయప్రభుత్వ న్యాయవాది వాదనలు వినిపిస్తూ...ఖాతాను పునరుద్ధరించేందుకు చర్యలు తీసుకున్నామన్నారు. ఆ వివరాలను పరిగణనలోకి తీసుకున్న న్యాయమూర్తి...తక్షణం ఖాతాను డీఫ్రీజ్‌ చేయాలని బ్యాంక్‌ అధికారులను ఆదేశించారు. 

Read more