న్యాయం కావాలి

ABN , First Publish Date - 2022-12-13T00:26:09+05:30 IST

జిల్లాలో అమలవుతున్న ప్రభుత్వ సంక్షేమ అభివృద్ధి పనులు త్వరితగతిన ప్రజలకు చేరువకావడానికి అధికారులు క్షేత్రస్థాయిలో పర్యవేక్షణ చేపట్టాలని కలెక్టర్‌ ప్రసన్న వెంకటేష్‌ అధికారులను ఆదేశించారు. సోమవారం కలెక్టరేట్‌లో స్పందన కార్యక్రమం నిర్వహించారు. జేసీ అరుణ్‌బాబు, జడ్పీ సీఈవో రవికుమార్‌, డీఆర్‌డీఏ పీడీ విజయరాజు ఆయా శాఖల అధికారులు అర్జీలను స్వీకరించారు.

న్యాయం కావాలి
అర్జీలు స్వీకరిస్తున్న కలెక్టర్‌ ప్రసన్న వెంకటేష్‌, జేసీ అరుణ్‌బాబు తదితరులు

ఏలూరు కలెక్టరేట్‌, డిసెంబరు 12 : జిల్లాలో అమలవుతున్న ప్రభుత్వ సంక్షేమ అభివృద్ధి పనులు త్వరితగతిన ప్రజలకు చేరువకావడానికి అధికారులు క్షేత్రస్థాయిలో పర్యవేక్షణ చేపట్టాలని కలెక్టర్‌ ప్రసన్న వెంకటేష్‌ అధికారులను ఆదేశించారు. సోమవారం కలెక్టరేట్‌లో స్పందన కార్యక్రమం నిర్వహించారు. జేసీ అరుణ్‌బాబు, జడ్పీ సీఈవో రవికుమార్‌, డీఆర్‌డీఏ పీడీ విజయరాజు ఆయా శాఖల అధికారులు అర్జీలను స్వీకరించారు. స్పందన ద్వారా 277 అర్జీలు వచ్చాయి. ద్వారకా తిరుమల మండలం గుణ్ణంపల్లి పంచాయితీ పరిధిలో ఉన్న చెరువు ఆక్రమణకు గురైందని, దీంతో తాము ఇబ్బందులు పడుతున్నారని రైతులు ఫిర్యాదు చేశారు. తాళ్లముదునూరుపాడుకు చెందిన కొందరు తప్పుడు పత్రాలు సృష్టించి, తన భూమిని ఆక్రమించుకుని న్యాయం చేయాలంటూ కె.వెంకటలింగం అర్జీ పెట్టుకున్నారు. ఎంగిలిపాకలంక గ్రామానికి చెందిన తనకు భూసేకరణలో నష్టపరిహారం చెల్లించడంలో తప్పులు జరిగాయని, న్యాయం చేయాలని ఎం.రాజమ్మ కోరారు.

జూ పదేళ్ళుగా పరిష్కారం కాని సమస్య

‘అడంగల్‌ కోసం దరఖాస్తు చేస్తే పదేళ్ళుగా సమస్య పరిష్కారం కావడం లేదు. పెదపాడు మండలం అమ్మపాలెంలో తనకున్న పొలానికి అడంగల్‌ కోసం తహసీల్దార్‌ కార్యాలయంలో దరఖాస్తు చేసినా పట్టించుకోవడం లేదు. స్పందనలో ఇప్పటికి మూడు సార్లు ఫిర్యాదు చేశా. అధికారులే పట్టించుకోకపోతే ఎలా ? ’ అని లారిపాటి కాంతారావు వాపోయారు.

జూ తొమ్మిదిసార్లు ఫిర్యాదు చేశారు

‘ముసునూరు మండలం ఎల్లాపురంలో తన రొయ్యల చెరువును వైసీపీ నాయకులు ఆక్రమించేందుకు ప్రయత్నిస్తున్నారు. ఇదేమని ప్రశ్నిస్తే రూ.50 వేలు చెల్లించాలంటూ డిమాండ్‌ చేస్తున్నారు. కలెక్టరేట్‌లో ఇప్పటికి తొమ్మిదిసార్లు ఫిర్యాదు చేశా. ప్రజా ప్రతినిధుల ఒత్తిడితో పోలీసులు పట్టించుకోవడం లేదు. పైగా సీఐ, ఎస్‌ఐ వైసీపీ నాయకులకు వంతపాడుతున్నారు. తాము అక్కడ ఉండడం లేదని 20 ఎకరాలు కబ్జాకు యత్నించారు. ఆ స్థానంలోకి ఎవరు వెళ్ళడానికి వీలు లేదంటూ కోర్టు ఆర్డర్‌ ఉన్నా పట్టించుకోవడం లేదని ఫిర్యాదు చేశాను’ అని నూకల బాబూ రమేష్‌ చందు తెలిపారు.

జూ వేధింపులపై ఆందోళన

తప్పుడు ఫిర్యాదులతో పోలీసులు, అధికారులు తమను వేధిస్తున్నారని జీలుగుమిల్లి మండలం చంద్రమ్మ కాలనీకి చెందిన గిరిజనులు కలెక్టరేట్‌ వద్ద ధర్నా చేసి, న్యాయం కోసం కలెక్టర్‌కు వినతిపత్రం అందజేశారు. చంద్రమ్మ కాలనీలో 29 గిరిజన కుటుంబాల కు 69/1ఎ, 70/2ఎలో 42 ఎకరాల మెట్ట భూమిని ప్రభుత్వం పట్టాగా ఇచ్చింది. 70 ఏళ్ళకు పైగా సాగు చేసుకుంటూ 33 ఎకరాల్లో పామాయిల్‌ పంటను వేశారు. దీనిని ఉమ్మడి తోటగా పిలుస్తారు. 2017లో తమలో ఒకరైన చిర్రి కృష్ణకుమారి ఆమె భర్త వెంకటేశ్వరరావుకు కౌలుకు ఇచ్చాం. ప్రస్తుతం మరో వ్యక్తి తోటను కౌలుకు తీసుకున్నాడు. ఈ సమయంలో పామాయిల్‌ తోటను పంచాలంటూ కృష్ణకుమారి అధికారులకు ఫిర్యాదు చేశారు. సమష్టిగా తామే కౌలుకు తీసుకుని సాగు చేసుకుంటున్నామని వెంకటేశ్వరరావు అధికారులు మారినప్పుడల్లా తమపై తప్పుడు కేసులు పెడుతున్నాడని పొట్ట అప్పారావు, చిర్రి రామారావు, గ్రామస్థులు ఫిర్యాదు చేశారు.

Updated Date - 2022-12-13T00:26:09+05:30 IST

Read more