Chandrababu : రాష్ట్రానికి ‘ఇదేం ఖర్మ’

ABN , First Publish Date - 2022-11-30T03:54:35+05:30 IST

‘ఇదేం ఖర్మ ఈ రాష్ట్రానికి’ కార్యక్రమాన్ని తెలుగుదేశం పార్టీ బుధవారం ప్రారంభించనుంది. ఆ పార్టీ అధినేత చంద్రబాబు దీనిని

Chandrababu : రాష్ట్రానికి ‘ఇదేం ఖర్మ’

నేటి నుంచి 50 రోజులపాటు టీడీపీ కార్యక్రమం

ఏలూరు జిల్లా విజయరాయిలో ప్రారంభించనున్న చంద్రబాబు

50 రోజులు-50 లక్షల కుటుంబాలే టార్గెట్‌

8 వేలమందితో ప్రత్యేక బృందాలు సిద్ధం

నిర్దిష్ట సమస్యలపై ఇంటింటా ప్రచారం

ప్రతిష్ఠాత్మకంగా తీసుకున్న అధిష్ఠానం

ప్రతి ఒక్క ఇన్‌చార్జీ పాల్గొనాలని ఆదేశాలు

బాగా చేస్తేనే పరిస్థితి పదిలమని స్పష్టీకరణ

గోదావరి జిల్లాల్లో 3 రోజుల బాబు పర్యటన

అమరావతి, ఏలూరు, నవంబరు 29 (ఆంధ్రజ్యోతి): ‘ఇదేం ఖర్మ ఈ రాష్ట్రానికి’ కార్యక్రమాన్ని తెలుగుదేశం పార్టీ బుధవారం ప్రారంభించనుంది. ఆ పార్టీ అధినేత చంద్రబాబు దీనిని ఏలూరు జిల్లా దెందులూరు నియోజకవర్గం విజయరాయి గ్రామంలో లాంఛనంగా ప్రారంభించనున్నారు. రాష్ట్రవ్యాప్తంగా శుక్రవారం అన్ని నియోజకవర్గాల్లో దీనిని ప్రారంభించాలని నిర్ణయించారు. ఈ కార్యక్రమంలో భాగంగా ఏభై రోజుల్లో ఏభై లక్షల కుటుంబాలను కలవాలని ఆ పార్టీ లక్ష్యంగా పెట్టుకొంది.

దీని కోసం మొత్తం ఎనిమిది వేల పార్టీ బృందాలను నియమించారు. వీరికి ఇప్పటికే అన్ని నియోజకవర్గాల్లో శిక్షణ కార్యక్రమాలు కూడా నిర్వహించారు. ప్రచార వీడియోలను ప్రత్యేకంగా రూపొందించి సామాజిక మాధ్యమాల్లో ప్రచారం చేస్తున్నారు. కొన్ని పాటలు కూడా దీని కోసం విడుదల చేసే ప్రయత్నం జరుగుతోంది. పార్టీ నేతలకు అవసరమైన సమాచారం... ప్రతి ఇంటా ఇవ్వాల్సిన కరపత్రాలు కూడా సిద్ధం చేసి అన్ని నియోజకవర్గాలకు పంపారు. బాదుడే బాదుడు పేరుతో ఆ పార్టీ సుమారు ఏడెనిమిది నెలలపాటు ప్రజల్లోకి వెళ్లి ఇంటింటి ప్రచారం చేసింది. దానితో పోలిస్తే ఈసారి ‘ఇదేం ఖర్మ....’ కార్యక్రమాన్ని కొంత విభిన్నంగా రూపొందించారు. ఏడెనిమిది ముఖ్యమైన ప్రజా సమస్యలను ఎంచుకొని వాటిపై ప్రతి ఇంటా వివరించాలని నిర్ణయించారు.

మిస్‌ కాకుండా మిస్డ్‌ కాల్‌..

టీడీపీ బృందాలు నిజంగా ప్రతి ఇంటికి వెళ్లిందీ లేనిదీ తెలుసుకోవడానికి కొత్త పద్ధతి తెచ్చారు. ఒక మిస్డ్‌కాల్‌ సర్వీస్‌ ఫోన్‌ నంబర్‌ ఏర్పాటు చేశారు. తాము వెళ్లిన ఇంటి వారినుంచి ఆ నంబర్‌కు టీడీపీ బృందాలు ఒక మిస్డ్‌కాల్‌ చేయిస్తే ఆ ఇంటికి వెళ్లినట్లు పార్టీ అధిష్ఠానానికి తెలుస్తుంది. మొత్తం పార్టీ నేతలంతా ఈ కార్యక్రమంలో భాగస్వాములు కావాలని నాయకత్వం ఆదేశించింది.

చంద్రబాబు రోడ్‌మ్యాప్‌...

‘ఇదేం ఖర్మ ఈ రాష్ట్రానికి’ కార్యక్రమంలో భాగంగా టీడీపీ అధినేత చంద్రబాబు బుధవారం నుంచి మూడు రోజులపాటు ఉభయ గోదావరి జిల్లాల్లో పర్యటించనున్నారు. బుధవారం ఆయన అమరావతిలోని తన నివాసం నుంచి బయలుదేరి కలపర్రు టోల్‌గేట్‌ మీదుగా పెదవేగి మండలం విజయరాయి గ్రామం వెళ్తారు. అక్కడ బహిరంగ సభలో పాల్గొంటారు. అక్కడ నుంచి వలసపల్లి క్రాస్‌ రోడ్‌ మీదుగా చింతలపూడి పట్టణానికి వెళ్తారు. మార్గమధ్యంలో ధర్మాజిగూడెం, మఠంగూడెం, లింగపాలెం గ్రామాల్లో ప్రజలను ఉద్దేశించి మాట్లాడతారు. సాయంత్రం 7గంటలకు చింతలపూడిలో జరిగే బహిరంగ సభలో పాల్గొంటారు. అక్కడ నుంచి కొయ్యలగూడెం మండలం నరసన్నపాలెం గ్రామానికి చేరుకొని దండమూడి రామలక్ష్మి ఫంక్షన్‌ హాల్లో రాత్రి బస చేస్తారు. గురువారం ఉదయం పదిన్నర గంటలకు అక్కడ నుంచి బయలుదేరి కొయ్యలగూడెం, కన్నాపురం, కేఆర్‌ పురం ఐటీడీఏ, పట్టిసీమ మీదుగా పోలవరం గ్రామం చేరుకొంటారు. మధ్యాహ్నం మూడు గంటలకు బహిరంగ సభ జరుగుతుంది. అక్కడ నుంచి తాడిపూడి, వేగేశ్వరపురం, కుమారదేవం మీదుగా ఆయన కొవ్వూరు పట్టణం చేరి అక్కడ రోడ్‌ షోలో పాల్గొంటారు. రాత్రి 8గంటలకు బహిరంగ సభలో ప్రసంగిస్తారు. ఆ రాత్రి అక్కడే బసచేస్తారు. శుక్రవారం ఉదయం నిడదవోలు వెళ్తారు. రోడ్‌ షోలో పాల్గొని బహిరంగ సభలో ప్రసంగిస్తారు. మధ్యాహ్నం 4 గంటలకు నిడదవోలు నుంచి తాడేపల్లి గూడెం మండలం నవాబుపాలెం గ్రామం వెళ్లి రైతులతో సమావేశమవుతారు. అక్కడ నుంచి తాడేపల్లిగూడెం చేరి అక్కడ రోడ్‌షోలో పాల్గొని బహిరంగ సభలో ప్రసంగిస్తారు. గ్రామగ్రామాన కార్యకర్తలు, నేత లు ఎక్కడికక్కడ చంద్రబాబు పర్యటనకు ఏర్పాట్లు చేశారు. బుధవారం ఉదయం కలపర్రు చెక్‌ పోస్టు నుంచి విజయరాయి వరకు వేల మోటారు సైకిళ్లతో ర్యాలీగా వెళ్లి చంద్రబాబుకు స్వాగతం పలికేందుకు కార్యకర్తలు సన్నాహాలు చేశారు.

ఆటంకాలకు వైసీపీ కుట్రలు..

చంద్రబాబు పర్యటన షెడ్యూల్‌ వెలువడిన వెంటనే అధికార వైసీపీ ఎమ్మెల్యేలంతా అప్రమత్తమయ్యారు. ఎక్కడికక్కడ ఆటంకాలు కలిగించేందుకు ప్రయత్నాలు మొదలెట్టారు. విజయరాయిలో ఒకరోజు ముందుగా వైసీపీ ఎమ్మెల్యే కొఠారు అబ్బయ్యచౌదరి ప్రగతి బాట పేరిట హంగామా సృష్టించారు. చంద్రబాబు ప్రయాణించే మార్గాలన్నింటిలోనూ వైసీపీ ఫ్లెక్సీలు, జెండాలతో నింపేశారు. కల్వర్టులకూ వైసీపీ రంగులు పులిమారు. చింతలపూడి నుంచి ఏలూరు వస్తున్న ఆర్టీసీ బస్సులనూ దారి మళ్లించడంతో ప్రయాణికులు పోలీసులతో వాగ్వాదానికి దిగారు. పోలీసులు సైతం ఏకపక్షంగా ఉండటంతో టీడీపీ కార్యకర్తలు అప్రమత్తంగా ఉండాల్సిందిగా సీనియర్లు పిలుపునిచ్చారు.

Updated Date - 2022-11-30T03:54:36+05:30 IST