క్షేత్రస్థాయిలోకి..

ABN , First Publish Date - 2022-03-04T05:42:27+05:30 IST

పోలవరం ప్రాజెక్టు పురోగతి, పునరావాస కాలనీల్లో నిర్వాసి తుల కోసం తీసుకుంటున్న చర్యల పరిశీలనకు సీఎం జగన్మోహన్‌ రెడ్డి, కేంద్ర జలశక్తి మంత్రి గజేంద్ర సింగ్‌ షకావత్‌ నేడు పర్యటనకు రానున్నారు.

క్షేత్రస్థాయిలోకి..

నేడు పోలవరానికి సీఎం జగన్‌, కేంద్ర మంత్రి షెకావత్‌

చల్లావారిగూడెం ఆర్‌అండ్‌ఆర్‌ కాలనీల సందర్శన

పునరావాసం పరిశీలన.. నిర్వాసితులతో ముఖాముఖి

పోలవరం ప్రాజెక్టు పురోగతి వీక్షణ.. పటిష్ట భద్రత


పోలవరం ప్రాజెక్టు పురోగతి, పునరావాస కాలనీల్లో నిర్వాసి తుల కోసం తీసుకుంటున్న చర్యల పరిశీలనకు సీఎం జగన్మోహన్‌ రెడ్డి,  కేంద్ర జలశక్తి మంత్రి గజేంద్ర సింగ్‌ షకావత్‌ నేడు పర్యటనకు రానున్నారు. ఈ మేరకు కాలనీ ల్లోని నిర్వాసితులతో ముఖాముఖి మాట్లాడబోతున్నారు. నిర్వాసితుల సమస్యలను తెలుసుకోనున్నారు. అలాగే పోల వరం ప్రాజెక్టును సందర్శించనున్నారు. సీఎం పర్యటన నేపథ్యంలో భారీ భద్రత ఏర్పాట్లు చేశారు.


ముఖ్యమంత్రి ఐదోసారి పర్యటన 

సీఎం జగన్మోహన్‌ రెడ్డి ఐదోసారి పోలవరం ప్రాజెక్టును సందర్శించను న్నారు. ఇప్పటికే ఆయన నాలుగు విడతలుగా ప్రాజెక్టును సందర్శించి పనుల పురోగతిని సమీక్షిం చారు. కరోనా కారణంగా పనుల పురోగతిలో కాస్తంత వెనుకంజ కనిపిం చింది. ఇతర రాష్ట్రాలకు చెందిన కార్మికులు పోలవరం నిర్మాణ పనుల్లో పాల్గొనకుండా వెనక్కి తగ్గడమే ఇందుకు కారణం. ఇప్పుడు కరోనా తీవ్రత తగ్గుముఖం పట్టిన కారణంగా ఈ పనులు పుంజుకోవడానికి మార్గం సుగమమైంది. అయినప్పటికీ స్పిల్‌వే ఐదు గేట్లను ఇప్పటికీ ఏర్పాటు చేయలేదు. 


(ఏలూరు–ఆంధ్రజ్యోతి) 

వాస్తవానికి పోలవరం, బుట్టాయిగూడెం, జీలుగుమిల్లి, జంగా రెడ్డిగూడెం పరిధిలో సహాయ పునరావాస కాలనీల నిర్మాణానికి వీలుగా ఇప్పటికే భూసేకరణ పూర్తి చేశారు. గడిచిన ఐదేళ్లుగా కాలనీలన్నీ పూర్తి చేసి, మౌలిక వసతులు కల్పించి నిర్వాసితులకు కొత్త జీవితం అందిం చేందుకు ప్రణాళికలు వేశారు. కాని ఇప్పటి వరకు అవేవీ తుది దశకు చేరుకోలేదు. గడిచిన మూడేళ్లుగా ఇది మరింత జాప్యానికి దారి తీసింది. ఒకప్పుడు తెలుగుదేశం ప్రభుత్వ హయాంలో కుక్కునూరు, వేలేరుపాడు ముంపు నిర్వాసితు లందరికీ తాడువాయి సమీపాన చల్లావారిగూడెంలో పెద్ద ఎత్తున ఇళ్ల నిర్మాణానికి శ్రీకారం చుట్టారు. అక్కడే తగినన్ని మౌలిక వసతులు కల్పించాలని ప్రణాళిక సిద్ధం చేశారు. ఎడాపెడా ఒకదాని వెంట మరొకటి కాలనీల నిర్మాణానికి శ్రద్ధ పెట్టినా అనుకున్న ప్రయోజనం మాత్రం సాగలేదు. వాస్తవానికి  గిరిజనేతర కుటుంబాలన్నీ ఒకే చోట నివసించేలా ఈ కాలనీల నిర్మాణం లక్ష్యం. దీనిలో భాగంగానే తొలుత అన్ని సవ్యంగా సాగినా ఆపై ఆటం కాలు వెన్నాడాయి. నిధుల కొరత ఎదురైంది. జిల్లా స్థాయిలో కాలనీలు నిర్మించేందుకు యంత్రాంగం తగిన దృష్టి పెట్టలేదు. ఆయా బాధ్యత గల శాఖలు ఆ వైపు తొంగి చూడలేదు. ఈ మధ్యనే ఇంతకుముందు నిర్మించిన ఇళ్లకు మాత్రం రంగులు వేసి ఇప్పుడు కొత్తగా చూపించబో తున్నారు. ఆ కాలనీల్లోనే కేంద్ర మంత్రి షకావత్‌, సీఎం జగన్మోహన్‌ రెడ్డి నేడు పర్యటించనున్నారు.


నిర్వాసితుల వాదన ఇది..

పోలవరం ప్రాజెక్టు ముంపు నుంచి తమను కిలోమీటర్ల కొద్ది తరలించి పరాయి ప్రాంతంలో పడేస్తే ఆపై జీవనం ఏమిటనేదే ప్రశ్న. ఈ ప్రశ్నకు ఇప్పటికీ బదులివ్వలేదు. ఒక్క చల్లావారిగూడెం కాలనీల్లోనే గిరిజనేతర కుటుంబాలు భారీగా ఉండాలని నిర్దేశిస్తే అందుకు అనుగుణంగా ప్రణాళికలేవీ లేవు. ఈ కుటుంబాలన్నీ కూలీనాలీ చేసుకుని బతికేందుకు కూడా అవకాశం లేదు. భూమికి భూమి పథకం కింద కాస్తంత దూరంలోనే కేటాయించగా, అక్కడి నుంచి ఇక్కడికి రాకపోకలు సాగించాలన్నా అంత సులభంగా లేదు. సొంతగా ఇల్లు నిర్మించుకుంటామన్న వారికి 2 లక్షల 80 వేల రూపాయలు ఇవ్వడానికి ప్రభుత్వం ముందుకు వచ్చింది. అయితే సత్ఫలితాలను సాధించలేకపోయారు. నిర్వాసితు ల నిరాశ, నిస్పృహ, అధికారుల నిర్లక్ష్యం దీనికి తోడైంది. జీలుగుమిల్లి, బుట్టాయిగూడెం, పోలవరం మండలాల పరిధిలో నిర్మించిన కాలనీల్లో ఇప్పటికే కొందరు చేరిపోయారు. ఇంకొంతమంది చేరాల్సి ఉంది. చేరిన వారంతా అంతృప్తితోనే కాలం గడుపుతున్నారు. అమోఘమైన మౌలిక వసతులు కల్పిస్తామని ఊదరగొట్టినా ఇప్పటివరకు ఆ ఛాయలేవీ కనిపించకపోవడమే దీనికి ప్రధాన కారణం. 


 సీఎం పర్యటన ఏర్పాట్ల పరిశీలన

జంగారెడ్డిగూడెం/ పోలవరం, మార్చి 3: జంగారెడ్డిగూడెం మండలం తాడువాయి పంచాయతీ చల్లావారిగూడెం ఆర్‌అండ్‌ఆర్‌ కాలనీని సీఎం సందర్శించనున్న నేపథ్యంలో మంత్రి శ్రీరంగనాథరాజు ఎమ్మెల్యేలు వీఆర్‌ ఎలీజా, తెల్లం బాలరాజు, ఆర్‌అండ్‌ఆర్‌ ప్రత్యేక అధికారి ఒ.ఆనం ద్‌లతో కలసి హెలిప్యాడ్‌, నిర్వాసితులతో మాట్లాడే ప్రాంతాల వద్ద ఏర్పాట్లను గురువారం పరిశీలించారు. మంత్రి మాట్లాడుతూ  సీఎం ప్రాజెక్టు పరిశీలనతో పాటు చల్లావారిగూడెం, తూర్పు గోదావరి జిల్లా ఇందుకూరుపేట కాలనీల్లో పర్యటించి నిర్వాసితులతో మాట్లాడతార న్నారు. మంత్రి వెంట ఆర్డీవో ప్రసన్నలక్ష్మి తదితరులు ఉన్నారు.


పటిష్ట బందోబస్తు : డీఐజీ

సీఎం, కేంద్ర మంత్రి పర్యటనకు సంబంధించి పటిష్ట బందో బస్తు ఏర్పాటు చేసినట్టు ఏలూరు రేంజ్‌ డీఐజీ కేవీ మోహన్‌రావు పేర్కొన్నారు. గురువారం సాయంత్రం చల్లావారి గూడెం ఆర్‌ఆర్‌ కాలనీలో సీఎం పర్యటన ఏర్పాట్లను ఆయన పరిశీలించారు.  తాడువాయిలోని కల్యాణ మండపంలో పోలీసు సిబ్బందితో సమా వేశమయ్యారు. కాగా సీఎం పర్యటన నేపథ్యంలో గురువారం ఉదయానికే పోలవరం ప్రాజెక్టు వద్దకు  పోలీసు బలగాలు చేరుకు న్నాయి.  పోలవరం ఎమ్మెల్యే తెల్లం బాలరాజు, అధికారులు ప్రాజెక్టు వద్ద సీఎం పర్యటించనున్న ప్రాంతాలను పరిశీలించారు. 


Updated Date - 2022-03-04T05:42:27+05:30 IST