కమ్మేసి.. కుమ్మేసింది

ABN , First Publish Date - 2022-06-07T06:46:32+05:30 IST

పశ్చిమ గోదావరి జిల్లావ్యాప్తంగా వాతావరణం ఒక్కసారిగా చల్లబడింది.

కమ్మేసి.. కుమ్మేసింది
నరసాపురంలో గోదావరిని కమ్మేసిన కారు మేఘాలు

ఉక్కపోతల నుంచి ఉపశమనం..
అర్ధరాత్రి నుంచి జల్లులు.. కూల్‌ కూల్‌గా మారిన వాతావరణం.. సేదతీరిన జనం
లేసు ఫ్యాక్టరీపై పిడుగు.. రూ.20 లక్షల ఆస్తి నష్టం.. కాలిన కంప్యూటర్లు, ఫర్నిచర్‌
పిడుగుల వాన బీభత్సం


నరసాపురం, జూన్‌ 6 : పశ్చిమ గోదావరి జిల్లావ్యాప్తంగా వాతావరణం ఒక్కసారిగా చల్లబడింది. ఆదివారం అర్ధరాత్రి నుంచి మొదలైన వర్షం ఉదయం 11 గంటల వరకు కురుస్తూనే ఉంది. నరసాపురం, భీమవరం, తాడేపల్లిగూడెం, తణుకు, పాలకొల్లు, ఆకివీడు, ఉండి, ఆచంట, పెనుగొండ, పెంటపాడు తదితర మండలాల్లో విడవకుండా జల్లు పడింది. నరసాపురం తీరంలో ఆకాశం మేఘాలతో కమ్మేసింది. సాయంత్రం వరకు ఇదే పరిస్థితి కొనసాగింది. వాతావరణం చల్లబడటంతో ప్రజలు ఊపిరి పీల్చుకున్నారు. వర్షపు జల్లులతో చల్లగాలులకు సేద తీరారు. ఆదివారం వరకు వేసవి ప్రతాపంతో తల్లడిల్లిపోయిన జనం వర్షం కోసం ఎదురుచూశారు. ఈ తరుణంలో వాతావరణంలో చోటు చేసుకున్న మార్పులతో ఎంజాయ్‌ చేశారు.

పిడుగుపాటుకు భారీ నష్టం
నరసాపురం మండలం సీతారాంపురం నార్త్‌లోని కలవకొలను తాతాజీకి చెందిన జేజే లక్ష్మి అండ్‌ కో లేసు పరిశ్రమపై సోమవారం తెల్లవారుజామున పిడుగు పడి భారీ ఆస్తినష్టం సంభవించింది. ఆ సమయంలో ఫ్యాక్టరీలో ఎవరూ లేకపోవడంతో ప్రాణనష్టం తప్పింది. ఆదివారం అర్ధరాత్రి నుంచి వాతావరణం ఒక్కసారిగా మారి వర్షంతోపాటు పిడుగుల మోత మోగింది. ఉదయం ఫ్యాక్టరీకి వచ్చిన సిబ్బంది లోపల నుంచి మంటలు, పొగరావడాన్ని గుర్తించారు. కార్యాలయ అద్దాలను పగులగొట్టి లోనికి వెళ్లి మంటలను అదుపు చేసే ప్రయత్నం చేశారు. అప్పటికే  కార్యాలయంలోని సీలింగ్‌, కంప్యూటర్లు, ఏసీ, ఫ్యాన్లు, ఫర్నిచర్‌, ప్రింటర్లు, ఇన్వెర్టర్లు, మిషన్లు కాలిపోతున్నట్లు పొగలు వచ్చాయి. సమాచారం అందుకున్న నరసాపురం ఫైర్‌ అధికారి హనుమంతరావు ఆధ్వర్యంలో సిబ్బందిహుటాహుటిన వచ్చి మంటలను అదుపుచేశారు. ఆస్తి నష్టం రూ.20 లక్షలకు పైనే ఉంటుందని తాతాజీ తెలిపారు. సీతారాంపురం సౌత్‌లో పిడుగు పాటుకు ఇద్దరికి స్వల్ప గాయాలయ్యాయి. పెట్రోల్‌ బంకు సమీపంలోని నివాసాల వద్ద కొబ్బరి చెట్టుపై పిడుగు పడింది. ఆ శబ్ధానికి పాల జ్యోతి రమేష్‌ నివాసంలోని ఫర్నిచర్‌ ధ్వంసమైంది. ఇంటిలో కరెంట్‌ మీటరు కాలిపోయింది. బీరువా అద్దాలు పగిలి  అవి ఇంట్లో ఉన్న జ్యోతి రమేష్‌కు గుచ్చుకున్నాయి. వెంటనే వీరిని నరసాపురం ఆస్పత్రికి తీసుకొచ్చి చికిత్స చేయించారు.

కొబ్బరి చెట్టుపై పిడుగుపాటు
ఆకివీడు రూరల్‌: అజ్జమూరులో సోమవారం ఉదయం కొబ్బరి చెట్టుపై పిడుగు పడడంతో మంటలు చెలరేగాయి. సోమవారం తెల్లవారుజాము నుంచి ఉరుములు, మెరుపుల తో కూడిన వర్షం కురవడంతో పెద్ద శబ్ధం చేస్తూ పిడుగుల వర్షం పడింది. దీంతో జనం భయభ్రాంతులకు గురయ్యారు. భారీ వర్షంతో రహదారులన్నీ చిత్తడి చిత్తడిగా మారాయి. డ్రెయిన్లలో పూడిక తీయక నీరు సరిగా పారడం లేదు.

Read more