ఉపాధితో రైతుకు మేలు

ABN , First Publish Date - 2022-01-24T04:19:25+05:30 IST

ఏడాది మొత్తం వ్యవసాయ పనులు ఉండవు కనుక గ్రామాల్లో వ్యవసాయ కూలీలకు, రైతు కూలీలకు పని కల్పించే నిమిత్తం కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు జాతీయ ఉపాధి హామీ పథకాన్ని అమలు చేస్తున్నా యి.

ఉపాధితో రైతుకు మేలు

ఉపాధి హామీ పథకాన్ని వ్యవసాయానికి అనుసంధానం చేయాలని రైతుల విజ్ఞప్తి
కూలీల కొరతకు చెక్‌.. ఏడాది మొత్తం కూలీలకు పని
రైతులకు తగ్గనున్న ఖర్చుల భారం


దెందులూరు, జనవరి 23 : ఏడాది మొత్తం వ్యవసాయ పనులు ఉండవు కనుక గ్రామాల్లో వ్యవసాయ కూలీలకు, రైతు కూలీలకు పని కల్పించే నిమిత్తం కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు జాతీయ ఉపాధి హామీ పథకాన్ని అమలు చేస్తున్నా యి. దీని ద్వారా కుటుంబానికి వంద రోజుల పని కల్పిస్తున్నాయి. అయితే 80 శాతం గ్రామాల్లో జాతీయ ఉపాధి హామీ పథకంలో ప్రజలు ఉపయోగపడే పని లేక పోయిన కుటుంబానికి 100 రోజులు పనులు కల్పించాలి కాబట్టి అవసరం లేని చెరువుల పూడికతీత, గట్లు పటిష్టం, పిచ్చి మొక్కల తొలగింపు వంటి పనులు చేయిస్తూ రోజులు పూర్తి చేయిస్తున్నారు. దీంతో ఉపాధి లక్ష్యం పూర్తిగా నెరవేరడం లేదు. మరోవైపు రైతులకు వ్యవసాయ పనులకు కూలీలు దొరకని పరిస్థితి ఉంటోంది. ఈక్రమంలో ఉపాధి పథకాన్ని వ్యవసాయ రంగా నికి అనుసంధానం చేస్తే ఇటు రైతులకు వ్యవసాయ ఖర్చులు కలసి వస్తాయి.. అటు కూలీలకు పని దొరుకుతుందని పలువురు చెబుతున్నారు.

తగ్గనున్న ఖర్చులు.. నష్టాలు


దేశానికి అన్నం పెట్టే రైతు అకాల వర్షం, ఈదురు గాలులు, మద్దతు ధర లేక పోవడం పంటలకు రకరకాల తెగుళ్లు, నకిలీ విత్తనాలు, కూలీల కొరత, గణనీయంగా పెరిగిన పెట్టుబడులతో నష్టాల పాలవుతున్నారు. కొంతమంది చేసిన అప్పులు తీరే దారి కానరాక ఆత్మహత్యలు చేసుకుంటున్నారు. రాష్ట్రంలో  ప్రభుత్వ లెక్కల ప్రకారం 63 శాతం మంది వ్యవసాయం మీదనే ఆధార పడి జీవనం కొనసాగిస్తున్నారు. వ్యవసాయానికి ఉపాధి పథకాన్ని అనుసంధానం చేస్తే  ఖర్చులు 30 శాతం తగ్గడంతో రైతులు నష్టాల నుంచి బయటపడతారని రైతు సంఘాలు, రైతులు ఎప్పటి నుంచో డిమాండ్‌ చేస్తున్నారు. దెందులూరు మండంలంలో 80 శాతం ఉన్న రైతులు, రైతు కూలీలు ఎన్నో రోజులుగా వ్యవ సాయానికి అనుసంధానం చేయాలని కోరుతున్నారు. కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు స్పందించి జాతీయ ఉపాధి హామీ పథకాన్ని వ్యవసాయ రంగానికి అను సంధానం చేసి ఆదుకోవాలని రైతులు కోరుతున్నారు.

 వ్యవసాయ రంగానికి అనుసంధానం చేయాలి
కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలను ఎప్పటి నుంచో రైతులు, రైతు సంఘం నేతలు జాతీయ ఉపాధి హామీ పథకాన్ని వ్యవసాయ రంగానికి అనుసంధానం చేయాలని డిమాండ్‌ చేస్తున్నాం. ఇలా చేయడం వల్ల రైతులకు వరి కోతలు, పామాయిల్‌ , అరటి, నిమ్మ, మొక్కజొన్న ఇరుపులు లాంటి అదనపు ఖర్చు తగ్గుతుంది. కూలీల కొరతను అధిగమించవచ్చు. దీనిపై వెంటనే నిర్ణయం తీసుకోవాలి.
– గండి రాజా, రైతు సంఘం దెందులూరు మండల అధ్యక్షుడు

అన్ని పంటలకూ వర్తించేలా చూడాలి
దేశానికి అన్నం పెట్టే రైతు కన్నీరు ప్రభుత్వాలకు మంచిది కాదు. రైతు ప్రభుత్వా మని కేంద్ర,రాష్ట్ర ప్రభుత్వాలు గొప్పలు చెప్పకుండా రైతులను ఆదుకునేందుకు జాతీయ ఉపాధి హామీ పథకాన్ని వ్యవసాయా రంగానికి అనుసంధానం చేయాలి. అన్ని పంటలకు వర్తించేలా ప్రభుత్వం నిర్ణయం తీసుకుంటే రైతులు కొంత మేర నష్టాల నుంచి బయట పడతారు.
– యలమర్తి శ్రీనివాసరావు, రైతు, పెరుగుగూడెం

అనుసంధానంతో రైతులకు చాలా మేలు
పామాయిల్‌ పంటకు పెట్టుబడులు పెరిగాయి. జాతీయ ఉపాధి హామీ పథకాన్ని వ్యవసాయ రంగానికి అనుసంధానం చేయడం వల్ల పామాయిల్‌ రైతులకు సాగు నీరు అందించడం నుంచి గెలలు కోయడం, సేకరించడం, లోడింగ్‌ పనులకు పెట్టు బడి తగ్గే అవకాశం ఉంది. ప్రభుత్వం ఉపాధి పథకాన్ని అనుసంధానం చేయాలి.
– మోతుకూరి శోభన్‌బాబు (నాని), పామాయిల్‌ రైతు

Read more