రైతు గోడు వినేదెవరు?

ABN , First Publish Date - 2022-12-12T00:19:09+05:30 IST

మాండస్‌ తుఫాన్‌ నేపథ్యం లో శనివారం రాత్రి నుంచి ఆదివారం ఉదయం వరకు జిల్లాలోని పలుచోట్ల భారీ వర్షాలు కురిశాయి. దీంతో బహిరంగ ప్రదేశాల్లో ఆరబె ట్టుకున్న, కళ్ళాల్లోని ధాన్యం రాశులు తడిచి ముద్దయ్యాయి. ఏ మేర కు నష్టం ఉంటుందో తెలియని పరిస్థితి. కొన్ని ప్రాంతాల్లో కోసిన పంటతోపాటు కుప్పలు వేసి, వాటిపైన బరకాలు కప్పారు. తుఫాన్‌ కారణంగా బలంగా ఈదురుగాలులు వీయటంతో కొన్ని ప్రాంతాల్లో వరి కంకులు నేలకొరిగాయి. వర్షం తగ్గి, చేలు ఆరిన వెంటనే వీటిని కోయాల్సి ఉంది.

రైతు గోడు వినేదెవరు?
ముదినేపల్లి మండలంలో పొలం నుంచి నీటిని బయటకు తీస్తున్న రైతులు

ఏలూరు సిటీ, డిసెంబరు 11 : మాండస్‌ తుఫాన్‌ నేపథ్యం లో శనివారం రాత్రి నుంచి ఆదివారం ఉదయం వరకు జిల్లాలోని పలుచోట్ల భారీ వర్షాలు కురిశాయి. దీంతో బహిరంగ ప్రదేశాల్లో ఆరబె ట్టుకున్న, కళ్ళాల్లోని ధాన్యం రాశులు తడిచి ముద్దయ్యాయి. ఏ మేర కు నష్టం ఉంటుందో తెలియని పరిస్థితి. కొన్ని ప్రాంతాల్లో కోసిన పంటతోపాటు కుప్పలు వేసి, వాటిపైన బరకాలు కప్పారు. తుఫాన్‌ కారణంగా బలంగా ఈదురుగాలులు వీయటంతో కొన్ని ప్రాంతాల్లో వరి కంకులు నేలకొరిగాయి. వర్షం తగ్గి, చేలు ఆరిన వెంటనే వీటిని కోయాల్సి ఉంది. గణపవరం, ఉంగుటూరు, భీమ డోలు, దెందులూరు మండలాల్లో ఎక్కువ వర్షాలు కురవడంతో ధాన్యం తడిసి ముద్దయ్యింది. గతంలో ప్రభుత్వం సబ్సిడీపై బరకా లు అందజేసేది. ఇప్పుడు రాయితీలు లేకపోవటంతో బరకాలు లేని రైతులు అద్దెకు తెచ్చుకుని పంటను దక్కించుకోవటానికి తమ ప్రయత్నాలు చేశా రు. డిసెంబరులో భారీ తుఫానులు వస్తాయని తెలిసినా ప్రభుత్వం ముందస్తు జాగ్రత్తలు తీసుకుని వుంటే ధాన్యం తడిసే పరిస్థితి ఉండేది కాదు. ఎప్పుడైనా ప్రకృతి వైపరీత్యాలు వచ్చినప్పుడే జాగ్రత్త లు తీసుకోమని చెబుతున్నారు. కానీ, సబ్సిడీ పై బరకాలు అందజేస్తే కొంత ఆర్థికంగా వెసులుబాటు కలిగేదని రైతులు చెబుతున్నారు. పంట చేతికొచ్చే సమయంలో ఏదో ఒక రూపంలో పంట నష్టాలు కలుగుతున్నాయని రైతులు వాపోతున్నా రు. గడచిన 24 గంటల్లో జిల్లాలో అత్యధికంగా గణపవరం మండ లంలో 44.8 మిల్లీమీటర్ల వర్షపాతం నమోదైంది. జిల్లాలో సరాసరి వర్షపాతం 13.4 మి.మీ. మిగిలిన మండలాల్లో వర్షపాతం వివరాలి వి.. భీమడోలు 36.4, నిడమర్రు 31.6, ఉంగుటూరు 24.4, దెందు లూరు 19.2, లింగ పాలెం 17.8, పెదపాడు 17.6, కలిదిండి 16.8, నూజివీడు 15.8, ఏలూరు 13.6, చింతలపూడి 13, ముసునూరు 12.3, కామవర పుకోట 11.6, చాట్రాయి 11.6, మండవల్లి 11.6, ముదినేపల్లి 11.4, ఆగిరిపల్లి 10.5, ద్వారకా తిరుమలలో 10.2 మిల్లీమీటర్లు వర్షపాతం నమోదైంది. జిల్లాలోని మిగిలిన మండ లాల్లో 10 మి.మీ కన్నా తక్కువగానే వర్షపాతం నమోదైంది.

తడిచి ముద్దయిన ధాన్యం

ఉంగుటూరు : ఉంగుటూరు మండలంలో శనివారం రాత్రి నుంచి ఏకధాటిగా వర్షం కురవడంతో సార్వా ధాన్యం ఆరబెట్టుకు న్న రైతులు నానా అవస్థలు పడ్డారు. ఆదివారం ఉదయానికి మండలంలో 24.4 మి.మీ.ల వర్షపాతం నమోదైంది. గ్రామాలలో రైతులు అప్రమత్తమైనప్పటికీ రాశుల కిందకు వర్షపు నీరు చేరి తడిచి ముద్దయ్యింది. దీంతో రైతులు కూలీలను పురమాయించు కుని బరకాలపై ధాన్యంను ఆరబోసుకున్నారు. వాతావరణ దృష్ట్యా కూలీల రేట్లు కూడా అమాంతంగా పెరగడంతో అదనపు భారం పడింది. కైకరం ఆర్‌బీకేలో రైతులకు గోనె సంచులు అందకపోవడం తో ఆందోళన చెందుతున్నారు. వీఏఏ లోవరాజు మాట్లాడుతూ గత నెల 26 నుంచి ఆర్బీకేలో నమోదు చేయించుకున్న రైతులకందించా మని, తాము రైతులను పిలిచే సమయానికి లేని రైతులకు గోనె సంచులు అందించలేదన్నారు. సోమవారం గోనె సంచులు రాగానే వారికి జాబితా ప్రకారం అందిస్తామని వివరించారు.

కమీషన్‌ వస్తుందో రాదో..

పెట్టుబడి పెట్టిన కమీషన్‌దారులు తమ పెట్టుబడి వస్తుందో లేదోనని వాపోతున్నారు. అధికార పార్టీకి చెందిన కమీషన్‌దారులు అటు ఎమ్మెల్యే చుట్టూ ప్రదక్షిణలు చేస్తున్నట్లు తెలిసింది. ఈ విషయమై గత దాళ్వాలో దిగుబడి సక్రమంగా లేక పోవడంతో పాత బకాయిలు రాబట్టుకునే కార్యక్రమం చేపట్టారు. వ్యవసాయ శాఖ సిబ్బంది ఆన్‌లైన్‌ విధానంతోను ఈ క్రాప్‌ విధానం ప్రకారం ఆర్బీకేలు సర్వే నెంబరు ప్రకారం రైతుల వివరాలను నమోదు చేయడంతో కమీషన్‌దారులు పలు ఇబ్బందులు పడుతున్నారు. ఉమ్మడి పశ్చిమ గోదావరి జిల్లాకు చెందిన పౌర సరఫరాల శాఖ మంత్రి ఉన్నా గత కొద్ది రోజులుగా ఆఫ్‌లైన్‌ విధానం ద్వారా రైస్‌మిల్లుల వారితో సంప్రందించే ప్రయత్నం చేస్తున్నారు. పలు గ్రామాలలో ఆదివారం ధాన్యం రవాణా కోసం రైతులు పలు ఇబ్బందులు పడ్డారు. కైకరంలో పాటి మీద ఆర బెట్టుకున్న రైతులు లారీ రవాణా కోసం రైతులు కుస్తీ పడ్డారు. లారీలను రైస్‌ మిల్లులకు తరలించేందుకు తిప్పలు పడ్డారు.

కల్లాలపైనే ధాన్యం కుప్పలు

చింతలపూడి : ‘చింతలపూడి మండలంలో ధాన్యం కొనేనాధుడు లేడు. 20 రోజులుగా కుప్పలు పోసి ఎదురుచూస్తున్నాం’ అంటూ పాత చింతల పూడి, సమ్మెటవారిగూడెం, ప్రగడవరం గ్రామాల రైతులు తల్లడిల్లుతున్నారు. తమ గోడు వినేదెవరంటూ ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ఓ వైపు ఆకాశం ముసురు వాతావరణం, మరోపక్క కళ్ళాలపై పోసిన రాశులకు పట్టాలు కప్పి కాపలా కాయడం చేస్తున్నామన్నారు. ప్రభుత్వం కొనదు. వేరే వారికి అమ్మలేం.. అన్నట్టు తమ పరిస్థితి అగమ్యగోచరంలా ఉందని వాపోతున్నారు. పగలు ఆర్‌బీకే కేంద్రాలకు వెళ్లి ఎప్పుడు కొం టారని కార్యాలయం చుట్టూ తిరగడం, రాత్రి కుప్పల దగ్గర జాగరణ చేస్తున్నా మని చెప్పారు. మొన్నటి వరకు ఈ–క్రాఫ్‌ నమోదులో ధాన్యం రకం తేడా చూపడంతో యాప్‌ మారితే గాని కొనేది లేదన్నారు. ఇప్పుడేమో సంచులు లేవని, లారీలు రావడం లేదని చెబుతున్నారని, ఇదేం తిప్పలంటూ వాపోతు న్నారు. ప్రభుత్వం గిట్టుబాటు ధర ఇస్తున్నాం, తమకే అమ్మాలనే నిబంధనలు పెడుతుంది. ధాన్యం కొనకపోవడంతో కాళ్ళరిగేలా తిరుగుతున్నామని చెబుతు న్నారు. ప్రగడవరం, సమ్మెటవారిగూడెంలలో కొద్దిపాటి వర్షానికి ధాన్యం తడిసిం దని రైతులు చెబుతున్నారు. అసలు కారణం తమకు అర్థం కావడం లేదని, తడిసిపోతే ధాన్యం తక్కువ ధరకు కొంటారని, ఇదేమిటో అర్థం కావడం లేదని రైతులు ఆరోపిస్తున్నారు. రైతుల బాధలు చూడలేక టీడీపీ, జనసేనకు చెందిన నాయకులు రైతులను పరామర్శించి అధికారుల దృష్టికి తీసుకు వస్తామని భరోసా ఇచ్చారు. పాత చింతలపూడి వద్ద ఒకేచోట పలువురు రైతులు తమ ధాన్యాన్ని తరలించి కుప్పలు కుప్పలుగా పెట్టుకుని కాపలా కాస్తున్నారు.

తప్పుగా నమోదు కావడం వల్లే..

గత కొద్ది రోజులుగా క్రాఫ్‌ వెరైటీ తప్పుగా నమోదు కావడం వల్ల రైతులు పండించిన ధాన్యంను మిల్లులకు తోల లేక ఇబ్బందులు పడ్డారని మండల తహసీల్దార్‌ కృష్ణజ్యోతి ఒక ప్రకటనలో తెలిపారు. అయితే ప్యాడి ప్రొక్యూర్‌ మెంట్‌ యాప్‌లో క్రాఫ్‌ వెరైటీ మార్చుకోవడానికి ప్రభుత్వం అవకాశం ఇచ్చిం దని, ఇప్పుడు రైతులందరూ ఈ అవకాశాన్ని వినియోగించుకుని ధాన్యాన్ని తరలించుకోవచ్చని పేర్కొన్నారు. మండల వ్యవసాయాధికారిణి మీనాకుమారి మాట్లాడుతూ యాప్‌లో క్రాప్‌ పేరు నమోదుకు ప్రస్తుతం ఇబ్బందులు తొలగాయని, నేటి నుంచి లారీలు వస్తాయని, ధాన్యం రైతుల దగ్గర నుంచి కొనుగోలు చేస్తామని, సంచుల కొరత లేదని చెప్పారు.

అన్నదాతకు ఎన్ని అవస్థలో..:!

ముదినేపల్లి : ముదినేపల్లి ప్రాంతంలోని వేలాది ఎకరాల్లో పన మీద వున్న వరి పైరును, ధాన్యం రాశులను రక్షించుకునేందుకు రైతులు ఎన్నో వ్యయ ప్రయాసలకోర్చారు. పొలాల నుంచి రోడ్ల పక్కకు ధాన్యాన్ని తరలించి రక్షణ చర్యలు చేపట్టారు. బొమ్మినంపాడు, అల్లూరు, ఈడేపల్లి, కొరగుంటపాలెం, పెదగొన్నూరు, ముదినేపల్లి తదితర గ్రామాల్లో వరి పనలు తడిసిపోవటంతో రైతులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. తడిసిన ధాన్యం రాశులను నిబంధనల ప్రకారం ఇప్పటికిప్పుడు అమ్ముకునే పరిస్థితి లేకపోవటంతో రైతులు తేమ శాతం తగ్గించుకునేందుకు ఆరబెట్టుకోవాల్సిన పరిస్థితి ఏర్పడింది. ఇప్పటి వరకు పెట్టిన పెట్టుబడితోపాటు అదనంగా ఖర్చులు పెరిగాయి.

Updated Date - 2022-12-12T00:19:09+05:30 IST

Read more