సైబర్‌..వల

ABN , First Publish Date - 2022-06-11T05:53:53+05:30 IST

సోషల్‌ మీడియాలో సైబర్‌ క్రైం కొత్త కాకపోయినా.. ఇటీవల నకిలీ ఫేస్‌బుక్‌ల ఖాతాలు, వాట్సాప్‌ ఖాతా, గ్రూపులు ఆకస్మికంగా సెల్‌ఫోన్‌లో ఆకర్షిస్తున్నాయి.

సైబర్‌..వల

సోషల్‌ మీడియా ఖాతాల్లోకి సైబర్‌ నేరగాళ్ల చొరబాటు
వాట్సాప్‌.. ఎఫ్‌బీలతో నకిలీ ఖాతాలు
లాటరీ.. రుణం కావాలా అంటూ మెసేజ్‌లు
అప్రమత్తంగా లేకుంటే నష్టపోక తప్పదు


‘నా ఫొటోతో ఫేక్‌ వాట్సాప్‌ అకౌంట్‌ మెసేజ్‌లు పంపుతున్నారు.. అటువంటి వాటిపై ప్రజలు అప్రమత్తంగా ఉండాలి.. కొందరు వ్యక్తులు ఈ ఫేక్‌ వాట్సాప్‌ అకౌంట్‌ని క్రియేట్‌ చేశారు.. అమెజాన్‌ ప్లే గిఫ్ట్‌ కార్డు కొనుగోలు చేయమని కొందరికి మెసేజ్‌లు పంపడం నా దృష్టికి వచ్చింది. ఇటువంటి మెసేజ్‌లు ఎవరికైనా వస్తే సంబంధిత వాట్సాప్‌ నెంబర్‌ను పోలీసులతోపాటు కలెక్టరేట్‌లోని జిల్లా రెవెన్యూ అధికారి దృష్టికి తీసుకురండి..’  – జిల్లా కలెక్టర్‌ ప్రశాంతి ఈ నెల 9న చేసిన ప్రకటన.

భీమవరం, జూన్‌ 10 : సోషల్‌ మీడియాలో సైబర్‌ క్రైం కొత్త కాకపోయినా.. ఇటీవల నకిలీ ఫేస్‌బుక్‌ల ఖాతాలు,  వాట్సాప్‌ ఖాతా, గ్రూపులు ఆకస్మికంగా సెల్‌ఫోన్‌లో ఆకర్షిస్తున్నాయి. జిల్లా కలెక్టర్‌ ఫొటోతో ఇలాగే వాట్సాప్‌ ఖాతా సృష్టించారు. కలెక్టర్‌ వాట్సాప్‌ పోస్టులకు ప్రత్యేకత ఉం టుంది.. దాని ఉపయోగించుకుంటూ సైబర్‌ నేరగాళ్లు ఫేక్‌ వాట్సాప్‌ ఖాతా తెరచి అందులో కొన్ని వాణిజ్య ఉత్పత్తులను ప్రచారానికి పెట్టారంటూ మెసేజ్‌ చేశారు.

నకిలీ ఖాతాలతో..
ఫేస్‌బుక్‌, వాట్సాప్‌, ట్విట్టర్‌ ఖాతాలున్న సెల్‌ఫోన్‌లో అప్పుడప్పుడు నకిలీ ఖాతాలు దర్శనమిస్తున్నాయి. సైబర్‌ నేరగాళ్లు ఎలాగో నెంబర్‌ను సంపాదించి.. ఉత్పత్తుల ప్రచారాలలే కాకుండా మీకు లక్ష రూపాయల రుణం మంజూరైంది. ఆన్‌లైన్‌లో మీ బ్యాంకు వివరాలను పెట్టండి.. అంటూ పోస్ట్‌ చేస్తున్నారు. దీనికి ఆకర్షితులైన వాళ్లు బ్యాంకు ఖాతాలను బహిర్గతం చేసి ఆపై లబోదిబోమంటూ బ్యాంకుల వద్ద పరుగెడుతున్న ఘటనలు నిత్యం కనిపిస్తున్నాయి. సోషల్‌ మీడియాలో ప్రముఖుల వ్యక్తిగత ఖాతాలను ఫేక్‌ ఖాతాలు సృష్టించి వాటి ద్వారా తప్పుడు సమాచారం ఇస్తున్నారు. ఎందుకంటే ఆ ఖాతాకు ఉన్న ప్రతిష్ట వల్ల ఆ సమాచారం పాఠకుల దృష్టిని ఆకర్షించడం,  వేగంగా వ్యాప్తి చెందే అవకాశం ఉంది. ఇలాంటి సామాజిక పోస్టింగ్‌ ప్లాట్‌ఫారమ్‌తో వ్యక్తుల బ్రాండ్‌ను వాడుకుంటూ వారి వ్యాపారాన్ని వృద్ధి చేసుకోవడమన్నమాట.

 ఫేస్‌బుక్‌ ఖాతాలతో మోసాలు
ఫేస్‌బుక్‌ ద్వారా నకిలీ సమాచారాలతో వ్యక్తుల పలుకుబడిని వాడుకుంటున్నారు. ఫేస్‌బుక్‌ ఖాతాకు సెక్యూరిటీ పాస్‌వర్ట్‌ ఉంటుంది. దానిని సాధారణంగా ఎక్కువ మంది వారి పేరుతో ఉండే అక్షరాలను పాస్‌వర్ట్‌ వాడుతూ ఉంటారు. మరికొందరు వారి సెల్‌ నెంబర్‌ని పాస్‌వర్డ్‌గా వాడతారు. ఈ సైబర్‌ నేరగాళ్లు ఫేస్‌బుక్‌ ఖాతాలోకి చొరబడి రకరకాల పాస్‌వర్డ్‌లు ఉపయోగించి తెరిచే ప్రయత్నం చేస్తారు. పది ఖాతాలను ట్రై చేస్తే ఒక ఖాతా అయినా ఓపెన్‌ అయ్యే పరిస్థితులు నెలకొన్నాయి. గతేడాది ఒక ప్రముఖుడి పేరును ఫేస్‌బుక్‌ ద్వారా వాడుకుంటూ విరాళాలు ఇవ్వాలని ప్రకటన వచ్చింది. దీంతో సదరు నాయకుడు అప్రమత్తమై తన ఫేస్‌బుక్‌ హ్యాక్‌ అయ్యిందని ఒక మేసేజ్‌ పెట్టి ఆ ఫేస్‌బుక్‌ ఖాతాను తాత్కాలికంగా నిలిపివేశారు. ఇటువంటి అనుభవాలు సామాన్యులు సైతం ఎదుర్కొంటున్నారు. ఫేస్‌బుక్‌ ఖాతాదారుడు గుర్తించే లోగానే అతని పేరు వాడుకుని నేరగాళ్లు తమ ఆన్‌లైన్‌ అకౌంట్‌ ద్వారా కొంత సొమ్మును వసూలు చేసుకున్న ఘటనలు ఎన్నో ఉన్నాయి.

రాజకీయ నేతల పేర్లతో..
ఇటీవల రాజకీయ నాయకులకు సంబంధించి సోషల్‌ మీడియా ఖాతాలను కొందరు నేరగాళ్లు హ్యాక్‌ చేసి వారి అభిప్రాయాలకు భిన్నంగా సమాచారం పెడుతూ అల్లరి సృష్టిస్తున్న ఘటనలు పత్రికల్లో వస్తూనే ఉన్నాయి. అయితే మన జిల్లాలో ఇటువంటి ఘటనలు తక్కువే. ట్విట్టర్‌ ఖాతాలను సైబర్‌ నేరగాళ్లు హ్యాక్‌ చేస్తూ వారి సొంత సమాచారాన్ని అందులో పంపిస్తున్న ఘటనలు ఉన్నాయి. అయితే ఇటువంటి జరిగినప్పుడు పోలీసులకు ఫిర్యాదు చేస్తున్న బాధితుల సంఖ్య తక్కువగానే ఉంటోంది.

 ప్రొఫైల్‌ ఫొటో ఆకర్షించేలా..

ఇటీవల నకిలీ వాట్సాప్‌ ఖాతా ప్రారంభించినప్పుడు వాట్సాప్‌ ప్రొఫైల్‌ ఫొటో ఆకర్షించేలా పెడుతున్నారు. అంటే.. అందమైన అమ్మాయి ఫొటో, ప్రత్యేక ఆకర్షణీయమైన నినాదంతో వీటిని సృష్టిస్తూ ఆకట్టుకుంటున్నారు. ఇందులో కొంత మంది ‘మీరు ఎవరు? అంటూ ప్రశ్నిస్తూ స్నేహాన్ని కోరుకోవడం.. మరికొన్నిం టిలో మీకు రుణం కావాలా? మమ్మల్ని సంప్రదించండి అంటూ వ్యక్తిగత బ్యాంకు డేటా చోరీకి వల వేస్తున్న పోస్టులు ఎన్నో ఉన్నాయి. ఇలాంటి వాటిపై పోలీస్‌ స్టేషన్‌లో ఫిర్యాదులు అంతంత మాత్రంగానే ఉంటున్నాయి.

పాస్‌వర్డ్‌ భద్రం..
సోషల్‌ మీడియాపై అవగాహన పెంచుకుంటే నకిలీ సమాచారాలను గుర్తించి మన ఖాతా రక్షణ చర్యలు తీసుకోవచ్చు. ప్రధానంగా సోషల్‌ మీడియాలో ఉండే వాట్సాప్‌, ఫేస్‌బుక్‌ల పాస్‌వర్డ్‌ల విషయంతో చాలా జాగ్రత్తగా ఉండాలి. తరచూ పాస్‌వర్డ్‌లు మార్పు చేయాలి. దీనికోసం మన ఖాతాలను నిరంతరం తనిఖీ చేసువాల్సి ఉంటుంది. కాగా కొత్తగా జిల్లా ఏర్పడిన తర్వాత సైబర్‌ క్రైంకి సంబంధించి వాట్సాప్‌, ఫేస్‌బుక్‌, ట్విట్టర్‌ ఖాతాలను నకిలీవి సృష్టించి దుర్వినియోగం చేసిన వ్యవహారాలపై ఎటువంటి ఫిర్యాదులు అందలేదని జిల్లా పోలీసుశాఖ తెలిపింది. 

Read more