-
-
Home » Andhra Pradesh » West Godavari » teachers attendance problems second day at eluru dist-MRGS-AndhraPradesh
-
హాజరుకే రెండున్నర గంటలు
ABN , First Publish Date - 2022-08-18T05:06:50+05:30 IST
ఆన్‌లైన్‌లో ముఖ హాజరు విధానంపై ఉపాధ్యాయులు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. ఈ హాజరుకే సమయమంతా గడిచి పోతుండగా, విద్యార్థులకు చదువు చెప్పే అవకాశమే ఉండడం లేదని ఉపాధ్యా యులు ఆవేదనగా చెబుతున్నారు

అటెండెన్స్ కోసం రెండోరోజూ ఉపాధ్యాయులకు తప్పని ఇబ్బందులు
చదువు చెప్పే అవకాశం ఉండడం లేదంటూ ఆవేదన
పెదవేగి, ఆగస్టు 17 : ఆన్‌లైన్‌లో ముఖ హాజరు విధానంపై ఉపాధ్యాయులు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. ఈ హాజరుకే సమయమంతా గడిచి పోతుండగా, విద్యార్థులకు చదువు చెప్పే అవకాశమే ఉండడం లేదని ఉపాధ్యా యులు ఆవేదనగా చెబుతున్నారు. పెదవేగి మండలంలోని పలు గ్రామాల్లో ఉపాధ్యాయులు ముఖహాజరు కోసం గంటల తరబడి నిరీక్షించాల్సిన దుస్థితి నెలకొంది. మండల కేంద్రానికి కిలోమీటరు దూరంలోని లక్ష్మీపురంలో మండల పరిషత్ ప్రాథమికోన్నత పాఠశాలలో ఉపాధ్యాయులు ముఖ హాజరును నమోదు చేసుకోవడానికి ఏకంగా రెండున్నర గంటల సమయం పట్టింది. తొలిరోజు మంగళవారం ఎదురైన సర్వర్ సమస్యను దృష్టిలో పెట్టుకుని ఉపాధ్యాయులు బుధవారం మరింత ముందుగానే పాఠశాలకు చేరుకుని, సర్వర్‌తో కుస్తీలు పట్టారు. ఉదయం ఎనిమిదిన్నర గంటలకు ప్రారంభమైన ముఖహాజరు పదకొండు గంటలకుగానీ నమోదు కాలేదు. దాదాపు రెండున్నర గంటలపాటు కుస్తీలు పడితేగానీ తాము పాఠశాలకు వచ్చినట్టుగా నమోదు కాలేదు. అయితే అధికారులు ఇచ్చిన తొమ్మిది గంటల సమయం దాటి రెండున్నర గంటల తరువాత సర్వర్‌లో తమ హాజరు నమోదు కావడంతో ఉపాధ్యాయులు ఒకింత ఆందోళనతో ఉన్నారు. ఈరోజు తాము పాఠశాలలో పనిచేసినట్టా కాదా.. అనే మీమాంసతో కొట్టుమిట్టాడుతున్నారు. సమయానికి ముఖ హాజరు పడకపోవడానికి కారణం సర్వర్ సమస్య. కానీ మాపై నిందలు పడే అవకాశం లేకపోలేదని ఉపాధ్యాయులు విచారం వ్యక్తం చేస్తున్నారు.
ఉపాధ్యాయుల బాయ్‌కాట్
కామవరపుకోట, ఆగస్టు 17 : కామవరపుకోట మండలంలోని ఉపాధ్యాయులు యాప్ ద్వారా హాజరువేయాలనే నిబంధనను వ్యతిరేకిస్తూ బుధవారం ఉపా ధ్యాయులు ఈ ప్రక్రియను బాయ్‌కాట్ చేశారు. ఉపాధ్యాయ సంఘ నాయకులు మాట్లాడుతూ ఈ విధానాన్ని రద్దు చేయాలని కోరారు. యాప్ ద్వారా హాజరు వేసే పద్ధతికి స్వస్తి చెప్పే వరకు పోరాటం కొనసాగిస్తామని హెచ్చరించారు.
24 మందిలో ఇద్దరికే హాజరు..
గణపవరం, ఆగస్టు 17 : గణపవరం బాలుర హైస్కూల్ ఉపాధ్యాయులు లాగిన్ నుంచి యాప్ రిజిస్ర్టేషన్ చేసుకోవడానికి బుధవారం ప్రయత్నించారు. సర్వర్ పని చేయకపోవడంతో యాప్ డౌన్‌లోడ్ కాలేదు. 24 మంది ఉపాధ్యాయులకు గాను ఇద్దరికి మాత్రమే యాప్ పని చేసింది. 22 మందికి యాప్ పని చేయకపోవడంతో వివరాలు నమోదు చేసుకోలేకపోయారు. మండలంలోని పలు పాఠశాలల్లో సర్వర్ సక్రమంగా పని చేయకపోవడంతో ఇబ్బందులు ఎదుర్కొన్నారు.