టార్గెట్‌.. 90 డేస్‌

ABN , First Publish Date - 2022-09-26T05:37:19+05:30 IST

జగనన్న గృహ నిర్మాణాలను వేగవంతం చేసేం దుకు అధికారులు ఉరుకులు, పరుగులు పెడుతున్నారు.

టార్గెట్‌.. 90 డేస్‌

అధికారుల మెడ మీద ఇళ్ల కత్తి..!
జగనన్న గృహ నిర్మాణాలపై ఉరుకులు.. పరుగులు
డిసెంబరు చివరి వారానికి 60 వేల గృహాలు లక్ష్యం
కొత్తగా 14,269 గృహాలకు అనుమతి
గృహ నిర్మాణ యాప్‌తో రోజుల తరబడి కుస్తీ..


భీమవరం, సెప్టెంబరు 25 :
జగనన్న గృహ నిర్మాణాలను వేగవంతం చేసేం దుకు అధికారులు ఉరుకులు, పరుగులు పెడుతున్నారు. డిసెంబరు చివరి వారానికి ముఖ్యమంత్రి గృహ నిర్మాణాలను ప్రారంభిస్తారని ఆదేశాలు రావడంతో అధికారుల మెడపై టార్గెట్‌ల కత్తి వేలాడుతోంది. మరో 90 రోజులలో ఇళ్లను పూర్తి చేయాలన్న ప్రభుత్వం ఇచ్చిన గడువుతో అధికార యం త్రాంగం ఉక్కిరిబిక్కిరి అవుతోంది. డిసెంబరు 25న జిల్లాలో పూర్తి చేసిన అన్ని గృహాలను ముఖ్యమంత్రి ప్రారంభించనున్నారు. వాస్తవానికి నిర్మాణ వ్యయం పెరిగిపోయి ప్రకృతి అనుకూలించక కూలీలు దొరక్క అష్టకష్టాలతో జిల్లాలో జగనన్న గృహనిర్మానాలు సాగుతున్నాయి. ప్రస్తుతానికి 20 శాతం పనులే పూర్తయ్యాయి. నవంబరు 31వ తేదీ నాటికి సింహ భాగం పనులు పూర్తి చేయాలని ఆదేశాలొచ్చాయి. రెండేళ్లుగా సాగని పనులు మరి ఈ 90 రోజుల్లో ఏ మేరకు పూర్తి చేయగలమనేది అధికారులనూ వేధిస్తోంది.
జిల్లాలో గృహాల సంఖ్య 71,787
జిల్లాలో 19 మండలాలతోపాటు ఆరు మునిసిపాలిటీల్లో 71,787 గృహాలను నిర్మిస్తున్నారు. ఇందులో ప్రభుత్వం మంజూరు చేసిన లే అవుట్లలో 51,761 గృహాలు, సొంత స్థలాల్లో 20,026 గృహాలు నిర్మించాల్సి ఉంది. ఈ ఏడాది మే నాటికి సుమారు ఏడు వేల గృహాల నిర్మాణం పూర్తి చేయగా ఈ నెలకు ఆ సంఖ్య 9 వేలకు చేరింది. మరో 60 వేలకుపైగా గృహాల లక్ష్యం అధికారులు ముందు ఉంది. డిసెంబరు 25న సీఎం జిల్లాలో గృహ నిర్మాణాలను ప్రారంభించనున్నట్టు అధికారులకు ఆదేశాలు వచ్చాయి. ఇళ్ల నిర్మాణాలను వేగవంతంగా పూర్తి చేయాలని మూడు వారాలుగా జిల్లా కలెక్టర్‌ పి.ప్రశాంతి అధికారులతో సమీక్షిస్తూ హెచ్చరికలు జారీ చేస్తున్నారు.


కొత్తగా 14,269 గృహాల మంజూరు
ఈ నెలలో కొత్తగా 14,269 గృహ నిర్మాణాలు మంజూరు చేశారు. వీరవాసరం, తణుకు అర్బన్‌లో మాత్రమే పురోగతి ఉందని, మిగతాచోట్ల బాగా వెనుకబడ్డారని ఇటీవల కలెక్టర్‌  ఆగ్రహం వ్యక్తం చేశారు. ఆచంట, ఆకివీడు, భీమవరం, కాళ్ళ, నరసాపురం, తాడేపల్లిగూడెంలో ఇంత వరకు లబ్ధిదారుల జాబితాను ఇంజనీర్లు అప్డేట్‌ చేయలేదు.


 గృహ నిర్మాణ యాప్‌తో కుస్తీ..
జగనన్న ఇళ్ల నిర్మాణం కోసం రూపొందించిన నిర్మాణ యాప్‌లో ఇంజనీరింగ్‌, వెల్ఫేర్‌ అసి స్టెంట్లు లబ్ధిదారుల స్టేజ్‌ అప్డేషన్‌ రోజూ చేయాలి. యాప్‌ అప్డేషన్‌లో ఎంపీడీవోల పూర్తి పర్యవేక్షణ ఉండాలి. క్షేత్రస్థాయిలో పర్యటించాలి. యాప్‌ అప్డేషన్‌లో తణుకు అర్బన్‌, పెనుమంట్ర, వీరవాసరం మండలాలు ముందుండగా మిగిలిన మండలాల్లో సిబ్బంది కుస్తీ పడుతున్నారు. డీఆర్‌డీఏ రుణాలు తీసుకునే వారి జాబితా యాప్‌లో అప్డేట్‌ చేయాలి. ఏపీఎంలు రోజుకి 100 మంది లబ్ధిదారుల వివరాలను యాప్‌లో అప్డేట్‌ చేయాలి. జగనన్న గృహ నిర్మాణాలు అధికారులకు కంటిమీద కునుకు లేకుండా చేస్తున్నాయి.

పూడిక లేదు.. రోడ్లూ లేవు
ప్రస్తుతం జిల్లాలో వివిధ దశలలో వేలాది గృహాలు నిర్మాణానికి నోచుకోక పెండింగ్‌లో ఉన్నాయి. నిధుల కొరత లేదని బిల్లులు మంజూరు చేస్తామని అధికారులు చెబుతున్నా లబ్ధిదారులు ముందుకు రాని పరిస్థితి.  క్షేత్రస్థాయిలో స్థలాలు పూడికకు నోచుకోకపోవడం, స్థలాల్లోకి వెళ్లేందుకు కనీసం రోడ్లు లేకపోవడం ప్రధాన కారణాలు నిలుస్తున్నాయి.

Updated Date - 2022-09-26T05:37:19+05:30 IST