చదరపు అడుగుకు..రూ.100 జరిమానా

ABN , First Publish Date - 2022-09-25T06:17:33+05:30 IST

ఇకపై ఫ్లెక్సీ ప్రింట్‌ చేస్తే చదరపు అడుగుకు రూ.100 జరిమానా.. ఇవి ప్రభుత్వ ఆదేశాలు.. ఫ్లెక్సీల నిషేధంపై ప్రభుత్వం ముందడుగు వేసింది.

చదరపు అడుగుకు..రూ.100 జరిమానా

ఫ్లెక్సీలు, బ్యానర్లను నిషేధిస్తూ  ప్రభుత్వం నోటిఫికేషన్‌
క్లాత్‌ బ్యానర్‌ ప్రింటింగ్‌కు మారాలంటే లక్షల పెట్టుబడి..
నిర్వాహకుల ఆవేదన.. ప్రింటింగ్‌ రంగం అతలాకుతలం

భీమవరం, సెప్టెంబరు 24 : ఇకపై ఫ్లెక్సీ ప్రింట్‌ చేస్తే చదరపు అడుగుకు రూ.100 జరిమానా.. ఇవి ప్రభుత్వ ఆదేశాలు.. ఫ్లెక్సీల నిషేధంపై ప్రభుత్వం ముందడుగు వేసింది.. పర్యావరణ హితం కోరి ఈ నిర్ణయం తీసుకున్నామని ముఖ్యమంత్రి ప్రకటించారు. ఈ నిర్ణయం వల్ల రాష్ట్రంలో లక్షలాది వేల కుటుంబాలు బజారులో పడతాయని అసోసియేషన్‌ నాయకులు, పనిచేసే కార్మిక సంఘాలు అంటున్నాయి. నవంబరు 1 నుంచి ప్లాస్టిక్‌ ఫ్లెక్సీలు, బ్యానర్లను నిషేధిస్తూ ప్రభుత్వం గెజిట్‌ నోటిఫికేషన్‌ జారీ చేయడంతో ఫ్లెక్సీ ముద్రణ రంగం తీవ్ర ఆందోళన వ్యక్తం చేస్తోంది. ఈ నిషేధం అమలు, ఉల్లంఘనలు, వాటిపై చర్యలు, ప్రత్నామ్నాయాలకు సంబంధించిన మార్గదర్శకాలను నోటిఫికేషన్‌లో వివరించారు. ప్లాస్టిక్‌ ఫ్లెక్సీల ఉత్పత్తి, దిగుమతులతో పాటు వినియోగం, ముద్రణ, రవాణా, ప్రదర్శనలకు నిషేధం వర్తిస్తుందని ప్రకటించారు.
ఈ ఉత్తర్వులు జారీతో ఉమ్మడి పశ్చిమ గోదావరి జిల్లాలో 200 ఫ్లెక్సీ ప్రచురిత సెంటర్లు మూతపడుతున్నాయి. వీటిలో పనిచేస్తున్న, వీటి ఆధారంగా ఉపాధి పొందుతున్న సుమారు 5000 కుటుంబాలు  రోడ్డున పడనున్నాయి. వాస్తవానికి ఈ ఫ్లెక్సీ రంగం ముడిసరుకు వేస్ట్‌ మెటీరియల్‌తోనే తయారు చేస్తున్నట్టు ఫ్లెక్స్‌ ప్రింటర్స్‌ అసోసియేషన్‌ ప్రకటించింది. ఇదే విషయాన్ని ముఖ్యమంత్రి జగన్‌ దృష్టికి అసోసియేషన్‌ సభ్యులు కొంత మంది అధికార పార్టీ నాయకుల ద్వారా వినతులు పంపించారు. వాటిని తొలగించిన తర్వాత పర్యావరణానికి అనుకూలంగా రీసైక్లింగ్‌ చేయవచ్చని చెబుతున్నారు.
ఫ్లెక్స్‌ నిషేధం అమలును పట్టణాలు, నగరాల్లో కాలుష్య నియంత్రణ అధికారులు, మునిసిపల్‌ కమిషనర్లు, శానిటేషన్‌ సిబ్బంది పర్యవేక్షిస్తారు. గ్రామీణ ప్రాంతాల్లో పర్యవేక్షణ బాధ్యతను కలెక్టర్లు, జడ్పీ సీఈవోలు, పంచాయతీలు, గ్రామ సచివాలయ సిబ్బందికి అప్పగించారు. ప్లాస్టిక్‌ ఫ్లెక్సీలు, బ్యానర్లకు బదులుగా కాటన్‌, నేత వస్త్రాలను వినియోగించాలని ప్రభుత్వం సూచించింది.

 క్లాత్‌ బ్యానర్‌ ప్రింటింగ్‌ మిషన్‌ రూ.30 లక్షలు
ప్రభుత్వం చెబుతున్న క్లాత్‌ బ్యానర్లో ముద్రణకు లక్షల్లో పెట్టుబడులు పెట్టాలని వాపోతున్నారు.. కొత్తగా ఇందుకు సంబంధించిన మిషన్‌ కొనుగోలు చేయాలంటే కనీసం 30 లక్షలు వరకూ పెట్టుబడి అవసరం ఉంటుందని ఫ్లెక్స్‌ ప్రింటింగ్‌ నిర్వాహుకులు ఆంధ్రజ్యోతితో చెప్పారు. ప్రస్తుతం ఉన్న పరిస్ధితుల్లో ఇన్ని లక్షల పెట్టుబడులతో వ్యాపారాన్ని కొత్తగా ప్రారంభించాలంటే ఇబ్బందులు తప్పవని ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. ఇప్పుడున్న మిషన్లను క్లాత్‌ బ్యానర్‌ ప్రింటింగ్‌కు అనుకూలంగా కూడా సాంకేతికంగా మార్చుకునే అవకాశం ఉందని కూడా చెబుతున్నారు. దీనికి కూడా లక్షల్లో పెట్టుబడులు తప్పవని అంటున్నారు. ఏది ఏమైనా ప్రభుత్వ ఉత్తర్వులతో ప్రింటింగ్‌ రంగం అతలాకుతలమవుతోంది.

ఉల్లంఘిస్తే జరిమానా ఇలా..
నిబంధనలు ఉల్లంఘిస్తే ఫ్లెక్సీ చదరపు అడుగుకు రూ.100 జరిమానా విధిస్తారు. ఉల్లంఘనులపై పర్యావరణ చట్టం– 1986 ప్రకారం చర్యలు తీసుకుంటారు. సీజ్‌ చేసిన బ్యానర్లను శాస్త్రీయంగా డిస్పోజ్‌ చేయడానికి అవసరమైన ఖర్చును నిబంధనలు ఉల్లంఘించిన వారి నుంచి వసూలు చేస్తారు. పోలీస్‌, రెవెన్యూ, ట్రాన్స్‌ఫోర్ట్‌, జీఎస్టీ అధికారులు ప్లాస్టిక్‌ ఫ్లెక్సీల నిషేధాన్ని పర్యవేక్షించే అధికారులకు సహాయపడతారని ఉత్తర్వులలో పేర్కొన్నారు.

Read more