ఏదీ బీమా ధీమా?

ABN , First Publish Date - 2022-11-28T01:04:43+05:30 IST

గ్రామీణ ప్రాంతాల్లో పేద రైతులు పాడి పశువులపై ఆధారపడి జీవనోపాధి పొందుతుంటారు. దురదృష్టవ శాత్తు ఒక పాడిపశువు చనిపోతే ఆ కుటుంబ ఆర్థిక వ్యవస్థ చిన్నాభిన్నమై అప్పుల పాలవుతుంటారు.

ఏదీ బీమా ధీమా?

20 నెలలుగా ఎదురుచూపులు

జీవనోపాధి కోల్పోయిన రైతులు

గ్రామీణ ప్రాంతాల్లో పేద రైతులు పాడి పశువులపై ఆధారపడి జీవనోపాధి పొందుతుంటారు. దురదృష్టవ శాత్తు ఒక పాడిపశువు చనిపోతే ఆ కుటుంబ ఆర్థిక వ్యవస్థ చిన్నాభిన్నమై అప్పుల పాలవుతుంటారు. వారిని ఆదుకునేందుకు 2019 సంవత్సరంలో వైఎస్సార్‌ పశునష్ట పరిహారం పథకం ప్రారంభించారు. అయితే రెండేళ్లుగా ఈ పథకంలో పశువుల నష్టపోయిన రైతులకు ఇప్పటి వరకు ఎటువంటి నష్టపరిహారమూ లభించలేదు.. దరఖాస్తు చేసుకున్న ఎంతోమంది రైతులు ఆశగా ఎదురు చూస్తున్నారు.

ఏలూరు టూ టౌన్‌, నవంబరు 27 : గ్రామాల్లో పాడి పంటపై ఆధారపడి ఎంతోమంది జీవిస్తుంటారు. ఒక వేళ పాడి ఆవులు, గేదెలు, గొర్రెలు, మేకలు ప్రమాద వశాత్తు కానీ, అనారోగ్యంగా కానీ ప్రకృతి వైపరీత్యాల వలన కానీ చనిపోతే వారి జీవనోపాధి దెబ్బతింటుంది. అలాంటి వారికి పశువుల నష్టపరిహారం పథకం ద్వారా లబ్ధి చేకూరుతుంది. నష్టపరిహారం కోసం రైతులు ఎటువంటి ప్రీమియం చెల్లించనవసరం లేదు. పశుసంవర్థక శాఖ గుర్తించిన పశువుకు చెవికి ట్యాగ్‌ వేసిన పశువులకు మాత్రమే పరిహారం చెల్లిస్తారు. అయితే పశు నష్టపరిహారం దాదాపు రెండు సంవత్సరాలుగా అందక రైతులు జీవనోపాధిని కొల్పోతున్నారు. పథకం ప్రవేశ పెట్టిన సంవత్సరం 2019లో ఒక విడత, 2020లో రెండవ విడత నష్టపరిహారం చెల్లించారు. అప్పటి నుంచి ఇప్పటి వరకు పశు నష్టపరిహారం చెల్లించలేదు. దీంతో చిన్న,పేద పాడిరైతుల కుటుంబాలు పోషణ కష్టమైపోతుంది. పశు వులు చనిపోయిన రైతులు పశుసంవర్థక శాఖ చుట్టూ కాళ్లు అరిగేలా తిరుగుతున్నారు. అధికారుల నుంచి కూడా సరైన సమాధానం రావడం లేదు. ‘‘మీ పశువు చనిపోయిన వివరాలు ప్రభు త్వానికి పంపాం. ప్రభుత్వం ఎప్పుడు నిధులు విడుదల చేస్తే అప్పుడ మీ అకౌంట్‌లో నష్టపరిహారం పడుతుంది.’’ అని చెబుతున్నారు.దీనితో రైతులు బయట అప్పులు చేసి మళ్లీ పాడి పశువులు కొనుగోలు చేస్తున్నారు. ఇటు వడ్డీలు కట్టలేక, అప్పులు తీర్చలేక కుటుంబాన్ని పోషించలేక రైతులు ఆందోళన చెందుతున్నారు.

7.35 కోట్ల బకాయి

ఉమ్మడి పశ్చిమగోదావరి జిల్లాలో 3921 పశువులు గత మూడున్న ఏళ్లలో చనిపోయాయి. వీటిని పశువైద్యులు పోస్టుమార్టం చేసి నిర్థారించి ఆన్‌లైన్‌లో ప్రభుత్వానికి నష్టపరిహారం కోసం దరఖాస్తు చేసుకోవాలి. వీరిలో 1408 మంది రైతుల ఖాతాల్లో రూ.3 కోట్ల 74 లక్షలు నష్టపరి హారం వేశారు. రెండేళ్ల నుంచి 2513 మంది రైతులు 7 కోట్ల 35 లక్షల నష్టపరిహారం కోసం ఎదురు చూస్తున్నారు. వీటిలో 351 మూగజీవాలు ఉన్నాయి. మూగజీవాల్లో 122 జీవాలకు నష్టపరిహారం అందింది. మిగిలిన వారు ఎదురు చూస్తున్నారు. ఏలూరు జిల్లా ఏర్పడిన తరువాత 117 ఆవులు, 518 గేదెలు చని పోయాయి. వీరంతా దరఖాస్తు చేసుకుని నష్టపరిహారం కోసం ఎదురు చూస్తున్నారు.

ఇవీ నిబంధనలు

పాడి ఆవులు, గేదెలు, గొర్రెలు, మేకలకు ప్రభుత్వం గుర్తించిన చెవులకు ట్యాగులు ఉండాలి.

పునరుత్మాదక దశలో ఉన్న రెండు సంవత్సరాలు నిండి 10 సంవత్సరాల లోపు వయస్సు ఉన్న ఆవులై ఉండాలి. గేదెలకు 3 నుంచి 12 సంవత్సరాల లోపు వయసు ఉండాలి.

దేశవాళి మేలిజాతి పశువులకు రూ.30 వేలు, నాటు పశువులకు రూ.15 వేలు నష్టపరిహారం ఇస్తారు.

5 పశువులకు లక్షన్నర రూపాయలు గరిష్టంగా నష్టపరిహారం ఇస్తారు. గొర్రెలు, మేకలు ఆరు నెలలు పైబడిన వయస్సు ఉండాలి.

గుంపులో కనీసం 3 జీవాలు చనిపోతేనే నష్టపరిహారం వర్తిస్తుంది.

ఒక్కొక్క జీవానికి రూ.6 వేలు చొప్పున 20 జీవాలకు సంవత్సరానికి గరిష్టంగా రూ.లక్ష 20 వేలు నష్టపరిహారం చెల్లించాలి.

పశువు చనిపోయిన వెంటనే టోల్‌ఫ్రీ నెంబర్‌ 85000 01962కు కానీ, వార్డు, విలేజ్‌ సెక్రటరీకి కానీ సమాచారం ఇవ్వాలి. సంబంధిత పశువైద్యాధికారి, సిబ్బంది వచ్చి పోస్టుమార్టం నిర్వహిస్తారు. అనంతరం ఐదుగురు సిబ్బందితో పంచనామ నిర్వహిస్తారు. ఆధార్‌, బ్యాంకు ఖాతా జిరాక్సులు, చెవులకు ట్యాగ్‌ వేసిన ఫొటో జతపరచాలి.

త్వరలో నష్టపరిహారం చెల్లిస్తాం

పాడి రైతులకు పశునష్టపరిహారం త్వరలో చెల్లిస్తాం. నష్టపోయిన పశువుల వివరాలు ప్రభుత్వానికి పంపాం. కొంచెం ఆలస్యం అయిన మాట వాస్తవం. ప్రభుత్వం నిధులు మంజూరు చేయడానికి సన్నాహాలు చేస్తున్నది. నిధులు విడుదల కాగానే నేరుగా బ్యాంకు ఖాతాల్లో పడతాయి.

–నెహ్రుబాబు, జేడీ, పశుసంవర్థక శాఖ

Updated Date - 2022-11-28T01:04:45+05:30 IST