నిధుల్లేవ్‌

ABN , First Publish Date - 2022-08-15T05:47:31+05:30 IST

ప్రభుత్వ పాఠశాలల్లో కార్పొరేట్‌ స్థాయి విద్యనందిస్తామంటూ గొప్పలు చెప్పుకుంటున్న నాయకుల మాటలు నీటి మూటలుగానే మిగిలిపోతున్నాయి.

నిధుల్లేవ్‌

పాఠశాలల్లో నిర్వహణ గ్రాంటు లేక నీరుగారుతున్న నిర్వాహకులు
కనీస ఖర్చులకు పైసా లేని వైనం
టీచర్లపైనే పడుతున్న భారం


తాడేపల్లిగూడెం రూరల్‌, ఆగస్టు 14: ప్రభుత్వ పాఠశాలల్లో కార్పొరేట్‌ స్థాయి విద్యనందిస్తామంటూ గొప్పలు చెప్పుకుంటున్న నాయకుల మాటలు నీటి మూటలుగానే మిగిలిపోతున్నాయి. ఏడాదిగా పాఠశాల నిర్వహణ నిధి లేక నిర్వాహకులు నీరుగారిపోతున్నారు.  మంచినీరు, కరెంటు బిల్లులే కాకుండా పాఠశాలకు కావాల్సిన కనీస ఖర్చులు పెట్టేందుకు కూడా పైసా లేక ప్రభుత్వ పాఠశాలల బాధ్యతలు నిర్వహిస్తున్న ఉపాధ్యాయులు, ప్రధానోపాధ్యాయుల భారంగా మారుతోంది. గత విద్యా సంవత్సరం పాఠశాల నిర్వహణకు సంబంధించిన ఖాతాలోని సొమ్మును ప్రభుత్వానికి జమ చేయాలంటూ ఉన్నతాధికారులు ఇచ్చిన ఆదేశాలతో ఖాతాలు మొత్తం ఖాళీ చేశారు. అయితే అప్పటి నుంచి ఈ విద్యా సంవత్సర వరకూ ఎలాంటి నిధి లేక ప్రధానోపాధ్యాయులు తమ సొంత సొమ్ము ఖర్చుచేయలేక ప్రభుత్వం నుంచి నిధులు రాక నలిగిపోతున్నారు.
 పాఠశాలకు రూ.70 వేలు
ఏటా ప్రభుత్వ పాఠశాలల్లో 250 మంది విద్యార్థులు దాటితే రూ.70 వేలు, అంతకన్నా తక్కువ ఉంటే రూ.50వేలు ప్రభుత్వం పాఠశాల నిర్వహణ ఖాతాలో ప్రతీ ఏటా జమ చేస్తుంది. ఈ సొమ్మును విద్యా కమిటీ, ప్రధానోపాధ్యాయుల పర్యవేక్షణలో ఖర్చు చేస్తారు. ఆ నిధులు పాఠశాల కరెంటు, మంచినీరు ఖర్చులతో పాటు, పాఠశాలకు అవసరమయ్యే స్టేషనరీ, చుట్టూ శానిటేషన్‌ తదితర ఖర్చుల కోసం వెచ్చించాల్సి ఉంటుంది. దీనితోపాటు పాఠశాలలో ఫ్యాన్స్‌, కరెంటు నిర్వహణ, ఫర్నీచర్‌ బాగుచేయించేందుకు తదితర ఖర్చులు అదనం. కానీ ఆ పనులు చేయించేందుకు ఆ ఖాతా మొత్తం సున్నా చుట్టించి తర్వాత పైసా కూడా వేయలేదు. దీంతో నిర్వహణ భారమై ప్రధానోపాధ్యాయులు అయోమయ స్థితిలో పడ్డారు.
మరుగుదొడ్లు సరే...
మరుగుదొడ్లు శుభ్రం చేసేందుకు ప్రభుత్వం ఫినాయిల్‌, చీపుర్లు, యాసిడ్‌ లాంటివి కొన్ని ఇచ్చి వాటిని శుభ్రంచేసే మనిషికి జీతం ఇస్తున్నారు. అయితే ప్రభుత్వ ఇచ్చే ఫినాయిల్‌ వగైరా సరిపోక బయట కొనుగోలు చేయాల్సిన పరిస్థితి.

 మారిన పద్ధతితో ఇక్కట్లు

2019–20 ఆర్థిక సంవత్సరం హెచ్‌ఎం ఖాతాల్లో సొమ్ము జమ చేసేవారు. కానీ 2020–21 సంవత్సరంలో పీడీ ఖాతాలు తెరిచి ఆ ఖాతాల్లో బిల్లు అప్‌లోడ్‌ చేస్తేనే బిల్లు మంజూరయ్యేందుకు అవకాశం ఉంటుంది. ఈ నేపథ్యంలో గత విద్యా సంవత్సరానికి సంబంధించి కొన్ని పాఠశాలలకు ఇంత వరకూ బిల్లులు విడుదల కాలేదు. రూ.లక్ష మించిన బిల్లు అసలు వస్తాయో లేదో తెలియని పరస్థితి. అంతే కాదు  ఈ ఏడాది మార్చిలో పెట్టిన బిల్లులు వెనక్కి వచ్చేశాయి. ఈ గ్రాంటు వస్తుందో లేదో ఎవరూ చెప్పలేని పరిస్థితి.
 
ఇచ్చినట్టే ఇచ్చి.. ఆపై మెలిక
నాడు–నేడు మొదటి విడత పాఠశాలలకు ప్రభుత్వం రూ.20 వేల నిధులను విడుదల చేసింది. ఈ నిధులు కేవల ఆ భవనాల నిర్వహణ నిమిత్తమే ఖర్చు చేయాలనే మెలిక పెట్టడంతో వాటిని అత్యవసర ఖర్చులకు వినియోగించే పరిస్థితి లేదు.  

Read more