మాండస్‌ ముప్పు!

ABN , First Publish Date - 2022-12-10T00:06:02+05:30 IST

మాండస్‌ తుఫాన్‌ ప్రభావంతో రైతులు మాసూళ్లయిన ధాన్యాన్ని గట్టుకు చేర్చే ప్రయత్నంలో పరుగులు తీశారు.

మాండస్‌ ముప్పు!
ఆచంటలో..

తుఫాన్‌ ప్రభావంతో జిల్లాలో వానలు..

సార్వా మాసూళ్లకు ఆటంకం..

ధాన్యం రాశులను భద్రపరిచేందుకు పాట్లు

జిల్లాలో 35వేల మెట్రిక్‌ టన్నుల ధాన్యం రాశులుగా..

78 వేల ఎకరాల పంట గాలికి ఊగిసలాట..

ఆందోళనలో అన్నదాత..

గణనీయంగా పడిపోయిన ఉష్ణోగ్రతలు

ఆక్వా సాగుపై ప్రభావం..

భీమవరం రూరల్‌/ భీమవరం, డిసెంబరు 9 : మాండస్‌ తుఫాన్‌ ప్రభావంతో రైతులు మాసూళ్లయిన ధాన్యాన్ని గట్టుకు చేర్చే ప్రయత్నంలో పరుగులు తీశారు. కొన్నిచోట్ల వరికోత యంత్రాలతో పంట మాసూళ్ల ప్రయత్నాలు చేశారు. జిల్లాలో 2 లక్షల 2వేల ఎకరాల సార్వా పంటకు వ్యవసాయ అధికారుల లెక్కల ప్రకారం లక్షా 24 వేల ఎకరాల్లో పంట మాసూళ్లు అవ్వడంతో 78 వేల ఎకరాల్లో పంట చేలుగా ఉన్నాయి. వీరవాసరం, భీమవరం, పాలకోడేరు, నరసాపురం, కాళ్ళ, ఆకివీడు, పెనుమంట్ర తదితర మండలాల్లో పంట మాసూళ్లు ముమ్మరంగా జరిగేస్థాయిలో ఉండగా తుఫాన్‌తో పనులు నిలిచిపోయాయి. ధాన్యం రాశులుగా 35 వేల మెట్రిక్‌ టన్నుల ధాన్యం రాశులుగా ఉండిపోవడంతో వాటిని బరకాలతో భద్రపరుచుకునే పనిలో రైతులు నిమగ్నం అవ్వాల్సి వచ్చింది. అయితే తుఫాన్‌ వల్ల వర్షాలు అధికం అయితే ధాన్యం రాశులు తడిచిపోవడం వరిచేలు నేలకొరగడం జరుగుతుందని రైతులు ఆందోళనలో ఉన్నారు. మాండస్‌ తుఫాన్‌ ప్రభావంతో గురువారం సాయంత్రం నుంచి పలుచోట్ల చిన్నపాటి వానలు కురిశాయి. దీంతో శుక్రవారం పగటి ఉష్ణోగ్రతలు గణనీయంగా పడిపోయాయి. భీమవరంలో మధ్యాహ్నం 28 డిగ్రీలు నమోదు కాగా సాయంత్రం 26 డిగ్రీలకు పడిపోయింది. పగటి పూటే చలి వణికిస్తోంది. సన్నని వాన జల్లులతో వాతావరణం అంతా గజిబిజిగా మారింది. తుఫాన్‌ ప్రభావం తొలగే వరకు ఇదే పరిస్థితి కొనసాగుతుందని వాతావరణశాఖ తెలిపింది. జిల్లాలో శుక్రవారం ఉదయం నమోదైన వివరాలివి.. భీమవరంలో 2.4 మిల్లీ మీటర్లు వర్షపాతం నమోదైంది. నరసాపురంలో 4.6, పాలకొల్లులో 2.4, వీరవాసరంలో 0.6, ఆకివీడోలో 1.4, ఉండిలో 2.4, పాలకోడేరులో 2.8, పెనుమంట్రలో 0.4, పెనుగొండలో 1.0, ఆచంటలో 2.0, పోడూరులో 0.6, కాళ్ళలో 0.4, మొగల్తూరులో 1.2, యలమంచిలిలో 1.2 మి.మీ నమోదైంది.

రొయ్య ఉక్కిరి బిక్కిరి

చలికాలానికి తోడు మాండస్‌ తుఫాన్‌ కారణంగా ఉష్ణోగ్రతలు గణనీయంగా తగ్గిపోయాయి. ఆక్వా సాగుపై తీవ్ర ప్రభావం చూపుతోంది. రొయ్య ఉక్కిరిబిక్కిరవుతోంది. ఇప్పటికే విద్యుత్‌, ధర సంక్షోభంతో ఇబ్బంది పడుతున్న రైతులకు తాజా వాతావరణం కష్టాన్ని తెచ్చిపెట్టింది. ఈ పంట కాలంలో కొత్తగా రొయ్య పిల్లలు వేయడానికి.. సాగు ప్రారంభించడానికి ప్రకృతి వైపరీత్యాలు పెద్ద అవరోధంగా మారాయి. గతనెల చివరి వారంలో రాత్రి ఉష్ణోగ్రతలు 16– 17 డిగ్రీల మధ్య కొనసాగాయి. ఈనెల మూడోవారం నుంచి చలి తీవ్రత పెరగడం.. రాత్రి ఉష్ణోగ్రతలు బాగా తగ్గిపోవడంతో ఆక్వా సాగుపై తీవ్ర ప్రభావం చూపుతోంది. నీటి ఉష్ణోగ్రతలు సమతుల్యతతోనే వీటి మనుగడ సాధ్యం. రాత్రి, పగటి ఉష్ణోగ్రతల్లో వ్యత్యాసాల కారణంగా చెరువుల్లో పీహెచ్‌ (ఉదజని సూచిక) స్థాయి పెరిగి రొయ్యలు తీవ్ర ఒత్తిడికి గురవుతాయి. దీంతో అవి నీటి మధ్య, అడుగుభాగంలో ఎక్కువ సేపు ఉండిపోయి వ్యాధుల బారినపడతాయి. రైతులు అదనపు పెట్టుబడులు పెట్టాల్సి వస్తోంది. మరోవైపు రొయ్య సీడు (పిల్లలు) ఉత్పత్తి కావడానికి నీటిలో ఉప్పు నీటిశాతం కీలక పాత్ర పోషిస్తోంది. ఈ వాతావరణంలో ఆ పిల్లలు ప్రస్తుతం సాగుకు పూర్తిస్థాయిలో పనికిరావని చెబుతున్నారు. నెలరోజులుగా చెరువుల్లో సరుకు ఖాళీ అయింది. ఈ రకమైన అవరోధాల వల్ల కొత్త సాగుకు కూడా అవరోధం ఏర్పడుతున్నది.

కంట్రోల్‌ రూమ్‌ల ఏర్పాటు

మాండస్‌ తుఫాన్‌ నేపథ్యంలో జిల్లా ప్రజలు అప్రమత్తంగా ఉండాలని కలెక్టర్‌ పి.ప్రశాంతి శుక్రవారం తెలిపారు. కలెక్టరేట్‌ లో కంట్రోల్‌ రూమ్‌ నెంబర్‌ 08816–299 189, నరసాపురంలో సబ్‌ కలెక్టర్‌ కార్యాలయం 9391185874, భీమవరం ఆర్డీవో కార్యాలయం 949196042 కంట్రోల్‌ రూమ్‌లను ఏర్పాటు చేశామన్నారు. మండల కేంద్రాల్లో కంట్రోల్‌ రూమ్‌లను ఏర్పాటు చేశామన్నారు. తుఫాన్‌ తీరం దాటే వరకు మత్స్యకారులు వేటకు వెళ్లరాదని, రైతులు జాగ్రత్తలు తీసుకోవాలని సూచించారు.

–––––

Updated Date - 2022-12-10T00:06:06+05:30 IST