మనసున్న మారాజు

ABN , First Publish Date - 2022-09-12T05:28:46+05:30 IST

వెండితెరపై రారాజుగా వెలిగిన రెబల్‌స్టార్‌ ఇక లేరనే విషయం జిల్లా వాసులను దిగ్ర్భాంతికి గురిచేసింది

మనసున్న మారాజు
భీమవరంలో 2001 బీజేపీ సభలో మాట్లాడుతున్న కృష్ణంరాజు

ఆహార్యం గాంభీర్యం.. లోపల మంచి మనసు..
ప్రజల మనిషిగా పేరు తెచ్చుకున్న కృష్ణంరాజు
ఆయన మృతితో జిల్లాలో విషాదఛాయలు


వెండితెరపై రారాజుగా వెలిగిన రెబల్‌స్టార్‌ ఇక లేరనే విషయం జిల్లా వాసులను దిగ్ర్భాంతికి గురిచేసింది..  మొగల్తూరు ముద్దుబిడ్డగా ఆయన్ను అంతా గుండెల్లో పెట్టుకున్నారు.. ఆయన ఎంత ఎదిగినా  పుట్టిన ఊరు.. ఆత్మీయులను ఎప్పుడూ మరిచి పోలేదని ఆయనతో ఉన్న అనుబంధాన్ని గుర్తు చేసుకుంటున్నారు.  కేంద్ర మాజీ మంత్రి ,రెబల్‌స్టార్‌ యు.వి.కృష్ణంరాజు (83) ఆదివారం తెల్లవారుజామున హైదరాబాద్‌ లోని ఏఐజీ ఆసుపత్రిలో చికిత్స పొందుతూ మరణించారు. ఆయన మరణ వార్త తెలుసుకున్న మొగల్తూరు ప్రజలతో పాటు, జిల్లాలోని ఆయన అభిమానులు విషాదంలో మునిగారు. ఆయన ఇక లేరనే విషయాన్ని జీర్ణించుకోలేకపోతున్నారు.

భీమవరం/మొగల్తూరు/నరసాపురం/పోలవరం, సెప్టెంబరు 11 :
6.2 అడుగుల ఎత్తు.. ఆజానుబాహుడు.. ఎర్రబడిన కళ్ళు.. చూస్తే ఇంత పెద్దాయనతో మాట్లాడగలమా.. అన్న మీమాంస.. తరిచి చూస్తే సుతిమెత్తని మనసు.. ఆప్యాయంగా ప్రేమతో పలకరించే మాటలు.. వచ్చిన వారిని గౌరవించే పెద్దరికం.. ఇదీ కృష్ణంరాజు వ్యవహారశైలి.. ఆయనను రారాజుగా ముద్దుగా పిలుచుకుంటారు. కృష్ణంరాజు మొగల్తూరు సంస్థానం వంశీకుల అల్లుడు.. సినిమా నటుడిగా ఉన్నప్పుడే కాదు.. రాజకీయాల్లోకి వచ్చాక కూడా వీసమెత్తు గర్వం లేని మనిషిగా కృష్ణంరాజుకు ప్రజల్లో పేరు ఉంది. పెద్ద హీరోగా పేరున్న రోజుల్లోనే సొంత ఊరు తరచూ మొగల్తూరు వస్తూ ఉండేవారు. వస్తే అందరినీ పలకరించేవారు. గోదావరి జిల్లాల మాటశైలి.. గౌరవమైన పలకరింపు.. కల్మషం లేని చిరునవ్వుతో ప్రజల వద్దకు వెళ్ళేవారు. పార్లమెంట్‌ సభ్యుడిగా గెలిచాక భీమవరంలో మకాం పెట్టినప్పుడు క్యాంపు కార్యాలయం సందడిగా ఉండేది. బీజేపీ నాయకులు, కార్యకర్తలు సొంత మనుషులతోపాటు ఆయన మేనల్లుడు పర్యవేక్షణలో కార్యాలయం సాగేది. పార్లమెంట్‌ నియోకవర్గం నలుమూలల నుంచి అవసర నిమిత్తం వచ్చేవారిని సాదరంగా ఆహ్వానించడం.. మాట్లాడి సమస్యలను పరిష్కారం చూపటం హామీలు ఇవ్వడం వారికి అల్పాహారం, భోజనం పెట్టి పంపించేవారు. పార్లమెంట్‌ లేనప్పుడూ నియోజకవర్గంలోనే మకాం వేసి గ్రామాలలో పర్యటించారు. అనేక సందర్భాల్లో ఆయన వ్యక్తిగత సహాయం చేసేవారు అని చెబుతారు. రాజకీయాల్లో ఆయన కొత్తగా ఏమీ సంపాదించలేదని చెబుతారు. ఆయన నమ్మినవాళ్ళు కొందరు మాత్రం నష్టం చేశారనే చెప్పారు. దేనికి చలించని ఆయన జీవనశైలి కూడా అటువంటిదే. రాజరికపు శైలి ఆయనలో మరింత పెద్దరికాన్ని పెంచింది. రెబల్‌స్టార్‌గా సినిమా రంగంలో పేరు తెచ్చుకుంటే రాజకీయాల్లో కూడా స్టార్‌గానే వెలుగొందారు. పదవి ఉన్నా లేకపోయినా రాజకీయాల్లో చివరి వరకూ హుందాగా కొనసాగారు. అందుకే ఈ ప్రాంత ప్రజల్లో కృష్ణంరాజు జ్ఞాపకాలు పదిలంగా ఉంటాయి.

గోదావరి ప్రాంతాల ప్రజలతో అనుబంధం
కృష్ణంరాజు అప్పటి ప్రముఖ దర్శకుడు ప్రత్యగాత్మ సారఽథ్యంలో చిలకా గోరింక చిత్రం ద్వారా చిత్ర పరిశ్రమకు పరిచ యమయ్యారు. సాంఘిక, పౌరాణిక చిత్రాలతో పాటు ప్రపంచ ప్రఖ్యాతి గాంచిన భక్తకన్నప్ప, తాండ్ర పాపారాయుడు, బొబ్బిలి బ్రహ్మన్న వంటి చారిత్రాత్మక చిత్రాలలో నటించి సినీ హీరో అంటే ఇలా ఉండాలి..అని ఔరా అనిపించుకున్నారు. 183 చిత్రాల్లో నటించారు. ఇటీవలే ప్రభాస్‌ హీరోగా నటించిన  రాధే శ్యామ్‌ చిత్రంలో కృష్ణంరాజు చివరిసారిగా నటించారు. రాయిని ఆడది చేసిన రాముడివా..గంగను తలపై మోసిన శివుడివా అంటూ జయసుధ, పెళ్ళంటే పందిళ్ళు ..సందళ్ళు తప్పట్లు తాళాలు అంటూ అందాల నటి శ్రీదేవి, పన్నెండేళ్ళకు పుష్కరాలు అంటూ రాధికతో కృష్ణంరాజు గోదావరి తీరంలో డ్యూయెట్లు పాడుకున్నారు. గోదావరి నదీ పరివాహక ప్రాంతాల్లో వివిధ సినిమాల షూటింగ్‌లకు వచ్చినపుడు ఆయన స్థానికులతో ఎంతో సరదాగా గడిపేవారు. పోలవరం మండలంలో ఆయన మిత్రులు, సన్నిహితులు ఆయనతో గడిపిన క్షణాలను, అనుభవాలను గుర్తుచేసుకున్నారు. భక్త కన్నప్ప, ఆడవాళ్ళూ మీకు జోహార్లు, తాండ్ర పాపారాయుడు, త్రిశూలం చిత్రాల షూటింగ్‌ కోసం ఆయన పోలవరం వచ్చినప్పుడు నూతనగూడెంలో కొణతాల కృష్ణమూర్తి ఇంటికి తరచూ వచ్చి ఆయనతో గడిపి వేళ్ళేవారని కృష్ణమూర్తి మనవడు మాజీ కాంగ్రెస్‌ మండల అధ్యక్షుడు కొణతాల ప్రసాద్‌ తెలిపారు. పోల వరంలో అప్పట్లో లాడ్జి, హోటల్‌ నిర్వహించే తూము పెరుమాళ్ళు తనయుడు సుబ్బారావుకి కృష్ణంరాజుతో ఎంతో సాన్నిహిత్యం ఉండేదని, ఆయన ఆకస్మిక మృతిని జీర్ణించుకోలేకపోతున్నానని రిటైర్డు కానిస్టేబుల్‌ సుబ్బారావు ఆవేదన వ్యక్తం చేశారు. పోలవరం మండలంలో భక్తకన్నప్ప సినిమా చిత్రీకరణ సమయంలో పట్టిసీమ భద్రకాళీ సమేత వీరేశ్వరస్వామి ఆలయంలో కొన్ని సన్నివేశాలు చిత్రీకరించారని షూటింగ్‌ విరామ సమయంలో ఆయన పట్టిసీమ గ్రామస్థులతో ఎంతో సన్నిహితంగా మెలిగేవారని గ్రామస్థులు తెలిపారు. ఆడవాళ్ళూ మీకు జోహార్లు చిత్రం షూటింగ్‌ కోసం కొన్ని రోజుల పాటు పాతపోలవరం రాజుల కోటలో, పాండురంగడి కొండపైన షూటింగ్‌ జరిపారని రాజమహేంద్రవరం శ్రీదుర్గా లాడ్జిలో మకాం ఉంటూ నిత్యం పోలవరం వచ్చి షూటింగ్‌ చేసేవారని స్థానికులంతా షూటింగ్‌ చూడ డానికి వచ్చిన సందర్భాలలో అభిమానులతో ఫొటోలు దిగేవారని పాతపోలవరం గ్రామస్థులు తెలిపారు. ఎవరో ఒక ఆకతాయి విసిరిన రాయి తగిలి ఆయనకు నుదుటిపై గాయం కూడా అయ్యిందని, ఆ మచ్చ ఇప్పటికీ ఉందని ఆ విషయాన్ని బీజేపీ ప్రచార సమయంలో పోలవరం వచ్చిన కృష్ణంరాజే గుర్తు చేశారని గ్రామస్థులు తెలిపారు. తూర్పుగోదావరి జిల్లా పూడిపల్లిలో శ్రీదేవి, జయసుధ, రాధికలు హీరోయిన్‌లుగా నటించిన త్రిశూలం సినిమా షూటింగ్‌ సందర్భంలో రాజమహేంద్రవరం నుంచి నిత్యం పోలవరం వచ్చి లాంచీలపై పూడిపల్లి షూటింగ్‌కి వెళ్ళేవారని ఆ షూటింగ్‌లో కృష్ణంరాజుని చూడడానికి గ్రామస్థులు లాంచీలపై వెళ్లేవారమని తెలిపారు.

ఎంత ఎదిగినా..
రాచరిక కుటుంబంలో పుట్టిన రెబల్‌స్టార్‌ కృష్ణంరాజు ఇటు సీనీ రంగంలోనూ, అటు రాజకీయ రంగంలోనూ తనదైన ముద్ర వేసుకున్నారు. ఎంత ఎదిగినా ఒదిగి ఉండాలనే నానుడు నిజం చేస్తూ తన సొంతూరు మొగ ల్తూరులో సన్నిహితులు, బంధువులతో కలివిడిగా ఉండేవారు. పండుగలకు, ముఖ్య కార్యక్రమాలకు మొగల్తూరుకు వచ్చిన సందర్భంలో తన చిన్ననాటి స్నేహితులను పేరుతో పిలుస్తూ ఆదరించేవారు. మొగల్తూరులో 1986 వరదల సమయంలో గ్రామంలోని ముంపులో ఉన్న పేద, దళిత, బీసీ వర్గాలకు తన ఇంటిలో ఆశ్రయం ఇచ్చి నెల రోజులపాటు వారికి ఆహారం అందించారు. పేదలందరీకీ దుస్తులు, వంట సామగ్రి అందించారు.

కేంద్ర మంత్రిగా ప్రత్యేక ముద్ర
కేంద్ర మంత్రిగా కృష్ణంరాజు అభివృద్ధిలో సొంత ముద్ర వేసుకున్నారు. నరసాపురం లోక్‌సభ నుంచి 1999 విజయం సాధించిన కృష్ణంరాజుకు కేంద్ర మంత్రిగా ఎన్టీయే ప్రభుత్వం బాధ్యతలు అప్పగించింది. ఆయన మూడు సార్లు మంత్రి పదవులు నిర్వహించారు. ఈ పదవులకు సంబంధం లేకుండానే నియోజకవర్గంలో సుమారు రూ.600 కోట్ల అభివృద్ధి పనులు చేసి రికార్డు సృష్టించారు. గ్రామీణ అభివృద్ధి, పరిశ్రమలు, రక్షణశాఖ సహాయ మంత్రిగా పదవులు నిర్వహించారు. హైదరాబాదు నుంచి వచ్చి పోటీ చేసి గెలిచిన తరువాత వెంటనే ఆయన సొంత నియోజకవర్గానికి మకాం మార్చారు. మొగల్తూరులో ఆయనకు సొంత ఇల్లు ఉన్నప్పటికీ నియోజకవర్గంలో ప్రజలు రావాలన్నా చాలా దూరం ఉంటుందని భావించి భీమవరంలో కార్యాలయం ఏర్పాటు చేశారు. ఆయన ఇల్లు కూడా తీసుకున్నారు. అక్కడి నుంచి ఆయన పార్లమెంట్‌ కార్యాకలాపాలన్నీ కొనసాగించారు. నిత్యం ప్రజలకు అందుబాటులో ఉన్నారు. ప్రత్యేకంగా సొంత సిబ్బందిని నియమించుకున్నారు. ప్రతీ మండలం నుంచి నాయకుల ద్వారా ప్రజా సమస్యలను స్వీకరించి పరిష్కారానికి చర్యలు తీసుకునేవారు. అప్పటి ప్రధాని అటల్‌ బిహారీ వాజపేయి రహదారులకు ఎంతో ప్రాధాన్యం ఇచ్చారు. దీంతో కేంద్రం గ్రామ్‌ సడక్‌ యోజన పథకంలో రూ.200 కోట్లకు పైగా నిధులను కృష్ణంరాజు పార్లమెంట్‌కు రప్పించారు. ప్రతీ గ్రామానికి సీసీ రోడ్లు నిర్మాణానికి నిధులు ఇచ్చారు. కృష్ణంరాజు వేసిన రహదారుల నిర్మాణం శిలాఫలకం ప్రతీ గ్రామంలోనూ కనిపిస్తుందంటే అతిశయోక్తి లేదు. కేంద్ర మంత్రిగా ఉన్నప్పుడు వెనుకబడిన తరగతుల ప్రజలున్న ప్రాంతాల్లో, మత్స్యకారుల తీర ప్రాంతాలలోనూ ప్రజలకు పలు అభివృద్ధి కార్యక్రమాలు చేపట్టారు. మత్స్యకారుల ఉపాధికి కృషి చేశారు. వారికి మరబోట్లు, వలలు సబ్సిడీపై అందించారు. మొగల్తూరు గ్రామానికి స్వజలధార పథకంలో భారీ మంచినీటి పథకాన్ని మంజూరు చేయించి గ్రామస్థుల దాహార్తిని తీర్చారు. రహదారి సౌకర్యాలు లేని సమయంలో రెండు వంతెనలు నిర్మించి భీమవరం మండలం వెంప గ్రామానికి మొగల్తూరును అనుసంధానం చేయడంలో తనవంతు పాత్ర పోషించారు. నరసాపురం మొగల్తూరు మీదుగా ఒంగోలు వరకూ విస్తరించిన జాతీయ రహదారి 214–ఎను 216గా మార్పించి ఈ జాతీయ రహదారి మంజూరు చేయించడంతో కీలకపాత్ర పోషించారు.

ఐదుసార్లు పోటీ..రెండుసార్లు గెలుపు
సినిమా రంగంలో విలక్షణ నటుడిగా మూడు దశాబ్దాల పాటు రారాజుగా పేరు తెచ్చుకున్నారు. హిట్‌ సినిమాలు చేస్తుండగానే ఆయన కాంగ్రెస్‌ పార్టీ అభిమానిగా ఉండేవారు. ప్రధాని రాజీవ్‌గాంధీని కలిసి ఆయన ప్రభావంతోనే రాజకీయంగా ప్రజలకు సేవ చేయాలని కాంగ్రెస్‌ పార్టీ ద్వారా రాజకీయాల్లోకి అడుగు పెట్టారు. ఓటమి చెందినప్పటికీ ఆయన రాజకీయ బాటను విడిచిపెట్టకుండా మళ్లీ బీజేపీ ద్వారా రాజకీయాల్లోకి వచ్చి పార్లమెంట్‌ సభ్యుడిగా విజయం సాధించి ఒక ప్రత్యేక ముద్ర వేసుకున్నారు. పార్లమెంట్‌ సభ్యుడిగా ఆయన ఐదుసార్లు పోటీ చేసి రెండుసార్లు మాత్రమే విజయం సాధించారు. ప్రజలకు మాత్రం ఆయన అభిమాన నటుడు.. నాయకుడిగా గుర్తింపు తెచ్చుకున్నారు. కేంద్ర మంత్రి పదవి ద్వారా ఆయన జాతీయస్థాయిలో ఇమేజ్‌ సంపాదించుకున్నారు. నటుడిగా ఎంతో విజయం సాధించారో.. పార్లమెంట్‌ పదవితో వచ్చిన మంత్రి పదవి ద్వారా విజయం సాధించి ప్రజల అభిమానాన్ని చూరగొన్నారు.  

రాజకీయ శిష్యుడుగా బండారు
 కృష్ణంరాజు రాజకీయాల్లో చేరిన తరువాత మాజీ ఎమ్మెల్యే బండారు మాధవ నాయుడును ప్రోత్సహిస్తూ వచ్చారు. 1998 నుంచి కృష్ణంరాజు వెంటే ఉండేవారు. అప్పటిలో యూత్‌ ఫాలోయింగ్‌ ఎక్కువగా ఉన్న బండారును ఆయన ప్రోత్సహిస్తూ వచ్చారు. కృష్ణంరాజు కాకినాడలో పోటీ చేసిన సమయం లోనూ నరసాపురం నుంచి బండారు యువసేన కాకినాడ ఎన్నికల ప్రచారంలో ప్రత్యేక క్యాంప్‌ నిర్వహించారు. తరువాత నరసాపురం 1999లో నరసాపురం ఎంపీగా గెలుపొంది కృష్ణంరాజు కేంద్రమంత్రి అయిన తరువాత పార్టీ వ్యవహరాలన్నీ బండారుకే అప్పగించారు. 2013లో బీజేపీకి రాజీనామా చేసిన మాధవనాయుడు 2014 ఎన్నికల్లో టీడీపీ నుంచి నరసాపురం అసెంబ్లీ బరిలో నిలిచారు. మాధవనాయుడు నామినేషన్‌ ధాఖలు సమయంలోనూ, ప్రచా రంలో పాల్గొనడంతో పాటు కృష్ణంరాజు మొగల్తూరు వచ్చి ఓటుహక్కు వినియోగించుకున్నారు.  

అంత్యక్రియలకు తరలివెళ్లిన గ్రామస్థులు
కృష్ణంరాజు అంత్యక్రియలు సోమవారం హైదరాబాద్‌లో జరుగుతున్న నేపథ్యంలో ఆయనను కడసారి చూసేందుకు స్వగ్రామం అయిన మొగల్తూరు నుంచి అనేకమంది అభిమానులు, బంధుమిత్రులు ఆదివారం రాత్రి హైదరా బాద్‌కు బయలుదేరి వెళ్లారు. ఇప్పటికే మాజీ ఎమ్మెల్యే బండారు మాధవ నాయుడు అక్కడే ఉండగా, మొగల్తూరు మాజీ ఉప సర్పంచ్‌ కలిదిండి కుమార్‌ బాబు, రామారావు, చింతపల్లి రవికుమార్‌, ముత్యాలపల్లి నుంచి కొల్లాటి చెన్న కేశవ్‌, బీజేపీ నాయకులు కవురు శ్రీనివాస్‌, పేరుపాలెం, రామన్నపాలెం, కోట తదితర ప్రాంతాల నుంచి పలువురు తరలివెళ్లారు.

నాకంటే రెండు సంవత్సరాలు చిన్నవాడు
కృష్ణంరాజు నా పెదతండ్రి కుమారుడు. నాకంటే రెండు సంవత్సరాలు చిన్నవాడు. సినీ రంగంలో ఎంత కష్టపడి ఎదిగిన వ్యక్తి. కుటుంబం, గ్రామంపై ఎంతో మమకారంతో ఉండేవారు. సొంత తమ్ముడుతో పాటు  మా అక్క చెల్లెళ్ళు, వారి పిల్లల గురించి ఎప్పుడు ఆరా తీస్తూ అండగా ఉండేవాడు. చిన్నతనం నుంచి క్రమశిక్షణ, పట్టుదలతో ఎంచుకున్న బాటలో విజయం సాధించే వరకూ పోరాడేవాడు. మొగల్తూరు కోటలో కర్రసాము చేయడంలో మంచి నేర్పరి. కృష్ణంరాజు మృతి మా కుటుంబానికి తీరని లోటు.
–యు.వి. కృష్ణంరాజు, (కృష్ణంరాజుకు వరసకు అన్న)

మొగల్తూరుకు ఖ్యాతి
కృష్ణంరాజు మొగల్తూరుకు మంచి పేరు తీసుకువచ్చారు. సీనీ, రాజకీయ రంగాల్లో తనదైన ముద్ర వేశారు. మొగల్తూరు గ్రామస్థులకు అండగా ఉంటూ అనేక దాన ధర్మాలతో పాటు ఎవరికీ ఏ సమస్య వచ్చినా ఆయన దృష్టికి తీసుకు వెళితే పరిష్కరించేవారు.
–రాయుడు లక్ష్మణరావు, మొగల్తూరు

 మా గ్రామ రహదారికి భూమి ఇచ్చారు
మా గ్రామం పాలకమ్మ చెరువుకు రహదారి సౌకర్యం లేని సమయంలో ఆయనకు చెందిన భూమిని రహదారి నిర్మాణం కోసం దానం చేశారు. 1986 వరదల సమయంలో ఆయన అందించిన సహాయం ఎప్పటికీ మరువలేం.
– పడవల సత్యనారాయణ, మొగల్తూరుRead more