నీరు పారేనా..?

ABN , First Publish Date - 2022-11-25T00:49:41+05:30 IST

రెండో పంటకు సంతృప్తికరంగా నీరందిస్తారా ? ఎప్పటిలోపు కాల్వలు మూసివేస్తారు ? కాల్వ ఆధునికీకరణ పనుల మాటేంటి ?

నీరు పారేనా..?

కాల్వల ఆధునికీకరణ ఎప్పుడో మూలనపడింది

మధ్య తరహా సాగునీటి పనులు అటకెక్కాయి

ఓఅండ్‌ఎం పనులకు దిక్కులేదు

ఒకప్పుడు వీటి కోసమే ప్రజాప్రతినిధుల ఫైట్‌

ఇప్పుడు ఆ సీను ఉంటుందా అనే ప్రశ్న

జిల్లాల విభజనతో మారిన సీను

రెండో పంటకు సంతృప్తికరంగా నీరందిస్తారా ? ఎప్పటిలోపు కాల్వలు మూసివేస్తారు ? కాల్వ ఆధునికీకరణ పనుల మాటేంటి ? మీడియం, మైనర్‌ ఇరిగేషన్‌ ప్రాజెక్టుల సంగతేంటి ? లిఫ్ట్‌ల నుంచి నీటి సరఫరాపై ఏం చేయబోతున్నారు ? ఇలాంటి ప్రశ్నలన్నింటికీ ఒకప్పుడు నీటి పారుదల సలహా మండలి సమావేశంలోనే తేల్చేవారు. నవంబరు వచ్చిందంటే రబీకి అవసరమైన పంట నీరు ఒక్కటే కాకుండా సాగునీటి సరఫరా, మేనేజ్‌మెంట్‌పై ప్రత్యేక దృష్టి పెట్టేవారు. లస్కర్ల సమస్యల పరిష్కారానికి ప్రజా ప్రతినిధులు గళమెత్తేవారు. పార్టీలకతీతంగా ఏకాభిప్రాయానికి వచ్చేవారు. కానీ, ఈ పరిస్థితులన్నీ తిరగబడ్డాయి.

(ఏలూరు–ఆంధ్రజ్యోతి ప్రతినిధి) :

ఇప్పటికే ఖరీఫ్‌ కోతలు ఆలస్యంగా సాగుతున్నాయి. నిర్ణీత సమయంలోనే రబీకి సన్నద్ధం కాకపోతే వేసవి ముంచుకొచ్చి ఆ మేరకు సాగునీటి కొరత తలెత్తడం, రైతులు వివిధ రూపాల్లో ఆందోళనకు దారి తీయబోతుంది. ఇప్పటికే పొరుగు జిల్లాల్లో సలహా సంఘ సమావేశం పూర్తయ్యి గోదావరి కాల్వలకు నీటి విడుదలపై కీలక నిర్ణయం తీసుకున్నారు. మరి ఈ జిల్లాలో ఆ కీలక సమావేశం ఎప్పుడనేదే రైతుల ప్రశ్న.

నీళ్ళు పుష్కలమే కానీ..

ఒకప్పుడు గోదావరిలో నీటి లభ్యతను బట్టి రబీ ఆధార పడేది. అందుకు తగ్గట్టుగానే ప్రజా ప్రతినిధుల సూచనల మేరకు కాల్వలకు నీటిని విడుదల చేసేవారు. ఉమ్మడి పశ్చి మలో డెల్టాలో నాలుగు లక్షల 60 వేలకు పైగా ఎకరాల్లో పంటలు వేస్తారు. వీటికి దాదాపు 60 నుంచి 83 టీఎంసీల కుపైగా నీటి లభ్యత అవసరం. ఇంతకు ముందు పోలవరం ప్రాజెక్టు స్పిల్‌వే పనులు పూర్తికానప్పుడు వందల కొద్దీ టీఎంసీల నీరు వృథాగా సముద్రం పాలయ్యేది. ఇప్పుడు దానికి విరుద్దంగా స్పిల్‌వే పూర్తి కావడం, ఇప్పటికే నీటి నిల్వ సామర్ధ్యం కొంతలో కొంత పూర్తిగా అందుబాటులోకి వచ్చినట్టయ్యింది. కాని, మరో వైపు ప్రాజెక్టుకు దిగువున ఉన్న ఎత్తిపోతల నుంచి ఏ మేరకు సాగునీటిని సమ కూరుస్తారనేదే ఇప్పుడు ప్రధాన ప్రశ్న. కాని, గోదావరిలో నీటి లభ్యత దాదాపు 100 టీఎంసీలకు పైబడే ఉన్నట్టు చెబుతున్నారు. ఇదే పరిస్థితి పంట పూర్తయ్యే వరకు మెయింటెన్‌ చేస్తే ఈ సారి రబీకి సాగు నీటితోపాటు గోదా వరి పరివాహంలో తాగు నీటికి సంతృప్తికరస్థాయిలో నీటిని అందించవచ్చు. ఇంతకు ముందైతే సాగు, తాగునీటి అవస రాల నిమిత్తం నీటి లభ్యత అంతంతమాత్రంగా ఉండేది. గత ఏడాది సీలేరు జలాశయం నుంచి నీటిని పెద్ద ఎత్తున తీసుకోవాల్సి వచ్చింది. గోదావరిలో నీటి లభ్యత తగ్గుముఖం పట్టిన ప్రతీసారి సరాసరిన 30 నుంచి 40 టీఎంసీల నీరు సీలేరు రిజర్వాయరు నుంచే రాబట్టేవారు. గత ఏడాది ఇదే జరిగింది. సీలేరు నుంచి నీటి విడుదలలో ఒడిశాకి, ఏపీకి మధ్యన పలుమార్లు వాగ్వాదం చోటు చేసుకుంది. అయినా చివరికి పరిష్కారం మాత్రం సజావుగానే సాగడంతో ఇప్పటికీ నీటి విడుదలలో ఆటంకాలు పెద్దగా తలెత్తేవే కావు. ఈసారి సీలేరు రిజర్వాయరు నుంచి మరింతగా నీటి అవసరం లేకుండానే తగిన నీటి లభ్యత గోదావరిలోనే కనిపిస్తోంది. జిల్లాల వారీగా వస్తే ఉమ్మడి తూర్పు గోదా వరిలో ఆయకట్టు నాలుగు లక్షల 30 వేలకు పైగానే ఉండేది. అదే ఉమ్మడి పశ్చిమలో నాలుగు లక్షల 60 వేల ఎకరాలుగా రబీలో పంటలు వేస్తారు. ఇదికాకుండా రెండు జిల్లాల్లో తాగు, పరిశ్రమలకు అవసరమైన ఏడు నుంచి ఎనిమిది టీఎంసీల నీటిని సమకూర్చేవారు. ఈసారి రబీలో ఎన్ని ఎకరాలకు నీటి లభ్యత ఇస్తుందో, ఏ మేరకు కాల్వలకు నీరు విడుదల చేయబోతున్నారో సాగు నీటి సలహా మండలి సమావేశంలో నిర్ధారించాల్సి ఉంది.

ఓఅండ్‌ఎం పనులు గోవిందే

కాల్వలు, డ్రెయిన్లపై దాదాపు రూ.32 కోట్లు వెచ్చించి కొన్ని పనులను ఆపరేషన్‌ అండ్‌ మెయింటినెన్స్‌ పేరిట పూర్తి చేయాలని గత ఏడాది నిర్దేశించారు. ఇంత వరకు బాగానే ఉన్నాగానీ కొన్ని పనులు సంపూర్తి కాలేదు. మరి కొన్నిచోట్ల చేసిన పనులకు ఇప్పటికీ బిల్లులు రాలేదు. వాస్తవానికి ఓఅండ్‌ఎం పనులు కాల్వ ప్రవహించే ప్రాంతంలో అత్యంత కీలకం. కాని ఇదిగో అదిగో అంటూనే జాప్యం చేయడం, చివరికి కాల్వలకు నీటి విడుదల చేయ డం, ఆ తరువాత పనులు మందగించడం, ఒకవేళ పూర్తి చేసినా సర్కారు బిల్లుల చెల్లింపులో జాప్యం చోటు చేసుకో వడం వంటి అనేక పరిణామాలు కొనసాగుతూనే వచ్చాయి. జపాన్‌ బ్యాంకు సాయంతో మైనర్‌ ఇరిగేషన్‌ చెరువుల అభివృద్ధి పనులు చేయాలనుకున్నా లింగపాలెం, చింతల పూడి, పెదవేగి వంటి మండలాల్లో ఈ పనులన్నీ తూతూ మంత్రంగానే సాగాయి. తమ్మిలేరు ప్రాజెక్టును ఆధునికీకరిం చాలని భావించి జపాన్‌ బ్యాంకు ఇచ్చే రూ.16 కోట్ల సా యంతో ముందుకు వెళ్ళాలని గత ఏడాదే ఆమోద ముద్ర వేశారు. ఈ పనులన్నింటినీ చేపట్టేందుకు వీలుగా టెండర్లు పూర్తయినా పనులు మాత్రం ఒక కొలిక్కి రానేలేదు.

మధ్యతరహా పనులేవి

కరాటం కృష్ణమూర్తి ఎర్రకాల్వ రిజర్వాయరు అభివృద్ధి పనులు ఎప్పటికీ కలగానే మిగులుతున్నాయి. ప్రతీసారి కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు కమాండ్‌ ఏరియా డవలప్‌మెంట్‌ కింద నిధులు కేటాయించడం, సరైన రీతిలో కాంట్రాక్టర్లు ముందుకు రాకపోవడం యధాతధంగా జరుగుతూ వచ్చిం ది. దీనికి తగ్గట్టుగానే పదే పదే టెండర్లు పిలిచినా కాంట్రా క్టర్లు స్పందించకపోవటంతో కాస్తంత సవరించి పంపితేనే తప్ప కాంట్రాక్టర్లు ముందుకు రారనే విషయాన్ని ఇరిగేషన్‌ శాఖ రాష్ట్ర ప్రభుత్వానికి విన్నవించింది. దీనిపై ప్రత్యేక శ్రద్ధ పెట్టినా ఇప్పటికీ ఫలితం లేకపోయింది. పోగొండ రిజర్వాయరు పనుల్లోనూ ఇంకా పూర్తికాని ఫలితాలే.

ఇంతకీ సలహా ఎప్పుడు

జిల్లావ్యాప్తంగా సాగునీటి అవసరాలను తీర్చే నిమిత్తం ప్రతీ ఏటా సాగునీటి సలహా మండలి సమావేశం నిర్వహించి ఆ మేరకు అధికారులు ప్రజా ప్రతినిధుల నుంచి సలహాలు, సంప్రదింపులను తీసుకుంటారు. ఏటా సాగే సలహా మండలి సమావేశం అత్యంత కీలకం. ఒకప్పుడు ప్రజా ప్రతినిధులంతా పోటీలు పడి మరీ ప్రభుత్వంపై ఒత్తిడి తెచ్చి మరింతగా నిధులు రాబట్టేవారు. ఈ కీలక సమావేశానికి ఇన్‌చార్జి మంత్రి స్వయంగా హాజరు కావడంతో ఆ మేరకు ఆయన నుంచే మరిన్ని అదనపు నిధులు రాబట్టే ప్రయత్నం చేసేవారు. గడిచిన మూడేళ్ళుగా ఆ సీనే మారిపోయింది. సాగు నీటి సరఫరాలో అనేక ఆటంకాలు, మరెన్నో ఇబ్బందులు. జగన్‌ సర్కార్‌ మాత్రం అన్నీ చేసేస్తామన్నట్టుగానే సమావేశంలో హామీలు ఇవ్వటం, ఆ తదుపరి గాలికి వదిలివేయడం. ఇప్పుడు జిల్లాల పునర్విభజన తరువాత తొలిసారిగా సాగు నీటి సలహా మండలి సమావేశం జరగాల్సి ఉంది. ఇప్పుడున్న కొత్త జిల్లాల్లో ప్రతిపక్ష ప్రతినిధులకు ఆస్కారం లేకుండా పోయింది. అంతా అధికార పార్టీ ఎమ్మెల్యేల హవా ఉండటంతో వారి నిర్ణయాలను బట్టే అంతా ఆధారపడి ఉంది. ఎలాగూ ప్రభుత్వంపై ఒత్తిడి తేలేరు కాబట్టి చిన్నచిన్న సలహాలతో సరిపెట్టేస్తారా లేదంటే ఇప్పటికే పెండింగ్‌లో వున్న పనుల అంతు తేల్చేందుకు వీలుగా కీలక నిర్ణయాలు తీసుకోబోతున్నారా ? అనేది ఇప్పుడు అందరి నోట ప్రశ్న. సమావేశం ఎప్పుడు నిర్వహించబోతున్నారనే విషయంపై కూడా నేడో, రేపో విధాన ప్రకటన చేసే అవకాశం ఉంది. ఇప్పటికే పొరుగున తూర్పు గోదావరిలో సమావేశం జరగ్గా కాల్వలకు ఈ నెల 30న నీటిని విడుదల చేయాలని కీలక ప్రతిపాదన చేశారు.

ఆధునికీకరణ అటకెక్కింది

గోదావరి డెల్టా ఆధునికీకరణ పనులు ఒకప్పుడు జోరుగా సాగేవి. ప్రభుత్వ అధికారులు దగ్గరుండి మరీ పర్యవేక్షించే వారు. గడిచిన మూడేళ్ళుగా ఈ పనులన్నీ దాదాపు మూలనపడ్డాయి. అనుకున్న సమయానికి టెండర్ల ప్రక్రియ పూర్తి కాకపోవటం, జరగాల్సిన పనుల నిర్ధారణలో ఎగుడు, దిగుడులు, అంతకంటేమించి ఒక్కో ఎమ్మెల్యే ఒక్కో రకంగా స్పందించడం వంటి పరిణామాలు చోటు చేసుకుంటున్నాయి. గత ఏడాది సాగునీటి సలహా మండలి సమావేశం జరిగే నాటికి దాదాపు 19 పనులకు గాను 43 కోట్లకు అనుమతులు ఇచ్చారు. వీటిలో కొన్ని పనులు జరగకుండానే నిలిచిపోయాయి. వీటిని పూర్తి చేసేందుకు తగిన సమయం కేటాయించినా కాంట్రాక్టర్లు లక్ష్యాలను అందుకోలేకపోయారు. కాల్వ కట్టేసింది మొదలు తిరిగి జూన్‌లో తెరిచే సమయానికి ఆధునికీకరణ పనులు పూర్తి చేయాల్సి ఉండగా పర్యవేక్షణ లోపం, ఒకింత నిర్లక్ష్యం తోడై ఈ పనుల్లో వెనుకంజ కనిపించింది. దీనికితోడు ఆధునికీకరణ పనులు సక్రమంగా జరగకపోయిన ప్రభావం యావత్‌ పంటలపైనే పడింది.

Updated Date - 2022-11-25T00:49:41+05:30 IST

Read more