రైతులను ఇబ్బంది పెట్టొద్దు

ABN , First Publish Date - 2022-12-09T23:52:58+05:30 IST

ఆరుగాలం కష్టించి పండించిన పంటను అమ్ముకుందామంటే తేమశాతం పేరిట రైతులు ఇక్కట్లు పడుతున్నారు.

రైతులను ఇబ్బంది పెట్టొద్దు

ఆకివీడు/ ఆకివీడు రూరల్‌/ఉండి/పాలకొల్లు రూరల్‌/ మొగల్తూరు, డిసెంబరు 9 : ఆరుగాలం కష్టించి పండించిన పంటను అమ్ముకుందామంటే తేమశాతం పేరిట రైతులు ఇక్కట్లు పడుతున్నారు. ఆర్‌బీకేల్లో నిర్ధారిం చిన తేమశాతాన్ని మిల్లర్లు ఒప్పుకోకపోవడంతో ధాన్యాన్ని ఎలా అమ్ముకోవాలో తెలియక రైతులు నరకం చూస్తు న్నారు. ఈ పరిస్థితులపై ‘ఆంధ్రజ్యోతి’లో వరుస కథనాలు రావడంతో అధి కారులు స్పందించారు. కలెక్టర్‌ ప్రశాంతి, జేసీ జేవీ మురళి, ఆర్డీవో దాసి రాజు శుక్రవారం పలు ఆర్బీకేలు, రైస్‌ మిల్లులను పరిశీ లించారు. ఆకివీడులో జేసీ, ఆర్డీవో పర్య టించారు. రైతులను మిల్లర్లు కస్టోడియన్లు ఇబ్బందులకు గురిచేస్తే కఠిన చర్యలు తప్పవని హెచ్చరించారు. గుమ్ములూరుకు చెందిన రైతులు అడబాల వెంకట అప్పారావు, వంగా సాంబశివరావు, ఎం.నాగరాజు, చెరుకుమిల్లికి చెందిన అల్లూరి కృష్ణంరాజు మాట్లాడుతూ ఆర్బీకేలో తేమశాతం 17.4 వస్తే మిల్లులో 20 రావడంతో మిల్లులో ధాన్యం దిగుమతి చేసుకోవడం లేదని అధికారుల దృష్టికి తీసుకొచ్చారు. దీంతో మరో మిల్లులో రెండవ దఫా చూడగా 22 తేమశాతం రావడంతో ఉండిలోని బపర్‌ గొడౌన్‌ వద్ద తేమ శాతం చూడాలన్నారు. (ఇక్కడ 20 శాతం వచ్చింది). ఆర్బీకేలో తేమశాతం చూసి మరుసటి రోజున మిల్లుకు తరలించడంతో తేమశాతాల్లో వ్యత్యాసాలు వస్తున్నాయని అధి కారులు తెలపారు. మిల్లులకు వచ్చిన ధాన్యాన్ని మిల్లర్లు దిగుమతి చేసుకోకపోతే బ్లాక్‌ చేస్తామని హెచ్చరించారు. ధాన్యం కొనుగోలులో ఇబ్బందులకు గురిచేస్తే కఠిన చర్యలు తప్పవని మిల్లర్లకు, కస్టోడియన్‌ అధికారులను ఆర్డీవో దాసిరాజు హెచ్చరించారు. ఆయన అజ్జమూరులోని వేబ్రిడ్జి వద్ద సర్వర్‌ పనితీరు పరిశీలించి రైతులతో మాట్లాడి సమస్యలను అడిగి తెలుసుకున్నారు. దుంపగడప అడ్డరోడ్డు వద్ద ఉన్న రైస్‌ మిల్లును పరిశీలించారు. వారివెంట తహసీల్దార్‌ నందూరి వెంకటేశ్వరరావు, ఎంపీడీవో శ్రీకర్‌, ఏవో ప్రియాంక, రూరల్‌ బ్యాంకు చైర్మన్‌ కేశిరెడ్డి మురళి, వ్యవసాయ శాఖాధికారులు తదితరులున్నారు.

వాతావరణం చెమ్మగా మబ్బులు మబ్బులుగా వుండడంతో ధాన్యంలో తేమశాతం ఎక్కువగా నమోదు అవుతుందని ఆర్డీవో దాసిరాజు అన్నారు. ఉండి మండలం ఎన్‌ఆర్‌పి అగ్రహారం ఎఫ్‌సీఐ గొడౌన్‌ను శుక్రవారం ఆయన పరిశీలించారు. తేమ శాతానికి సంబంఽధించిన వివరాలను ఆరా తీశారు. ఆకివీడు మండలం గుమ్ములూరుకు చెందిన రైతు వంగా సాండశివరావు చెందిన ధాన్యంను పరిశీలించగా 20.6 తేమశాతం నమోదు కావడంతో దానిని 20 శాతంగా నికరం చేశారు. ప్రతీ ధాన్యపు గింజను రైతుల వద్ద నుంచి కొనుగోలు చేస్తామని ఆర్డీవో తెలిపారు. గొడౌన్‌ ఇన్‌చార్జు అర్జునరావు, సచివాలయం సిబ్బంది తదితరులు పాల్గొన్నారు.

రైతుల వద్ద నుంచి కొనుగోలు చేసిన ధాన్యం సొమ్ములు 21 రోజుల్లో జమ చేయడానికి అన్ని చర్యలు తీసుకున్నట్టు జేసీ మురళి తెలిపారు. పాలకొల్లు మండలంలోని పూలపల్లి, ఆగర్రు రైతు భరోసా కేంద్రాలను, విజయలక్ష్మీ, నరసింహ రైస్‌ మిల్లులను ఆయన తనిఖీ చేశారు. తహసీల్దార్‌ జి.మమ్మి, రెవెన్యూ, వ్యవసాయ శాఖ సిబ్బంది, ఆర్‌బీకే సిబ్బంది ఉన్నారు.

రికార్డులు పక్కాగా ఉండాలి

ధాన్యం కొనుగోలు సమయంలో రికార్డులు పక్కాగా ఉండాలని కలెక్టర్‌ ప్రశాంతి సూచించారు. ముత్యాలపల్లి, మొగల్తూరు గ్రామాల్లో ఆమె సుడిగాలి పర్యటన చేశారు. మొగల్తూరులో ఒక రైస్‌ మిల్లును తనిఖీ చేసి రికార్డులు పరిశీలించారు. ముత్యాలపల్లిలోని ఒక రేషన్‌ దుకాణాన్ని పరిశీలించారు. అదే గ్రామంలో బండి ముత్యాలమ్మ ఉన్నత పాఠశాలను సందర్శించి నాడు–నేడులో చేపట్టిన అభివృద్ధి పనులనుపరిశీలించారు. డీఎస్‌వో సరోజ, ఏఎస్‌వో రవి శంకర్‌, తహసీల్దార్‌ అనిత కుమారి తదితరులు పాల్గొన్నారు.

ఎందుకొచ్చిన నిబంధనలు

రైతులు పండించిన ధాన్యంపై ఎందుకొచ్చిన నిబంధనలు ఇవి. ప్రభుత్వం పెట్టిన మెలికలతో మేము సతమతమవుతున్నాం. ఆర్‌బీకేల ద్వారా పరీక్షించిన ధాన్యాన్ని మిల్లర్లు తీసుకోనప్పుడు ఇంకా ఏం చేస్తాం. రైతులను పరీక్షించకండి.. ఇబ్బందులు పడుతున్నాం. మమ్మల్ని ఆదుకోవడానికి చర్యలు తీసుకోండి అయ్యా!

– వంగా సాంబశివరావు, గుమ్ములూరు

––––––––––––––––––

Updated Date - 2022-12-09T23:53:27+05:30 IST