-
-
Home » Andhra Pradesh » West Godavari » westgodavri froud in childline-MRGS-AndhraPradesh
-
సంరక్షణ పేరుతో అక్రమాలు
ABN , First Publish Date - 2022-09-12T05:05:30+05:30 IST
ఏలూరు జిల్లా కేంద్రం ఏలూరులో ఒక ఎన్జీవో ద్వారా నిర్వహిస్తున్న చైల్డ్‌లైన్ – 1098 సెటిల్ మెంట్లకు అడ్డాగా మారింది.

చైల్డ్‌లైన్ – 1098లో అక్రమాలు.. మహిళా కమీషన్ సీరియస్
ఏలూరు రూరల్, సెప్టెంబరు 11 : ఏలూరు జిల్లా కేంద్రం ఏలూరులో ఒక ఎన్జీవో ద్వారా నిర్వహిస్తున్న చైల్డ్‌లైన్ – 1098 సెటిల్ మెంట్లకు అడ్డాగా మారింది. బాలల సంరక్షణ చూడాల్సిన చైల్డ్‌లైన్ ఆపదలో ఉన్న అనాధ బాలలు, మహిళ సంరక్షణ పేరుతో అక్రమాలకు పాల్పడుతున్న ఘటన ఆలస్యంగా వెలుగు చూసింది. ఇటీవల ఒక బాల్య వివాహం జరగ్గా యువకుడి తల్లిదండ్రులను చైల్డ్లైన్లోని ఓ ఎన్జీవో డబ్బు డిమాండ్ చేయడంపై ఆరోపణలు గుప్పుమన్నాయి. అతనిపై గతం నుంచి ఆరోపణలు ఉన్నాయి. అతన్ని 2017లో స్ర్తీ శిశు సంక్షేమ శాఖ నుంచి డిస్మిస్ చేస్తూ అప్పటి కలెక్టర్ కాటమనేని భాస్కర్ చర్యలు తీసుకున్నారు. అనంతరం చైల్డ్‌లైన్‌లో చేరి యఽథేచ్ఛగా అనధికారిక కార్యకలాపాలు సాగిస్తున్నాడని, దీనికితోడు ఏలూరు బాలల సంక్షేమ సమితి సహకారంతో కార్యకలా పాలు సాగిస్తున్నట్టు ఆరోపణలు వెల్లువెత్తు తున్నాయి. వీరి పని తీరుపై ఉన్నతాధికారులు సమీక్షలు నిర్వహించకపోవడంతోనే చైల్డ్‌లైన్, సీడబ్ల్యూసీ తీరు మారిందన్న ఆరోపణలు వెల్లువెత్తుతున్నాయి. సంరక్షణపేరుతో సెటిల్మెంట్లు చేయడంపై మహిళా కమీషన్ సైతం సీరియస్ అయింది. ఈ విషయంపై సంబంధిత స్ర్తీ, శిశు సంక్షేమ శాఖ అధికారులతో మహిళా కమీషన్ సభ్యురాలు బూసి వినీత మాట్లాడారు. అనాధలు, ఆపదలో ఉన్న చిన్నారులను సంరక్షణ పేరుతో అక్రమాలకు పాల్పడినట్లు ఆరోపణలు రుజువైతే కఠిన చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు. బాల్య వివాహాలు జరిగితే తల్లిదండ్రులతో డబ్బులు కట్టేలా ఒప్పిస్తూ సంతకాలు, వేలిముద్రలు తీసుకునే అధికారం చైల్డ్‌లైన్‌కు లేదన్నారు.