నీళ్లు కావాలి

ABN , First Publish Date - 2022-03-16T06:28:42+05:30 IST

దాళ్వా పొట్ట పోసుకుని ఈనిక దశకు చేరింది. ఈ సమయంలో ఇప్పుడే పంట పొలాలకు పూర్తిస్థాయిలో నీరు కావాలి. కానీ, సక్రమంగా అందక పొలంలో నెర్ర లు తీస్తున్నాయి.

నీళ్లు కావాలి

నీరందక నెర్రలు తీస్తున్న పొలాలు
 కండిబోయినపాలెం, ఆచంట శివారు గ్రామాల్లో సాగుకు సమస్య
 దాళ్వా వదులుకోవాల్సిందే : రైతుల ఆవేదన


వీరవాసరం / ఆచంట : దాళ్వా పొట్ట పోసుకుని ఈనిక దశకు చేరింది. ఈ సమయంలో ఇప్పుడే పంట పొలాలకు పూర్తిస్థాయిలో నీరు కావాలి. కానీ, సక్రమంగా అందక పొలంలో నెర్ర లు తీస్తున్నాయి. అధికారులకు పైన ఉన్న పచ్చదనమే కాని కింద నుంచి ఎండుతున్న చేలు మాత్రం కనిపించడం లేదు. పంట కాల్వ పక్కనే చేలు ఉన్నా సాగునీరు మాత్రం ఈ ఆయకట్టుకు వదలడం లేదు. నీరు కావాలని అధికారులకు మొర పెట్టుకున్నా మీ భూములకు నీరు అందదని తేల్చి చెబుతున్నారని రాయకుదురు పశ్చిమ కాల్వను చేర్చి కొణితివాడకు చెందిన కండిబోయినవారిపాలెం ఆయకట్టు రైతులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ఈ ఆయకట్టులో ఎక్కువగా కౌలు రైతులే ఉన్నారు. వంద ఎకరాలకు నీరు అందక పొట్టదశలో పంటను వదులు కోవాల్సిన పరిస్థితి నెలకుంది. దాళ్వాకు సమృద్ధిగా నీరున్నా అధికారుల నిరాదరణ వల్ల నీరు అందడం లేదని చెబుతున్నారు. వంతుల వారీని కూడా అమలు చేయడం లేదని రైతులు గగ్గోలు పెడుతున్నారు. సార్వాలో వర్షాల కారణంగా దిగుబడులే లేవని పండిన కాస్త పంట ధాన్యం అమ్మి మూడు నెలలైనా ధాన్యం సొమ్ము రాలేదని వాపోతున్నారు.


శివారుకు అందని నీరు


ఆచంట మండలం శివారు ప్రాంతాలదీ ఇదే పరిస్థితి. వంతులవారీ విధానం ద్వారా అధికారులు సాగునీరు సరఫరా చేస్తున్నారు. పొలాలు పొట్ట దశలో ఉండడంతో పలు చోట్ల రైతులు బోరు ద్వారా, ఇంజన్‌ సహాయంతో నీటిని తోడుకుని తమ పంట ను కాపాడుకుంటున్నారు. మండలంలోని అనేక పంట బోదెలు చెత్త, చెదారంతో నిండిపోవడం, పూడికపోవడంతో శివారు రైతులకు నీరు అందడం లేదని వాపోతున్నారు.

Updated Date - 2022-03-16T06:28:42+05:30 IST