దర్జా దొంగలు!

ABN , First Publish Date - 2022-03-23T05:45:18+05:30 IST

దర్జా దొంగలను ఎక్క డైనా చూశారా.. డెల్టా వెళితే అక్కడ కనిపిస్తారు..

దర్జా దొంగలు!
నెర్రలు తీసిన చేనును చూపుతున్న రైతు

యథేచ్ఛగా నీటి చౌర్యం
చివరికి కష్టం
పొట్ట దశలో నెర్రలు తీస్తున్న చేలు
కన్నెత్తి చూడని అధికార యంత్రాంగం


ఆకివీడురూరల్‌, మార్చి 22 : దర్జా దొంగలను  ఎక్క డైనా చూశారా.. డెల్టా వెళితే అక్కడ కనిపిస్తారు.. ఎందు కంటే కళ్లెదుటే తోడేస్తారు. అయినా ఏ ఒక్కరూ పట్టించుకోరు. కనీసం అధికారులు కన్నెత్తి చూడరు.. ఇంతకీ ఆ దర్జా దొంగలెవరనే కదా మీ అనుమానం వాళ్లే నీటి దొంగలు.. శివారు ప్రాంతాలకు నీరందక రైతులు ఇబ్బందులు పడుతున్నారు. ఆకివీడు మండలం చినిమిల్లిపాడులోని గేదెల కోడు పంట కాలువ నుంచి శివారు ప్రాంతాలకు సాగునీరందడం లేదు. కాలువ వంతు సమయంలో కూడా సాగునీరు రావడం లేదని రైతులు వాపోతున్నారు. పాత వయ్యేరు కాలువకు ఇరువైపులా ఉన్న ఆక్వా చెరువులకు నీటిని యఽథేచ్ఛగా తోడేస్తుండటంతో దిగువ ప్రాంతాలకు నీరందడం లేదని రైతులు తెలియజేస్తున్నారు. ఉన్న నాటిని ఆక్వా చెరువులకు తోడేస్తుండడంతో శివారు ప్రాంతాల భూములు నీటి ఎద్దడితో నెర్రలు తీస్తున్నాయి. వరి చేలు పొట్ట, ఈనిక దశలో ఉండడంతో ఆందోళన చెందుతున్నారు. ఈ సమయంలో నీరు అత్యవసరమని, నీరు వచ్చే దాఖలాలు లేవని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.


 నీటి చౌర్యం  ఇలా..


చినిమిల్లిపాడులో గ్రామ సర్పంచ్‌ నివాసానికి ఎదురుగా ఉన్న ఆక్వా చెరువులోనికి గేదెలకోడుకి అక్రమ తూము పెట్టి  విద్యుత్‌ మోటార్లు ద్వారా నీటిని చౌర్యం చేస్తున్నారు. దీనిపై అధికారులు నోరు మెదపడం లేదు. ఆ చెరువు యజమానిని నీటిని తోడకుండా అడ్డుకునే వారే లేకపోవడంతో రైతులు దిక్కుతోచని స్థితిలో ఉన్నారు. పంటకాలువలు పర్యవేక్షణ చేయాల్సిన అధికారులు కనీసం పట్టించుకోవడం లేదు.  రెవెన్యూ అధికారులు, ఇరిగేషన్‌, వ్యవసాయాశాఖాధికారులు తమకు సంబంధం లేదన్నట్టుగా వ్యవహరిస్తున్నారని ఆరోపణలు వెల్లువెత్తుతున్నాయి.


నీరందడం లేదు : రత్నబాబు


వ్యయప్రయాసలకోర్చి వ్యవ సాయం చేస్తున్నా. పొట్ట, ఈనికదశలో అత్యవసరమైన ఒక తడి అవసరం ఉంది. కాలువ ద్వారా నీటిని దిగు వకు రానివ్వడం లేదు. కాలువకు ఇరువైపులా ఉన్న చేపల చెరువులు వారే నీటిని తోడేస్తు న్నారు. అధికారులకు తెలిపినా పట్టించుకోవడం లేదు. ఫిర్యాదు చేయండి వచ్చి పరిశీలిస్తామని చెబుతున్నారు. సాగు నీరివ్వండి మహాప్రభో.  

Updated Date - 2022-03-23T05:45:18+05:30 IST