ఇక ధాన్యం సేకరణలో వలంటీర్లు?

ABN , First Publish Date - 2022-09-29T05:42:19+05:30 IST

ధాన్యం సేకరణలో ఇక నుంచి వార్డు వలంటీర్లు ముఖ్యపాత్ర వహించేలా అధికారులు ఆదేశించారు.

ఇక ధాన్యం సేకరణలో వలంటీర్లు?

గ్రామీణ ప్రాంతాల వారికి అదనపు బాధ్యతలు
వలంటీర్ల ప్రాధాన్యంపై సర్వత్రా చర్చ

భీమవరం, సెప్టెంబరు 28 : ధాన్యం సేకరణలో ఇక నుంచి వార్డు వలంటీర్లు ముఖ్యపాత్ర వహించేలా అధికారులు ఆదేశించారు. వచ్చే పంట కాలం నుంచి వలంటీర్లకు.. ముఖ్యంగా గ్రామీణ ప్రాంత వలంటీర్లకు అదనపు బాధ్యతలు అప్పగించాలని ప్రభుత్వం ఇప్పటికే ఆదేశాలు ఇచ్చింది. జిల్లా అధికారులు ఈ మేరకు రెవెన్యూ శాఖకు ఆదేశాలు ఇచ్చారు. గతంలో ఒక్క సహకార సంఘాల యంత్రాంగమే ఈ కార్యక్రమం చేపట్టేది. వీరికి మహిళా గ్రూపు సభ్యులు సహకరించేవారు. ధాన్యం కొనుగోలులో వారికి కొంత కమిషన్‌ ఇచ్చేవారు. వైసీపీ ప్రభుత్వం వచ్చిన తర్వాత రెండేళ్లుగా రైతు భరోసా కేంద్రాల ద్వారా కొనుగోలు ప్రారంభించారు. సహకార సంఘాలు కొనుగోలు సంస్థలుగా మారాయి. అయితే కొనుగోళ్లలో సహకార శాఖ సిబ్బంది పాత్ర మాత్రం తగ్గలేదు. ఈ తరుణంలో కొత్తగా ఈసారి వార్డు వలంటీర్లకు ధాన్యం కొనుగోళ్ల బాధ్యతలు అప్పగించాలని ప్రభుత్వం నిర్ణయించడంపై సర్వత్రా చర్చ సాగుతోంది. వలంటీర్‌ వ్యవస్థ వచ్చిన తర్వాత  ప్రభుత్వ పథకాలకు సంబం ధించి అన్ని రకాల వ్యవహారాల్లోనూ, ముఖ్యమైన కార్యక్రమాల్లో వారి జోక్యంపై కొంత వివాదం నడుస్తోంది. మరోవైపు వారికి ఇచ్చే వేతానికి.. నిర్వహించే విధులకు సంబంధం లేదని, పనిభారం ఉందని కొంత మంది వలంటీర్లు ఇప్పటికే ఆవేదన వ్యక్తం చేస్తున్నా రు. కొన్ని నెలలుగా వీరికి బాధ్యతలు మరింత పెంచా రు. ఇప్పుడు  పూర్తిగా వారికి సంబంధం లేని ధాన్యం కొనుగోళ్లలోనూ జోక్యం చేసుకునే విధంగా ప్రభుత్వం ఆదేశించడం రైతుల్లో చర్చ సాగుతోంది.
ఫ వచ్చే ఖరీఫ్‌ 2022–23 సంవత్సరానికి ప్రభు త్వం ధాన్యం రైతు భరో సా కేంద్రాల ద్వారా కొనుగోలు చేయడానికి జిల్లా సేకరణ కమిటీ ఏర్పాట్లు చేస్తుంది. ఖరీఫ్‌ కాలానికి జిల్లాలో సుమారు 5,47,000 ఎంటీ ఎస్‌ ధాన్యం పండవచ్చని అంచనా వేస్తున్నట్టు ఇటీ వల సమావేశంలో జేసీ మురళి పేర్కొన్నారు. ఇందులో 4.92 లక్షల టన్నుల ధాన్యం సేకరణ జరగవచ్చని అంచనా వేశారు. ఇందుకు 115 సొసైటీల ఆధ్వర్యంలో 296 ధాన్యం సేకరణ కేంద్రాలు, రైతు భరోసా కేంద్రాల్లోను ఏర్పాట్టు చేస్తున్నారు. మరోవైపు  గత పంటకు సంబంధించి 828 మంది రైతులకు సుమారు రూ.30 కోట్లు బకాయిలు చెల్లించాల్సి ఉంది.

Read more