తీరానికి.. తూట్లు

ABN , First Publish Date - 2022-09-26T05:11:56+05:30 IST

నరసాపురం తీర ప్రాంతం ఇసుక వ్యాపారానికి అడ్డాగా మారింది.

తీరానికి.. తూట్లు
పేరుపాలెం సమీపంలో ఇసుక తరలిస్తున్న దృశ్యం

అసైన్డ్‌, సీఆర్‌జెడ్‌ భూముల్లో అనధికారికంగా ఇసుక తవ్వకాలు
నిత్యం లారీలు, ట్రాక్టర్లతో తరలింపు
రూ.కోట్లలో సాగుతున్న చీకటి వ్యాపారం
చోద్యం చూస్తున్న అధికార యంత్రాంగం


నరసాపురం, సెప్టెంబరు 25: నరసాపురం తీర ప్రాంతం ఇసుక వ్యాపారానికి అడ్డాగా మారింది. నిబంధనలను తుంగలోకి తొక్కి కొందరు అక్ర మార్కులు నేతల అండదండలతో అనధికారికంగా దందా నిర్వహిస్తు న్నారు. సీఆర్‌జెడ్‌, అసైన్డ్‌ భూముల్లో యంత్రాలు వినియోగించి యథేచ్ఛగా తవ్వకాలు జరుపుతున్నారు. చీకటి పడిం దంటే వందలాది ట్రాక్టర్లు, లారీల్లో ఇసుక తరలిపోతోంది. రూ.కోట్లలో సాగుతున్న దందాతో ప్రభుత్వ ఖజానాకు  గండి పడు తోంది. అధికార పార్టీకి చెందిన కొందరి నాయకులు, కొన్ని శాఖల అధికారుల అండదండలతో తీర ప్రాంతాన్ని తవ్వేస్తు న్నారన్న విమర్శలు వ్యక్తమవుతున్నాయి. నరసాపురం, మొగల్తూరు మండలాల్లోని సముద్ర తీర ప్రాంతాల్లో ఒక్కప్పుడు ఎక్కడ చూసినా బొండు ఇసుక గుట్టలే కనిపించేవి.  సముద్రం కోత గురికాకుండా ఈ గుట్టలు రక్ష ణగా ఉండేవి. ఎందుకు ఉపయోగపడని ఈ బొండు ఇసుకకు ఒక్కసారిగా డిమాండ్‌ వచ్చేసింది. ఇటుకల తయారీ, స్థలాల పూడికకు దీన్ని వినియో గిస్తుండడంతో అక్రమార్కుల చూపు ఇసుకపై పడిం ది. ఎక్స్‌కవేటర్లు వినియోగించి లారీలు, ట్రాక్టర్ల ద్వారా ఇసుకను జిల్లా వ్యాప్తంగా సరఫరా చేస్తున్నారు. చీకటి పడిందంటే తీర ప్రాంతం నుంచి వందల లారీలు సరిహద్దు దాటి పోతు న్నాయి. నరసాపురం, మొగల్తూరు మండలాల్లో సుమారు 50, 60 మంది ఈ చీకటి దందాను నిర్వహి స్తున్నట్టు సమా చారం. ట్రాక్టర్‌ ఇసుకను రూ.1800, అదే లారీ అయితే రూ.8 నుంచి రూ.10 వేలకు విక్రయిస్తున్నారు.
 నరసాపురం, మొగల్తూరు మం డలాల్లో సముద్రానికి నాలుగైదు కిలోమీటర్ల దూరంలో ఉన్న భూ ముల్లోను ఇసుక మేటలు ఉన్నాయి. ఇలాంటి భూముల్లో తవ్వ కాలు జరపాలంటే రైతులు అధికారుల అనుమతి తీసుకోవాలి.  తవ్వి తీసిన ఇసుకను అమ్మకూడదు. రైతుల పేరిట కొందరు వ్యాపారులు మట్టిని తవ్వి ఇతర ప్రాంతాలకు తరలిస్తున్నా ప్రభు త్వ శాఖలు చోద్యం చూస్తున్నాయి. సీఆర్‌జడ్‌ భూము ల్లోను తవ్వకాలు జరపకూడదు. తీరం వెంబడి యథేచ్ఛగా తవ్వ కాలు జరిపి బొండు ఇసుక అమ్మేస్తున్నారు. ఇలా తవ్వకాలు జర పడం వల్ల సముద్ర పరీవాహక ప్రాంత మంతా గుల్లాగా మారి సముద్రం ముందుకు చొచ్చుకొచ్చేందుకు మార్గం ఏర్పడుతుంది.
 రియల్‌ ఎస్టేట్‌ స్థలాల పూడికకు, ఇళ్ల నిర్మాణంలో పూడికకు, ఇటుకల తయారీకి బొండు ఇసుకను వినియోగిస్తున్నారు. ఈ కారణంగా జిల్లాతోపాటు సరిహద్దున్న కృష్ణా, తూర్పుగోదావరి జిల్లాలకు ఈ ప్రాంతం నుంచే ఇసుక తరలివెళ్తోంది.

సీఆర్‌జెడ్‌ నిబంధనలకు నీళ్లు..

సముద్ర తీరానికి 500 మీటర్ల పరిధిలో ఎటువంటి నిర్మాణాలు, తవ్వకాలు జరపకూడదు. నరసాపురం తీర ప్రాంతంలో ఈ నిబంధనలను తుంగలోకి తొక్కేస్తున్నారు. యథే చ్ఛగా నిర్మాణాలతో పాటు ఇసుక తవ్వకాలు సాగుతు న్నాయి. రోజు లక్షల్లో వ్యాపారం సాగుతున్న నియం త్రణ లేదు. దీనివల్ల భవిష్యత్‌తో పెను ప్రమాదాలు సంభవించే అవకాశం ఉంది.
– కవురు పెద్దిరాజు,  సీపీఎం నాయకుడు

Updated Date - 2022-09-26T05:11:56+05:30 IST