డేంజర్‌

ABN , First Publish Date - 2022-07-18T06:34:25+05:30 IST

వశిష్ఠ గోదావరి నరసాపురం వద్ద ప్రమాదభరితంగా మారింది.

డేంజర్‌
వశిష్ఠ గోదావరిలో పడిపోతున్న రెయిలింగ్‌

నరసాపురం వద్ద కుప్పకూలిన రెయిలింగ్‌.. గండి పడే ప్రమాదం
పట్టణం జలదిగ్బంధంలో చిక్కుకునే  అవకాశం
అఽధికార యంత్రాంగం అలర్టు
నివారణకు ఇసుక బస్తాల తరలింపు
రంగంలోకి దిగిన ఓఎన్‌జీసీ
భయాందోళనలో స్థానికులు
అంధకారంలో లంకగ్రామాలు
పలుచోట్ల పొర్లుతున్న ఏటిగట్లు
మరో 24 గంటలు గడిస్తేనే ప్రమాదం తప్పినట్టే..



వశిష్ఠ గోదావరి నరసాపురం వద్ద ప్రమాదభరితంగా మారింది. పట్టణంలోని పొన్నపల్లి వద్ద గట్టుకు ఆనుకుని ఉన్న రెయిలింగ్‌ ఆదివారం రాత్రి పది గంటల సమయంలో నదిలోకి జారిపోయింది. గట్టును ఆనుకుని నది ఉధృతంగా ప్రవహిస్తుండడంతో స్థానికులు బిక్కుబిక్కుంటున్నారు. అధికారులు అప్రమత్తమై రక్షణ చర్యలు చేపట్టినా ఎప్పుడు ఏం జరుగుతుందోనన్న భయాందోళన నెలకొంది. మరోవైపు లంక గ్రామాలు నీటిలో ఉన్నాయి. ఏటిగట్టు పైకి వరద నీరు చేరుతుండడంతో ఆయా ప్రాంతాల్లో స్థానికులే అడ్డుకట్టలు వేస్తున్నారు. మరో 24 గంటలు ప్రజలంతా అప్రమత్తంగా ఉండాలని అధికారులు హెచ్చరిస్తున్నారు.


నరసాపురం టౌన్‌/ ఆచంట/యలమంచిలి/పెనుగొండ, జూలై 17: నరసాపురంలోని పొన్నపల్లి అమరేశ్వర స్వామి ఆలయం వద్ద వశిష్ఠ గోదావరి గట్టు ప్రమాదకరంగా మారింది. రెండు రోజులుగా వరద ప్రవాహానికి కోతకు గురవుతూ వస్తున్న గట్టు ఆదివారం రాత్రి మరింత బలహీన పడి ఏక్షణంలోనైనా గండి పడేలా ఉంది. దీనిని అనుకుని ఉన్న రెయిలింగ్‌ రాత్రి పది గంటల సమయంలో గోదావరిలో పడిపోయింది. మరో 15 మీటర్లు రెయిలింగ్‌ ఏ క్షణంలోనైనా నదిలో పడేందుకు సిద్ధంగా ఉంది. గండి పడితే నరసాపురం పట్టణం పూర్తిగా జలదిగ్బంధంలో చిక్కుకునే ప్రమాదం ఉంది. ఇప్పటి వరకు రోడ్డుకు అడ్డు కట్టగా ఉన్న రెయిలింగ్‌ నదిలో పడడంతో గోదావరి ఏటుగట్టును తాకుతూ ప్రవహిస్తోంది. దీంతో పట్టణ వాసులు భయంతో బిక్కుబిక్కుమంటున్నారు. ఇళ్లల్లోని విలువైన సామాన్లను భద్ర పర్చుకుని సురక్షిత ప్రాంతాలకు వెళ్లిపోతున్నారు. ఇటు అధికారులు కూడా వచ్చే ప్రమా దాన్ని నివారించేందుకు అన్ని యత్నాలు చేస్తున్నారు. ఓఎన్‌ జీసీ సహకారం తీసుకుని గండి పడకుండా ఇసుక బస్తా లతో అడ్డుకట్ట వేసే ప్రయత్నాలు మొదలు పెట్టారు. మరోవైపు సమీప పరివాహాక ప్రాంతంలో నివాసం ఉంటున్న పొన్నపల్లివాసులు ముంచుకొంచే ముంపును గ్రహించి భవనాల పైకి చేరుకుంటున్నారు.
మరోవైపు ఇప్పటికే రెండు రోజుల కిందట పాలకొల్లు లాకుల వద్ద గండి పడడంతో చినమామిడిపల్లి జల దిగ్బంధంలోకి చిక్కుకుంది. పల్లపు ప్రాంత ప్రజల్ని ఖాళీ చేయించి పునరావాస కేంద్రానికి తరలిస్తున్నారు. నిడద వోలు పంట కాల్వలో వరద నీరు చేరడంతో నీటిమట్టం పది అడుగుల మేర గట్టును తాకుతూ ప్రవహిస్తోంది. పాలకొల్లు– నరసాపురం రహదారిపై ఐదు కిలో మీటర్ల వరకు వరద నీరే ప్రవాహిస్తుండడంతో వాహనదారులు తీవ్ర ఇబ్బందులు పడుతు న్నారు. లాకు వద్ద ఏర్పడిన గండిని పూడ్చేందుకు ఆదివారం తెల్లవారుజాము వరకు ప్రయ త్నించారు. ప్రభుత్వ చీఫ్‌ విప్‌ ప్రసాదరాజు, కలెక్టర్‌ ప్రశాంతి, ఆర్డీవో దాసి రాజు గండి వద్దే ఉండి పనుల్ని పర్యవేక్షించారు. ఆదివారం మధ్యాహ్నం నుంచి ఓఎన్‌జీసీ సహకారంతో గండి పూడిక పనులు ప్రారంభించారు. బాపు ఘాట్‌ వద్ద వరద నీరు గట్టు మీదకు చేరడంతో ఏటి గట్టుపై అంక్షలు విధించి ఎవర్ని అనుమ తించడం లేదు. అయినా వరద చూసేందుకు ప్రజలు పెద్ద ఎత్తున్న తరలి వచ్చారు. వలంధర్‌రేవులో ప్రమాదస్థాయిలో గోదావరి ప్రవహిస్తోంది. గట్టు మీద ఉన్న శివుడి  విగ్రహానికి తాకు తూ నీరు బయటకొచ్చింది. ప్రభుత్వ చీఫ్‌ విప్‌ ముదునూరి ప్రసాదరాజు, కలెక్టర్‌ ప్రశాంతి, ఎస్పీ రవిప్రకాశ్‌ పట్టణంతో పాటు మండలంలోని ముంపు ప్రాంతాల్లో పర్యటించారు. ప్రజలు మరో 24గంటలు అప్రమత్తంగా ఉండాలని సూచించారు.
ఆచంట మండలంలో ఉన్న లంకగ్రామాలు నాలుగు రోజులుగా జల దిగ్బంధంలోనే ఉన్నాయి. లంకగ్రామాల్లో విద్యుత్‌ సరఫరా కూడా నిలిపి వేయ డంతో లంక వాసులు అంధకారంలో మగ్గుతున్నారు. ఆదివారం  సాయంత్రం నుంచి వరద కాస్త  నిలకడగా ఉంది. లంక గ్రామాల్లో పశువులు సైతం నీటిలో చిక్కుకున్నాయి. వాణిజ్య పంటలు అన్ని పూర్తిగా నీట మునిగాయి.  కొబ్బరి కాయలు కొట్టుకుపోయాయి. ఉగ్ర వశిష్ఠను చూడటానికి  వస్తున్న సందర్శకుల తో కోడేరు, పెదమల్లం, భీమలాపురం, కరుగోరుమిల్లి ప్రాంతాలు ఆదివారం నిండిపోయాయి. పెదమల్లం మాచేనమ్మ ఆలయంల నీట మునగడంతో ఆల యం పక్కనే ఉన్న ఏటిగట్టుపైనే అమ్మవారి ఫొటో పెట్టడంతో భక్తులు అక్కడే పూజలు చేస్తున్నారు.
ఆచంట మండలం భీమలాపురంలో శుక్రవారం అర్ధరాత్రి గోదావరిలో గల్లంతైన దేవి ముత్యాలమ్మ (70) మృతదేహం ఆదివారం ఉదయం లభ్యమైం ది. కుటుంబ సభ్యుల ఫిర్యాదు మేరకు ఆచంట ఎస్‌ఐ ప్రసాద్‌ కేసు నమోదు చేసి మృతదేహాన్ని పాలకొల్లు ప్రభుత్వాస్పత్రికి తరలించారు.  
యలమంచిలి మండలంలో గోదావరి వరదనీటి ప్రవాహం ఆదివారం ఏటిగట్టు పైఅంచును తాకుతూనే ప్రవహిస్తోంది. దొడ్డిపట్ల, వాకలగరువు ప్రాంతాల్లో శనివారం రాత్రి ఏటిగట్టుపైకి వరదనీరు రావడంతో ప్రమాదాన్ని నివారించేందుకు గ్రామస్థులు ఇసుకబస్తాలు వేసి అడ్డుకట్టలు వేశారు. ఆదివారం వేకువజామున యల మంచిలిలో రెండుచోట్ల ఏటిగట్టుపైకి నీరు రావడంతో ప్రజ లంతా అడ్డుకట్టలు వేశారు. లక్ష్మీపాలెం లాకుల వద్ద నీటి ప్రవాహం లాకులు పైనుంచి కాల్వలోకి వెళుతుండడంతో అడ్డుకట్టవేసే ప్రయత్నాలు చేశారు. బాడవ, లక్ష్మీపాలెం, యలమంచిలిలంక, కనాకాయలంక, పెదలంక గ్రామాలు జలదిగ్బంధంలోనే ఉన్నాయి. ఏనుగువానిలంక స్లూయిజ్‌ వద్ద కాజ డ్రెయిన్‌లోకి చేరుతున్న వరదనీటిని ఆపేందుకు ప్రయత్నాలు చేస్తున్నా డ్రెయిన్‌లోకి వరదనీరు చేరుతోంది.
 పెనుగొండ మండలంలో గోదావరి వరద అంతకంతకూ పెరుగుతూ ప్రవహించడంతో  గోదావరి తీర ప్రాంత ప్రాంతాల ప్రజలు  1986 లో వచ్చిన గోదావరిని తలపించేలా ఉందని ఆందోళన చెం దుతున్నారు. సిద్ధాంతంలో ఎమ్మెల్యే చెరుకువాడ శ్రీరంగనాథరాజు వరద గోదావరిని, ఏటిగట్లును పరిశీలించారు.

వరద తాకిడి ప్రాంతాల్లో అన్ని ఏర్పాట్లు
భీమవరం, జూలై 17 : వరద తాకిడి ప్రాంతాల ప్రజలకు ఏవిధమైన ఇబ్బంది పడకుండా ఏర్పాట్లు చేశామని జిల్లా కలెక్టర్‌ పి.ప్రశాంతి తెలిపారు. ఆదివారం జిల్లాలో ఆచంట మండలంలో 9, యలమంచిలి మండలంలో 15, నరసాపురం మండలంలో 6 చొప్పున మొత్తం  30 పునరావాస కేంద్రాలు ఏర్పాటు చేశామన్నారు. ఈ కేంద్రాలకు 3,820 మందిని తరలించినట్టు తెలిపారు. వీటితో పాటు ముంపు ప్రాంతాల్లో ఉదయం అల్పాహారం 12,712 మందికి, మధ్యాహ్నం భోజనం 16,307 మందికి అందించినట్టు తెలిపారు. మూడు మండలాల్లోని పునరావాస కేంద్రాల్లో 1,94,600 మంచినీరు ప్యాకెట్లు ఉంచామన్నారు. 16,146 లీటర్లు పాలు సరఫరా చేశామన్నారు.  వరద ప్రభావిత ప్రాంతాల్లోని ప్రజలకు ఉచితంగా 25 కేజీల బియ్యం, కేజీ కందిపప్పు, లీటర్‌ ఆయిల్‌ పంపిణీ జరుగుతుందన్నారు. 8,614 పశువులకు 137.95 టన్నుల పశుగ్రాసం సరఫరా చేసినట్టు తెలిపారు. వరద ముంపు గ్రామాల ప్రజలను తరలించేందుకు 86 బోట్లు, 174 మంది గజ ఈతగాళ్లు సిద్ధంగా ఉన్నారన్నారు. ఎవరికైనా ఎటువంటి అసౌకర్యం కలిగినా సంబంధిత నోడల్‌ అధికారి లేదా మండల అధికారులకు తెలపాలని కోరారు.



Updated Date - 2022-07-18T06:34:25+05:30 IST