రొయ్యకు గడ్డుకాలం!

ABN , First Publish Date - 2022-11-25T00:10:26+05:30 IST

ఆక్వా రైతులు పరిస్థితి దినదిన గండం నూరేళ్ల ఆయుస్సులా ఉంది. రోజు రోజుకి రొయ్య ధర దిగజారిపోతోంది.

రొయ్యకు గడ్డుకాలం!
మంగళగిరిసభలో చంద్రబాబుకు ఆక్వా సమస్యలు తెలుపుతున్న ఎమ్మెల్సీ అంగర రామ్మోహన్‌

ట్రేడర్లు ప్రభుత్వ ఆదేశాలు బేఖాతర్‌

ప్రస్తుతం 100 కౌంటు ధర రూ.180

చోద్యం చూస్తున్న అధికారులు

తీవ్రంగా నష్టపోతున్న ఆక్వా రైతులు

ఆకివీడు రూరల్‌/ భీమవరం అర్బన్‌/ పాలకొల్లు రూరల్‌, నవంబరు 24 : ఆక్వా రైతులు పరిస్థితి దినదిన గండం నూరేళ్ల ఆయుస్సులా ఉంది. రోజు రోజుకి రొయ్య ధర దిగజారిపోతోంది. ప్రభుత్వం ఏర్పాటు చేసిన సబ్‌ కమిటీ ట్రేడర్లతో చర్చలు జరిపి 100 కౌంటు ధర 240కి కొనుగోలు చేయాలని ఆదేశించారు. అయితే అప్పటి నుంచి ట్రేడర్స్‌ ధరలను తగ్గిస్తూనే ఉన్నారు. రెండోసారి సమా వేశమైన సబ్‌ కమిటీ ఈసారి 100 కౌంటు ధర రూ.210కి ఫిక్స్‌ చేసింది, అయినప్పటికి ట్రేడర్స్‌ మాత్రం రూ.190లకే కొనుగోలు చేస్తున్నారు. ప్రస్తుతం 100 కౌంటు ధర రూ.180కి కొనుగోలు చేస్తున్నారని, లోడింగ్‌కు లారీలు పంపడం లేదని రైతులు వాపోతున్నారు. 30, 40, 50, 60, కౌంటు లను కొనుగోలు చేయడానికి ట్రేడర్స్‌ ఆసక్తి చూపడం లేదని రైతులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ఇప్పటికే వైరస్‌ వల్ల తీవ్రంగా నష్టపోయి మిగిలి ఉన్న కొద్దిపాటి ఉత్పత్తులను ధరలు లేక నష్టపోవడంతో రైతులు ఆందోళన చెందుతున్నారు. గురువారం మార్కెట్‌లో కౌంట్‌ ధరలు ఈ విధంగా ఉన్నాయి. 100 కౌంటు ధర రూ.180, 90 కౌంటు ధర రూ.190, 80 కౌంటు ధర రూ.200, 70 కౌంటు ధర రూ.210, 60 కౌంటు రూ. 220, 50 కౌంటు రూ.230 పలికింది. ఈ ధరలతో రైతులు ఆందోళన చెందుతూ వచ్చినకాడికి అమ్ముకుందామనే ఉద్దేశ్యంతో ఉండడంతో దళారులు సద్వినియోగం చేసుకుంటున్నారు. ఈ నేపథ్యంలోనే ఆక్వా రైతుల సమస్యలు తెలుసుకునేందుకు మంగళగిరిలోని తెలుగుదేశం పార్టీ కేంద్ర కార్యాలయంలో గురువారం టీడీపీ జాతీయ అధ్యక్షులు నారా చంద్రబాబు నాయుడు ఆధ్వర్యంలో ఆక్వా రైతుల సమ్మేళనం జరిగింది. ఈ కార్యక్రమానికి జిల్లా నుంచి పలువురు టీడీపీ నాయకులతో పాటు ఆక్వా రైతులు హాజరయ్యారు. ఈ సందర్భంగా ఆక్వారంగ సమస్యలను చంద్రబాబు దృష్టికి తీసుకెళ్లారు.

పర్యవేక్షణ లేమి

ఆక్వా రైతును ఆదుకోవడానికి ప్రభుత్వం ప్రకటించిన ధరకు ఉత్ప త్తులను కొనుగోలు చేస్తు న్నారా.. లేదా పర్య వేక్షించాల్సిన బాధ్యత అధికారులపై ఉంది, అధికారులు ఆవిధంగా చర్యలు తీసుకోవడంలో పూర్తిగా విఫలమ య్యారు. దీంతో ట్రేడర్స్‌ తమ ఇష్టం వచ్చినట్టు ధరలు తగ్గించేస్తున్నారు. రూ.360 పలికిన 60 కౌంటు రొయ్యలను ప్రస్తుతం రూ.240 లకు కొనుగోలు చేయడానికి ముందుకు రావడం లేదు. అధికారులు రైతులకు నష్టం వాటిల్లకుండా యుద్ధ్దప్రాతిపది కన చర్యలు తీసుకోవాలి.

– ముత్యాల బుజ్జి, కుప్పనపూడి

చిత్తశుద్ధి ఏదీ..?

ఆక్వా రైతుల పట్ల ప్రభుత్వం చిత్తశుద్ధ్దితో వ్యవహరించాలి. ప్రకటనలకే పరిమితం కాకుండా ధరలు అమలు అయ్యేలా చూడాలి. మేతల ధరలు, మెడిసిన్స్‌ ధరలు ఆకాశానంటుతున్న తరుణంలో వైరస్‌ వల్ల తుడిచిపెట్టుకుపోగా మిగిలిన ఉత్ప త్తులను అమ్మినా కనీసం పెట్టుబడులు వచ్చే పరిస్థితి లేదు.

– కన్నబాబు, కోళ్ళపర్రు

విద్యుత్‌ ధరల్లో వ్యత్యాసం సవరించాలి

ఆక్వా జోన్‌ – నాన్‌ ఆక్వా జోన్‌ల్లో విస్తీర్ణంలో వ్యత్యాసం సవరించాలి. కొనుగోలు విషయం లోను సమస్యలు ఉన్నాయి. ఆక్వా రంగానికి సంబంధించి విద్యుత్‌ సమస్యలు, అమ్మకాల్లో కౌంట్‌ ధరల్లో తేడాలు, ఫీడ్‌ ధరలు పెరిగి ఆక్వా రైతులు నష్టపోతున్నారు. ఇటీవల నన్ను కలిసిన అధికార పార్టీకి చెందిన నాయకుడు ఒకరు ఆక్వా రంగంపై తమ ప్రభుత్వం అనుసరిస్తున్న విధానంపైౖ నిరసన తెలిపారంటే పరిస్థితి ఎంత దారుణంగా ఉందో అర్థం చేసుకోవచ్చు’ అని ఎమ్మెల్సీ అంగర రామ్మోహన్‌ మంగళగిరిలో గురువారం జరిగిన ఆక్వా రైతుల సదస్సులో టీడీపీ అధినేత చంద్రబాబుకు వివరించారు.

కంపెనీలపై నియంత్రణ ఉండాలి

2019 టీడీపీ హయాంలో రొయ్య మేత టన్ను ధర రూ.68 వేలు ఉంటే ఇప్పుడు రూ.92 వేలు ఉంది. రొయ్య సీడ్‌ ధర 25 పైసలు నుంచి 35 పైసలకు చేరింది. 100 కౌంటు ధర 240 ఉంటే ఇప్పుడు రూ.170 ఉంది. కరెంటు ట్రాన్స్‌ఫారం రూ.లక్ష ఉంటే ప్రస్తుతం రూ.5 లక్షల కు, కరెంటు స్తంభం విలువ రూ.4 వేలు నుంచి రూ.35 వేలకు, యూనిట్‌ కరెంటు రూ.2 ల నుంచి రూ.3.85లకు పెరిగాయి. ఇలా ఖర్చు పెరగ్గా ఆదా యం తగ్గింది. విద్యుత్‌ చార్జీలను 1.50 తగ్గించాలి. సీడ్‌, ఫీడ్‌ కంపెనీలపై నియంత్రణ ఉండాలి. ఇలానే కొనసాగితే పాడి రైతుల సొమ్మును వైసీపీ ప్రభుత్వం ఎలా వాడుకుంటుందో అదే పరిస్థితి ఆక్వా రైతులకు వస్తుంది.

– కోళ్ళ నాగేశ్వరరావు, టీడీపీ రాష్ట్ర కార్యదర్శి

Updated Date - 2022-11-25T00:10:34+05:30 IST