అసాంఘిక కార్యకలాపాలకు అడ్డాగా బస్‌ కాంప్లెక్స్‌

ABN , First Publish Date - 2022-09-28T05:43:36+05:30 IST

ఆర్టీసీ బస్‌ కాంప్లెక్స్‌ అసాంఘిక కార్యకలాపాలకు అడ్డాగా మారింది.

అసాంఘిక కార్యకలాపాలకు అడ్డాగా బస్‌ కాంప్లెక్స్‌
బస్‌ కాంప్లెక్స్‌లో మద్యం సిసాలు, గ్లాసులు

ఆవరణలో ధ్వంసమైన రోడ్లు.. కాంప్లెక్స్‌లో నిలపని బస్సులు

పోలవరం, సెప్టెంబరు 27: ఆర్టీసీ బస్‌ కాంప్లెక్స్‌ అసాంఘిక కార్యకలాపాలకు అడ్డాగా మారింది. ఆర్టీసీ అధికారుల నిర్లక్ష్యానికి నిలువెత్తు నిదర్శనంగా దర్శనమిస్తున్నది. కాంప్లెక్స్‌ ఆవరణలో రోడ్లు పునరుద్ధరణకు నోచుకోక బురదమయంగా మారడంతో ఆర్టీసీ సిబ్బంది బస్సులను కాంప్లెక్స్‌ ఆవరణలోకి తిప్పడం మానివేశారు. జనసంచారం, పరిశుభ్రత లేకపోవడం వలన బస్‌ కాంప్లెక్స్‌ అసాంఘిక కార్యకలాపాలకు అడ్డాగా మారింది. సమీపంలో ఉన్న మద్యం షాపు నుంచి మద్యం కొనుగోలు చేసుకున్న మందుబాబులు బస్‌ కాంప్లెక్స్‌లో సిట్టింగ్‌ వేసి మద్యం సీసాలు అక్కడే బద్దలుకొట్టి ఖాళీ వాటర్‌ ప్యాకెట్లు, మందు గ్లాసులు వేసి డంపింగ్‌ యార్డులా మారుస్తున్నారు.  ఇక పోలవరం రాకపోకలు సాగించే ఆర్టీసీ డ్రైవర్లు, కండక్టర్లు బస్సులను నిర్దేశించిన బస్‌ షెల్టర్‌ వద్ద నిలపకుండా స్థానిక భాను థియేటర్‌ సమీపంలో నిలిపి కాలయాపన చేసి బస్‌ షెల్టర్‌ వద్ద మాత్రం క్షణకాలం కూడా నిలపకుండా ప్రయాణికులకు ఎక్కే అవకాశం కూడా లేకుండా వేగంగా తరలిపోతున్నారని ప్రయాణికులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. అధికారులు స్పందించి బస్‌ కాంప్లెక్స్‌ని పునరుద్ధరించాలని, బస్సులు బస్‌ షెల్టర్‌ వద్ద నిలిపేలా చర్యలు తీసుకోవాలని కోరుతున్నారు.


Updated Date - 2022-09-28T05:43:36+05:30 IST