తోకలపూడిలో బడి వివాదం

ABN , First Publish Date - 2022-09-25T06:22:29+05:30 IST

తోకలపూడిలో బడి వివాదం నెలకొంది.

తోకలపూడిలో బడి వివాదం
అరుంధతీపేట చర్చిలో విద్యార్థులకు పాఠాలు

ఎస్సీ కాలనీలోనే అదనపు తరగతుల భవనం నిర్మించాలని డిమాండ్‌
కాలనీ విద్యార్థులు 25 మందికి ప్రైవేట్‌ టీచర్‌తో చర్చిలో విద్యాబోధన

వీరవాసరం, సెప్టెంబరు 24 : తోకలపూడిలో  బడి వివాదం నెలకొంది. నెల రోజులుగా ఎస్సీ కాలనీ వాసులు ఆందోళన  చేస్తున్నారు. ఆ ప్రాంతానికి చెందిన 25 మంది విద్యార్థులను పాఠశాలకు పంపకుండా స్థానికంగా ఉన్న చర్చిలో ప్రత్యేకంగా ప్రైవేట్‌ టీచర్‌తో పాఠాలు చెప్పిస్తున్నారు. అయితే ఈ వివాదం పాఠశాల విలీనానికి సంబంధించినది కాదు. పాఠశాలలో నిర్మించే అదనపు తరగతుల భవనాన్ని ఎస్సీ కాలనీలో నిర్మించాలని చేస్తున్న ఆందోళన. దీనిపై అధికారులు, నాయకులు చేపట్టిన చర్యలు ఎలా ఉన్నా విద్యార్థులు మాత్రం విద్యకు దూరమవుతున్నారు. అసలు సమస్య ఏమిటంటే.. తోకలపూడిలో తోకలపూడిపాలెం వెళ్లే రోడ్డులో ప్రాథమిక పాఠశాల ఉంది. దీనిలో 32 మంది విద్యార్థులు చదువుతున్నారు. నాడు–నేడులో ప్రాథమిక పాఠశాల కు అదనపు తరతుల భవనం నిర్మాణానికి నిధులు మం జూరు అయ్యాయి. అయితే ఈ భవన నిర్మాణంపైనే వివా దం నెలకొంది. పాఠశాలకు ఎస్సీ కాలనీ నుంచి 25 మంది హాజరు అవుతుండగా పాఠశాల ఉన్న ప్రాంతంలో ఏడుగురు విద్యార్థులు ఉన్నారు. అదనపు తరగతుల భవనాన్ని ప్రస్తుత పాఠశాల వద్దే నిర్మించేందుకు ప్రతిపాదించారు. అయితే ఎస్సీ కాలనీకి చెందిన 25 మంది విద్యార్థులు వీరవాసరం–పెనుమంట్ర రహదారి దాటి పాఠశాలకు వెళ్లాల్సి ఉండడంతో తమ పిల్లలు ప్రమాదాలకు  గురవుతున్నారని, అదనపు తరగతుల భవనాన్ని ఎస్సీ కాలనీలోనే నిర్మించాలని కాలనీవాసులు డిమాండ్‌ చేస్తున్నారు. దీనిపై ఎమ్మెల్యే గ్రంధి శ్రీనివాస్‌, జిల్లా కలెక్టర్‌ పి.ప్రశాంతి చర్యలు తీసుకుంటామని వారికి హామీ ఇచ్చారు. అయినా నెల రోజులుగా విద్యార్థులను పాఠశాలకు పంపకుండా కాలనీలోని చర్చిలో విద్యా బోధన చేయిస్తున్నారు. సమస్య పరిష్కారం అయ్యే వరకు తమ పిల్లలను పాఠశాలకు పంపేది లేదని తల్లిదండ్రులు స్పష్టం చేస్తున్నారు.

Updated Date - 2022-09-25T06:22:29+05:30 IST