గూడు..గోడు

ABN , First Publish Date - 2022-08-01T05:38:23+05:30 IST

తెలుగుదేశం ప్రభుత్వం హయాంలో పట్టణ పేదల కోసం చేపట్టిన టిడ్కో గృహాలపై వైసీపీ ప్రభుత్వం నిర్లక్ష్య వైఖరి చూపుతూ పట్టించుకోవడం లేదు.

గూడు..గోడు
పాలకొల్లులో టిడ్కో గృహాల వద్ద పెరిగిన పిచ్చి మొక్కలు

అధ్వానంగా టిడ్కో గృహ సముదాయాలు
టీడీపీ ప్రభుత్వ హయాంలో టిడ్కో ఇళ్ల నిర్మాణాలు ప్రారంభం
ఆపై పట్టించుకోని వైసీపీ ప్రభుత్వం
మధ్యలో నిలిచిపోయిన గృహా సముదాయాలు
మౌలిక వసతుల ఊసే లేదు
చిట్టడవులను తలపిస్తున్న ఆవాసాలు..
 పాములు.. విష పురుగులు తిష్ట
తుప్పు పట్టిన ఇళ్ల ఇనుప సామగ్రి
మురుగు పోయే దారి లేదు..
మంచినీళ్ల కోసం పాట్లు పడాల్సిందే..
వీధి దీపాలు మరిచారు..
పూర్తికాని ఫ్లాట్లనే లబ్ధిదారులకు అంటగట్టేందుకు సన్నాహాలు


తెలుగుదేశం ప్రభుత్వం హయాంలో పట్టణ పేదల కోసం చేపట్టిన టిడ్కో గృహాలపై  వైసీపీ ప్రభుత్వం నిర్లక్ష్య వైఖరి చూపుతూ పట్టించుకోవడం లేదు.  దాదాపు నిర్మాణం పూర్తి చేసుకున్న ఈ ఇళ్లు లబ్ధి దారులకు అందక నిరుపయోగంగా మారాయి. వైసీపీ ప్రభుత్వం వచ్చి మూడున్నరేళ్లు కావొస్తున్నా ఒక్క అంగుళం కూడా  నిర్మాణాలు ముందుకు కదల్లేదు. ఎక్కడ నిర్మాణాలు అక్కడే నిలిచిపోయాయి. దీంతో చాలాచోట్ల ఐరన్‌లు తుప్పు పట్టడం, నిర్మాణాలు పాడవడం, పిచ్చిమొక్కలు మొలిచాయి. ప్రభుత్వం టిడ్కో గృహాలు లబ్ధిదారులకు ఇస్తామని చెబుతున్నా నిర్మాణాలు పూర్తి చేయడానికి చర్యలు మాత్రం చేపట్టడం లేదు. అసలు పూర్తి చేస్తారో లేదో అన్న సందేహాలు వ్యక్తమవుతున్నాయి. ఈక్రమంలోనే మరోసారి ఈనెల 3న లబ్ధిదారులకు పట్టాలు ఇవ్వ డానికి రంగం సిద్ధం చేస్తు న్నా రు. నిర్మాణాలు పూర్తి స్థాయిలో చేయకుండానే, అరకొర వస తులతో ఉన్న ఫ్లాట్లను అంట గట్టేందుకు సన్నాహాలు చేస్తుం డడంతో లబ్ధిదారుల నుంచి విమర్శలు వ్యక్తమవుతున్నాయి. జిల్లాలోని టిడ్కో ఇళ్ల సముదాయాల వద్ద      పరిస్థితిపై ఆంధ్రజ్యోతి పరిశీలన..

 మధ్యలోనే వదిలేశారు..
తణుకు పట్టణ పరిధిలో 912 గృహాలు నిర్మించాలని తలపెట్టారు. అజ్జరం కాలనీ వద్ద 432 పాట్లు, బాల బాలాజీ టెక్స్‌టెల్స్‌ వద్ద 480 గృహాలు నిర్మించాలని భావించి లబ్ధిదారులను ఎంపిక చేశారు. తర్వాత ప్రభుత్వం మారడం వల్ల నిర్మాణదారులకు బిల్లులు చెల్లించక పోవడం వల్ల నిర్మాణాలు ఎక్కడవి అక్కడే నిలిచిపోయాయి. జన సంచారం లేక భవనాల వద్ద పరిస్థితి భయానకంగా ఉంది. తుప్పలతో నిండి విష పురుగులకు నిలయంగా మారాయి. ఇక్కడకు వస్తే ఎలా ఉండాలన్న భయం లబ్ధిదారుల్లో నెలకొంది.

 వీధి దీపాలు.. మురుగునీటి ఇబ్బందులు
 భీమవరం పట్టణ లబ్ధిదారులు 8300 వేల మంది కోసం తాడేరు శివారులో 82 ఎకరాల్లో టిడ్కో ఇళ్ల నిర్మాణం చేపట్టారు. మౌలిక సదుపాయాలు ఇంకా పూర్తి కాకపోవడంతో లబ్ధిదారులకు ఇబ్బందులు తప్పని పరిస్థితి. మురుగునీటికి సంబంధించి సీవరేజ్‌ ట్రీట్‌మెంట్‌ ప్లాంట్‌ నిర్మాణం ఇంకా పూర్తికాలేదు. మురుగునీటి పారుదలకు సంబంధించి అధికారులు ఎటువంటి చర్యలు తీసుకుంటారో సమాధానం లేదు. ఇప్పటికే మంచినీటి సరఫరాకు సంబంధించి, విద్యుత్‌కు సంబంధించి ఏర్పాట్లు చేసినట్టు అధికారులు చెబుతు న్నారు. వీధి దీపాలను ఏర్పాటు చేయాల్సి ఉంది. గతంలో వేసిన రోడ్లపై చెత్త చెదారం పేరుకుపోగా  గత 29న లబ్ధిదారులకు  పట్టాలు ఇస్తారనే ఉద్దేశ్యంతో శుభ్రం చేశారు. ఈ క్రమంలో ఈనెల మూడున సుమారు 1985 మందికి పట్టాలు ఇచ్చేందుకు అధికారులు ఏర్పాట్లు చేస్తున్నారు.  

 ఆ ఇళ్లల్లో ఎలా ఉండాలి..?

 పాలకొల్లు పట్టణ పేదల ఇంటి సమస్య పరిష్కరించడానికి గత టీడీపీ ప్రభుత్వంలో  పట్టణ సమీపంలో పెంకుళ్ళపాడు వద్ద నిర్మించ తలపెట్టిన 6144 టిడ్కో గృహాలకు గానూ 2019 నాటికి దాదాపుగా 90 శాతం పైగా పూర్త య్యాయి. అనంతరం వైసీపీ ప్రభుత్వం వచ్చాకా ఏవిధమైన పురోభివృద్ధి లేదన్న విమర్శలు వస్తున్నాయి. లబ్ధిదారులకు ఇళ్లను స్వాధీనం చేయాలని లబ్ధిదారులు ఆందోళనలు చేశారు. ఇళ్లను స్వాధీనం చేయడానికి పలు ముహూర్తాలు నిర్ణయించినా వాయిదాలు పడ్డాయి. మరోసారి ఆగస్టు 3న ఇవ్వడానికి రంగం సిద్ధం చేస్తున్నారు. ఈ నేపథ్యంలో 1856 ఇళ్లను మాత్రం లబ్ధిదారులకు ఇచ్చేందుకు అధికారులు సన్నాహాలు చేస్తున్నాయి. లబ్ధిదారులు ఇళ్లల్లో ప్రవేశించడానికి ముఖ్యంగా మంచినీటి సౌకర్యం లేకపోవడం (ఓహెచ్‌ఎస్‌ఆర్‌ నిర్మాణం అసంపూర్తిగా ఉండడం) రహదారులు, ఇళ్ల ముందు పిచ్చి మొక్కలు పెరిగిపోవడం, ఇళ్ల లోపల కూడా మొక్కలు పెరగడం గమనార్హం. పాములకు ఆవాసాలుగా ఇళ్లు మారాయని లబ్ధిదారులు భయాందోళన వ్యక్తం చేస్తున్నారు. మురుగునీటి పారుదల వంటి సమస్యలు ఉన్నందున ఆ ఇళ్లల్లో ఎలా నివసించగలమని లబ్ధిదారుల తరపున ఽమాజీ కౌన్సిలర్‌ ధనాని సూర్య ప్రకాష్‌ ప్రశ్నిస్తున్నారు. విద్యుత్‌ సౌకర్యం మాత్రం మొదట్లోనే ఏర్పాటు చేయడంతో సమస్య లేదు. ఈ క్రమంలో అధికారులు సౌకర్యాలు కల్పించేందుకు హడావిడిగా ప్రయత్నాలు ప్రారంభించారు.

పాములకు ఆవాసం..

 తాడేపల్లిగూడెంలో 5,300 మందికి టిడ్కో ఇళ్లు ఇచ్చేందుకు ప్రతిపాదించారు. నిర్మాణాలు పూర్తియినా వైసీపీ ప్రభుత్వం లబ్ధిదారులకు అందించలేదు. ఇటీవల భవనాలకు వైసీపీ రంగులు వేసి మొదటి విడతగా 2200 మంది లబ్ధిదారులకు హడా విడిగా పట్టాలు ఇచ్చారు. తీరా లబ్ధిదారులు అక్కడకు వెళ్లగా పాముల సంచారంతో భయానక పరిస్థితులు కన్పిం చాయి. పూర్తిస్థాయిలో వసతుల కల్పన జరగలేదు.  ప్రస్తుతం లబ్ధిదారులు బయట అద్దెలు చెల్లించలేక, నివాసానికి అనుకూలం గా లేని టిడ్కో పాట్లకు  రాలేక ఉక్కిరిబిక్కిరి అవుతున్నారు. గతంలో టిడ్కో పాట్లల్లో కొవిడ్‌ పేషెంట్‌లకు ఆశ్రయం కల్పించారు. అయితే ఆ సమయంలో వేసిన మంచాలను కూడా తొలగించకుండా వదిలే యడంతో లబ్ధిదారులు తీవ్రంగా భయపడుతున్నారు. ఇదిలా ఉంటే ఎస్‌టీపీ నిర్మాణం లేక పోవడంతో వస్తే తాగునీరు పరిస్థితి ఎలా, విద్యుత్తు పూర్తిస్థాయిలో కనెక్షన్‌లు ఇవ్వక పోవడంతో విద్యుత్తు పరిస్థితి ఏంటి? చుట్టూ తుప్పలు పేరుకుపోవడంతో ఆ తుప్పల్లో పెరిగిన పాముల నుంచి ఎలా కాపాడుకోవాలని అనే ప్రశ్నలు తలెత్తుతున్నాయి. మిగిలిన లబ్ధిదారులకు రెండో విడతలో పట్టాలు ఇచ్చేందుకు సన్నాహాలు చేస్తున్నారు.Read more