తీరం గుల్ల..

ABN , First Publish Date - 2022-11-03T00:01:48+05:30 IST

తీర గ్రామాలు గుల్లవుతున్నాయి. ఇసుక మాఫియా రెచ్చిపోతోంది.

తీరం గుల్ల..
పేరుపాలెం సౌత్‌లో సరుగుడు తోటల్లో ఇసుక తవ్వి చెరువులుగా మారుస్తున్న భూములు

మేటలు తొలగించేస్తున్న వైనం

అధికార పార్టీ అండదండలు

కాసుల కక్కుర్తిలో అధికారులు

భవిష్యత్తుపై ఆందోళనలో గ్రామస్థులు

మొగల్తూరు, నవంబరు 2: తీర గ్రామాలు గుల్లవుతున్నాయి. ఇసుక మాఫియా రెచ్చిపోతోంది. అక్రమ తవ్వకాలు సాగిస్తోంది. పర్యావరణ నిబంధనలను బేఖాతర్‌ చేస్తోంది. అధికారులు కళ్లప్పగించి చూస్తున్నారు. కట్టడి చర్యలు చేపట్టడం లేదు. ఇదే అదనుగా అక్రమార్కులు తీరానికి తూట్లు పొడుస్తూ ఇసుకను యథేచ్ఛగా తరలించి జేబులు నింపుకుంటు న్నారు. భవిష్యత్‌లో ఏ ఉపద్రవం ముంచుకొస్తుందోనని తీర ప్రాంత వాసులు భయాందోళన చెందుతున్నారు.

జిల్లాలో సముద్ర తీరం కోతకు గురవు తుందంటూ ఇప్పటికే ఆందోళన వ్యక్తమవుతోంది. కోత కట్టడి కోసం కేంద్ర ప్రభుత్వం చర్యలు చేపడుతోంది. ఇవేమీ ఇసుక మాఫియాకు పట్టడం లేదు. తీర ప్రాంత పరిధిలో ఇసుక తవ్వకాలు సాగించి జేబులు నింపుకుంటున్నారు. ప్రధానంగా జిల్లాలోని తీర గ్రామాలైన కేపీ పాలెం, పేరుపాలెంలో నిత్యం అక్రమ ఇసుక తవ్వకాలు నిర్వహిస్తున్నారు. ఈ రెండు గ్రామాల పరిధిలో సముద్ర తీరం విస్తరించి ఉంది. తీరం వెంబడి ఇసుక మేటలు భారీగా విస్తరించి ఉన్నాయి. ఈ ఇసుక మేటలే తీర ప్రాంతాన్ని రక్షిస్తున్నాయి. గతంలో సునామీ వచ్చినప్పుడు సముద్ర పోటు రాకుండా ఇసుక మేటలే అడ్డుపడ్డాయి. తీరప్రాంతం సముద్రపు కోతకు గురి కాకుండా నిలువరిస్తున్నాయి. ఇవేమీ అక్రమార్కులను అడ్డుకోలేకపోతున్నాయి. ఎలాగైనా సొమ్ములు పోగేసుకోవడానికే ఇసుక దందా సాగిస్తున్నారు. నిత్యం పదుల సంఖ్యలో ట్రాక్టర్లపై ఇసుక తరలిస్తున్నారు. సరుగుడు తోటలను ధ్వంసం చేస్తున్నారు. ఇసుకను తవ్వి చేపల చెరువులుగా తీర్చిదిద్దేస్తున్నారు. అధికారులు పట్టించుకోక పోవడంతో ఇసుక మాఫియా ఆగడాలకు అడ్డే లేకుండా పోతోంది.

అధికార పార్టీ అండదండలు..

సముద్ర తీరప్రాంతంలో ఇసుక తవ్వ కాలకు అధికార పార్టీ నాయకుల అండదండ లున్నాయని, కొందరు అధికారులు చేతివాటం ప్రదర్శిస్తున్నారన్న విమర్శలు వెల్లువెత్తుతు న్నాయి. గతంలో అధికారులు ఇసుక తవ్వకా లను నియంత్రించే ప్రయత్నం చేశారు. అధికార పార్టీ నుంచి ఒత్తిళ్లు రావడంతో మౌనం పాటించారు. మరోవైపు కొందరు అధికారులే ప్రోత్సహించిన సందర్భాలున్నా యి. ఇసుక అక్రమ రవాణాను అడ్డుకోవాల్సిన ఓ శాఖ అధికారి గతంలో నెలవారీ మామూ ళ్లు పెట్టేశారు. పరోక్షంగా ఇసుక తవ్వకాలకు ఊతమిచ్చారు. సదరు అధికారి ఆగడాలు మితి మీరడంతో ఇతర మండలానికి బదిలీ చేశారు. అధికార పార్టీ నేతలు అతన్ని ఆపే ప్రయత్నం చేసినా ఫలితం లేకపోయింది. ఉన్నతాధికారులు బదిలీ వేటు వేశారు. కొత్తగా వచ్చిన అధికారులు నిస్సహాయ స్థితిలో ఉన్నారు. దాంతో తీరం లో ఇసుక తవ్వకాలకు అడ్డు అదుపు లేకుండా పోతోంది.

నిబంధనలు ఇవే..

నిబంధనల ప్రకారం తీరానికి 500 మీటర్ల మేర కోస్టల్‌ రెగ్యులేటింగ్‌ పరిధిలో ఎటువంటి కట్టడాలు చేపట్టకూడదు. ఇసుక తవ్వకాలు నిర్వహించకూడదు. సీఆర్‌జడ్‌ పరిధిలో స్థానికులు, కొబ్బరి, సరుగుడు తోటలు పెంచుతున్నారు. ఇటీవల ఇసుకకు డిమాండ్‌ పెరగడంతో ఇసుక మాఫియా కళ్లు తీరప్రాంతంపై పడ్డాయి. తీర గ్రామాల్లో విస్తరించిన సరుగుడు, కొబ్బరి, సపోటా తోటలతో పాటు చివరికి తీరంలోని ఉప్పుటేరు, సముద్ర తీరంలో తోటల్లోనూ ఇసుకను యథే ఛ్ఛగా తవ్వేస్తున్నారు.

తవ్వకాలతో భవిష్యత్‌లో ఇబ్బందులు

తీరంలోని సీఆర్‌జడ్‌ పరిధిలో భవిష్యత్తులో ఇబ్బందులు తలెత్తనున్నాయి. తీరానికి 500 మీటర్ల దూరంలో ఎటువంటి కట్టడాలు, ఇసుక తవ్వకాలు నిర్వహించకూడదన్న నిబంధన జిల్లా సముద్రతీర ప్రాంతంలో అమలుకు నోచుకోవడం లేదు. తీరం వెంబడి విపత్తులను ఎదుర్కొనేం దుకు, ఉష్టోగ్రతల ప్రభావం గ్రామాల్లోకి రాకుండా ఉండేందుకు మడ తోటలు పెంచి పర్యా వరణాన్ని పరిరక్షించాలి. మడతోటలూ కబ్జాకు గురై కాలక్రమేణా కనుమరుగ య్యాయి. దానికి తోడు ఇసుక తవ్వకాలను నిర్వహిస్తుండడంతో రక్షణ కవచాలు లేకుండా పోతున్నాయి. ఫలి తంగా భవిష్యత్తులో తీర గ్రామాలకు ఇబ్బందికర పరిస్థితులు తలెత్తనున్నాయన్న ఆందోళన వ్యక్తమవుతోంది. తీరం లో నిత్యం జరుగుతున్న ఇసుక తవ్వకాలతో వరదలు, తుఫాన్‌ ప్రభావాలు, సునామీ వంటి విపత్తుల సమయంలో తీర గ్రామాలు ముంపునకు గురవుతా యనే భయాందోళనలో తీర గ్రామాలవాసులున్నారు.

Updated Date - 2022-11-03T00:01:48+05:30 IST
Read more