పాత బిల్లులకే దిక్కు లేదు..

ABN , First Publish Date - 2022-05-30T05:56:56+05:30 IST

ప్రతీసారి కాలువల నిర్వహణలో సర్కారు తప్పటడుగులు వేస్తూనే ఉంది.

పాత బిల్లులకే దిక్కు లేదు..

ఐదేళ్లుగా పేరుకుపోయిన ఓఅండ్‌ఎం బకాయిలు

చేసిన పనులకే సంవత్సరాల తరబడి వేధింపులు

తాజాగా కొత్త పనులకు టెండర్లు

సిద్ధపడని కాంట్రాక్టర్లు

ఈ ఖరీఫ్‌లోనూ రైతుకు కష్టాలే 


పంట సీజన్‌ దగ్గరపడింది. తొలకరి ఆరంభమైతే కర్షకులంతా పొలాల్లోకి దిగుతారు. ఈలోపే కాల్వల మరమ్మతులు పూర్తిచేయాలి. సాగునీరు సాఫీగా ప్రవహించేలా చూడాలి.   కానీ ఈ ఏడాది సర్కారు పాత పాటే పాడుతున్నది. గతేడాది కాల్వల నిర్వహణకు వీలుగా దాదాపు రూ.63 కోట్లు కాంట్రాక్టర్లకు బకాయి పడగా ఇప్పుడు మరో రూ.14 కోట్లు కాలువల మరమ్మతుల కోసం టెండర్లు పిలిచారు. అయిన పనులకే సొమ్ములు చెల్లించలేక చేతులెత్తేసిన సర్కారు ఇప్పుడెలా కొత్త పనులు చేపడు తుందంటూ కాంట్రాక్టర్లను నిలదీస్తున్నారు. జూన్‌ ఫస్ట్‌ నుంచి నీరు విడుదల చేస్తామని చెబుతూనే మరోవైపు  టెండర్లకు సిద్ధమవడంపై  అనుమానాలు తలెత్తుతున్నాయి. 


(ఏలూరు–ఆంధ్రజ్యోతి ప్రతినిధి) 

ప్రతీసారి కాలువల నిర్వహణలో సర్కారు తప్పటడుగులు వేస్తూనే ఉంది. గడిచిన ఐదేళ్ళుగా కాల్వల్లో సాగునీరు సాఫీగా శివారు ప్రాంతానికి చేరే విధంగా ఎలాంటి ఆటంకాలు లేకుండా ముందుగానే కార్యాచరణ రూపొందించుకుని ఆ మేరకు అంతా సర్దుబాటు చేయాల్సిన యంత్రాంగం మీనమేషాలు లెక్కిస్తూ వచ్చింది. గడిచిన ఐదేళ్లల్లో ఇప్పుడు కొత్తగా ఏర్పడిన ఏలూరు జిల్లా పరిధిలో కాంట్రాక్టర్లకు చెల్లించాల్సిన మొత్తమే భారీగా ఉంది. సరాసరిన 63 కోట్ల రూపాయలు ప్రభుత్వం పెండింగ్‌లో పెట్టింది. మంత్రులు, ఎమ్మెల్యేల ఒత్తిడితో ఓఅండ్‌ఎం పనులను చేపట్టిన కాంట్రాక్టర్లు చివరకు విసుగెత్తిపోయారు. అతికొద్ది పనులు చేయడానికి కాస్తంత ముందుకు వచ్చినా చేసిన పనులకు బిల్లులు చెల్లించాల్సింది పోయి కిమ్మనకుండా ఉండిపోయారు. 2018లో దాదాపు మూడు కోట్ల పనులకు బిల్లులు చెల్లించాల్సి ఉండగా, అదే 2020–21లో దాదాపు 15 కోట్లకు చెల్లింపులకు ఇదే గతి. వాస్తవానికి డెల్టా కాలువల్లో చిన్నా చితక మరమ్మతు పనులను అప్పటికప్పుడు చేపట్టి పూర్తి చేస్తారు. కానీ ఈ ఐదేళ్లల్లో కాంట్రాక్టర్లను మార్చి మార్చి పనుల్లోకి దింపినా చివరకు సర్కారు చెల్లింపులు చేయక అందరి చేతులు కాలాయి. పశ్చిమ డెల్టాలోని గోదావరి కాలువ పరిధిలో భీమవరం, గణపవరం, నిడమర్రు, ఉంగుటూరు, దెందులూరు, ఏలూరు, పెదపాడు వంటి ప్రాంతాలు వస్తాయి. కృష్ణ, తూర్పు డెల్టా పరిధిలో ఉన్న కాలువల పరిధిలో కైకలూరు, కలిదిండి, మండవల్లి, ముదినేపల్లితో సహా పాత పశ్చిమ జిల్లాలో ఉన్న ఉంగుటూరు, ఏలూరు, దెందులూరు నియోజకవర్గాల్లోని మండలాలు చేరతాయి. ఇలాంటి చెల్లింపులు జరగని పరిస్థితుల నుంచి బయటపడేందుకు ఇప్పటివరకు ఎమ్మెల్యేలు, మంత్రులు చొరవ తీసుకోకపోవడం ఒక కారణమైతే అంతకంటే మించి ఖజానా లోటు కూడా ఈ బిల్లులను క్లియర్‌ చేయకుండా అడ్డుగా మారింది. ఇప్పటికే చేయాల్సిదంతా చేశాం, మళ్ళీ కొత్త పనులు చేసే శక్తి లేదంటూ ఇప్పటికే కాంట్రాక్టర్లు చేతులెత్తేసే పరిస్థితి నెలకొన్నది. కాని ఎట్టి పరిస్థితుల్లోనూ కాల్వలకు ఒక రూపు ఇచ్చి ఆ మేరకు అంతా సాఫీగా సాగునీరు అందేలా చూడాలనేది సమీక్షా సమావేశాల్లో మంత్రులు, ఎమ్మెల్యేలు చెబుతున్న మాటలు. అయినప్పటికీ ఇప్పుడు ఆ పరిస్థితి ఏ మాత్రం కనిపించడం లేదు. 


ఇప్పుడు కొత్త పనులెలా...

ఇప్పటికే కాల్వలకు నీరు విడుదల చేసే గడువు దగ్గరపడగా ఆ మేరకు ఆటంకాలు తొంగి చూస్తున్నాయి. ఇప్పటికే పేరుకుపోయిన బకాయిలతో కాల్వల పనులు నిర్వహించేందుకు కాంట్రాక్టర్లు వెనుకంజ వేస్తుండగా, ఇదేమీ పట్టని ఇంజనీర్లు మాత్రం తమ పరిధిలో ఉన్నట్టుగా ఈసారి కూడా ఏలూరు జిల్లా పరిధిలోని గోదావరి పశ్చిమ డెల్టాకు, కృష్ణా తూర్పుడెల్టా కాలువల మరమ్మతులకు సిద్ధమవుతున్నారు. ఈ మధ్యన జరిగిన సాగునీటి సలహా మండలి సమావేశంలో ఈ మేరకు కీలక నిర్ణయాలు తీసుకున్నారు.  ఏలూరు గోదావరి కాలువ పరిధిలో కాలువల్లో 22 పనులకు 3 కోట్ల 22 లక్షలతో టెండర్లు పిలుస్తున్నట్టు వెల్లడించారు. అలాగే డ్రెయిన్స్‌లో మరో 25 పనులకు 3 కోట్ల 96 లక్షలు మొత్తం మీద కలిపి ఈ రెండింటిలో 47పనులకు ఏడు కోట్లకుపైబడి టెండర్ల ప్రక్రియ ఇప్పటికే అమలులోకి తెచ్చినట్టు అధికారులు ప్రకటించారు. తూర్పు కృష్ణా డెల్టా పరిధిలో కాలువల్లో 27 పనులకు 4 కోట్లకుపైగా, డ్రెయిన్లలో 14 పనులకు మూడు కోట్లకుపైగా మొత్తం మీద 41 పనులకు మరో ఏడు కోట్లు వెచ్చించేందుకు సిద్ధమవుతున్నారు. కాని ఇప్పటికే కాంట్రాక్టర్లు పాత బిల్లులకు మోక్షం లేక చతికిలపడగా, మళ్లీ కొత్త పనులకు సిద్ధపడేవారెందరనేదే ఇప్పుడు అనుమానంగా మారింది. ఇప్పటికే రాష్ట్ర ప్రభుత్వం ఆర్థిక లోటుతో అనేక బిల్లులను ఎక్కడిక్కడ నిలిపివేస్తుండగా ఇప్పుడు ఇది సాధ్యమా అనే ప్రశ్న తలెత్తుతుంది. ఇదే విషయాన్ని కాంట్రాక్టర్లు సైతం ప్రస్తావిస్తున్నారు. ఇప్పటికిప్పుడు అప్పులు తెచ్చి పనులు చేసినా తమకు వడ్డీలు కూడా మిగలవనే ఆందోళన వ్యక్తం చేస్తున్నారు.


Updated Date - 2022-05-30T05:56:56+05:30 IST