ఏం చేశామని ఓట్లు అడగమంటారు?

ABN , First Publish Date - 2022-09-08T08:49:04+05:30 IST

ఏం చేశామని ఓట్లు అడగమంటారు?

ఏం చేశామని ఓట్లు అడగమంటారు?

వైవీని నిలదీసిన జడ్పీ సభ్యుడు నూకరాజు

అరకులోయ, సెప్టెంబరు 7: ‘‘ప్రజా ప్రతినిధులుగా గెలిచాం. అయినప్పటికీ ఏం చేశామని ప్రజల వద్దకు వెళ్లి ఓట్లు అడగమంటారు? మాకు ఎలాంటి అధికారాలు, నిధులు లేకుండా చేశారు’’ అని ఉమ్మడి విశాఖ జిల్లా వైసీపీ సమన్వయకర్త, టీటీడీ చైర్మన్‌ వైవీ సుబ్బారెడ్డిని అదే పార్టీకి చెందిన జడ్పీ సభ్యుడు నిలదీశారు. అల్లూరిసీతారామరాజు జిల్లా అరకులోయలో బుధవారం అరకు, పాడేరు అసెంబ్లీ నియోజకవర్గాల వైసీపీ ప్రజా ప్రతినిధులతో పట్టభద్రుల ఎమ్మెల్సీ ఎన్నికలకు సంబంధించి వైవీ ప్రత్యేక సమావేశం నిర్వహించారు. పట్టభద్రులను ఓటర్లుగా చేర్చే బాధ్యత ప్రజా ప్రతినిధులదేనని, పార్టీ ఎంపిక చేసిన అభ్యర్థిని గెలిపించాలని కోరారు. సమావేశం మధ్యలో కొయ్యూరు జడ్పీటీసీ సభ్యుడు వారా నూకరాజు మాట్లాడుతూ, అన్ని పనులూ ప్రజా ప్రతినిధులకు సంబంధం లేకుండా జరుగుతున్నాయని, తమకు భాగసామ్యం లేకుండా పోయిందని ఆందోళన వ్యక్తం చేశారు. నాడు-నేడు పనులు సైతం హెచ్‌ఎంలకు, కమిటీలకు అప్పగిస్తే తామేం చేయాలని ప్రశ్నించారు. ప్రజల దగ్గరికి వెళ్లి ఏమని ఓట్లు అడగాలని ప్రశ్నించారు. సుబ్బారెడ్డి స్పందిస్తూ, ఈ విషయాలను గుర్తించామని, త్వరలో అన్ని పనుల్లో ప్రజాప్రతినిధులకు భాగసామ్యం ఉండేలా చూస్తామని సర్దిచెప్పారు. 


Updated Date - 2022-09-08T08:49:04+05:30 IST