ఫిర్యాదుదారులతో విధిగా మాట్లాడండి..

ABN , First Publish Date - 2022-09-27T05:34:23+05:30 IST

స్పందన అర్జీల పరిష్కారం చేసేటప్పుడు ఫిర్యాదుదారుడితో మాట్లాడి విధిగా ఫొటోలు అప్‌లోడ్‌ చేయాలని కలెక్టర్‌ పి.ప్రశాంతి అధికారులను ఆదేశించారు.

ఫిర్యాదుదారులతో విధిగా మాట్లాడండి..
స్పందనలో ఫిర్యాదులు స్వీకరిస్తున్న కలెక్టర్‌ ప్రశాంతి

కలెక్టర్‌ ప్రశాంతి.. స్పందనలో 160 అర్జీలు
భీమవరం, సెప్టెంబరు 26 : స్పందన అర్జీల పరిష్కారం చేసేటప్పుడు ఫిర్యాదుదారుడితో మాట్లాడి విధిగా ఫొటోలు అప్‌లోడ్‌ చేయాలని కలెక్టర్‌ పి.ప్రశాంతి అధికారులను ఆదేశించారు. కలెక్టరేట్‌లో సోమవారం నిర్వహించిన స్పందనలో అర్జీ దారుల నుంచి ఆమె మొత్తం 160 వినతులు స్వీకరించారు. గృహ నిర్మాణ కాలనీల్లో సమస్యలు,  మురుగు కాల్వలు, పిం ఛన్లు, హౌసింగ్‌, భూ తగాదాలు, భూమి రికార్డుల ఆన్‌లైన్‌, చేపల చెరువులు, తదితర సమస్యలపై ఎక్కువ వినతులు అందాయి. వీటిని గడువులోగా పరిష్కరించే విధంగా జిల్లా, మండల స్థాయి అధికారులు చర్యలు తీసుకోవాలని కలెక్టర్‌ ఆదేశించారు.  డీఆర్వో కె.కృష్ణవేణి, జీఎస్‌/ డబ్ల్యూఎస్‌ జిల్లా కో ఆర్డినేటర్‌ కేసీహెచ్‌ అప్పారావు, డీపీవో ఎం.నాగలత, డీఎస్పీ ఎస్‌బీవీ శుభాకర్‌ తదితరులు అర్జీలు స్వీకరించారు.   


 ఎస్పీ కార్యాలయంలో 10 ఫిర్యాదులు
భీమవరం క్రైం, సెప్టెంబరు 26 : స్పందన ఫిర్యాదులను నిర్దిష్ట గడువులోగా పరిష్కరించాలని అడిషనల్‌ ఎస్పీ ఎ.సుబ్బరాజు సూచించారు. పెద అమిరంలోని ఎస్పీ కార్యా లయంలో సోమవారం స్పందన కార్యక్రమం నిర్వహించారు.   పది ఫిర్యాదులు రాగా వాటిలో సివిల్‌ వివాదాలకు సంబంధించి 5,  కుటుంబ తగాదాలు 3, ఇతర సమస్యలపై 2 అందాయి. ఏఎస్పీ సంబంధిత పోలీస్‌ అధికారులతో వీడియో కాన్ఫరెన్స్‌లో మాట్లాడి కేసులను సత్వరం పరిష్కరిం చాలని ఆదేశించారు. కార్యక్రమంలో పోలీస్‌ సిబ్బంది పాల్గొన్నారు.

నాలుగుసార్లు నమోదు చేసినా పింఛన్‌ రాలేదు..
నా భర్త చనిపోయిన తర్వాత నాకు పింఛన్‌ రావడం ఆగిపోయింది. అధికారుల చుట్టూ తిరిగాను. వలంటీర్లు ఇప్పటికే నాలుగుసార్లు నమోదు చేశారు. ఇక పింఛన్‌ రావడం లేదని కలెక్టర్‌కు ఫిర్యాదు చేయడానికి వచ్చా.
– దిడ్ల లలితమ్మ, కొణితివాడ,
వీరవాసరం మండలం
 నా భర్త నాకు కావాలి..
నా భర్త రెండో పెళ్లి చేసుకుని నన్ను పట్టించుకోవడం లేదు. నెల రోజుల కిందట దీనిపై పోలీసులకు ఫిర్యాదు చేశాను. అయినా ఇంత వరకు న్యాయం జరగలేదు. నాకు నా భర్త కావాలి.. కలెక్టర్‌ గారు స్పందించి నాకు న్యాయం చేయాలి.
– లంక మంగాపురం, తణుకు

Read more