నోరు అదుపులో పెట్టుకోండి

ABN , First Publish Date - 2022-03-23T06:30:28+05:30 IST

‘తణుకు మున్సిపాలిటీలో రూ.390 కోట్ల టీడీఆర్‌ బాండ్ల స్కాం ఎమ్మెల్యే కారుమూరి నాగేశ్వరరావు ఆధ్వర్యంలోనే జరిగింది.

నోరు అదుపులో పెట్టుకోండి

మీలా మేం బ్యాంకులకు టోపీ పెట్టలేదు

టీడీఆర్‌ స్కామ్‌పై సిటింగ్‌ జడ్జితో విచారణ జరిపించండి 

ఎమ్మెల్యే కారుమూరికి ఆరిమిల్లి కౌంటర్‌

తాడేపల్లిగూడెం, మార్చి 22(ఆంధ్ర జ్యోతి): ‘తణుకు మున్సిపాలిటీలో రూ.390 కోట్ల టీడీఆర్‌ బాండ్ల స్కాం ఎమ్మెల్యే కారుమూరి నాగేశ్వరరావు ఆధ్వర్యంలోనే జరిగింది. ఈ అవినీతిని కప్పిపుచ్చుకోవడానికి నోటికొచ్చినట్లు మాట్లాడటం సరికాదు’ అని కారుమూరి తనపై చేసిన వ్యాఖ్యలపై ఆరిమిల్లి రాధాకృష్ణ మంగళవారం ఓ ప్రకటనలో కౌంటర్‌ ఇచ్చారు. ‘మూడేళ్లుగా మునిసిపాలిటీలో ఏ పనిచేసినా, ఏ కార్యక్రమం చేపట్టినా అన్నీ ఆయన కనుసన్నల్లోనే జరిగాయి. ప్రజల డబ్బును మీరు, మీ బినామీలు దోచుకోవడం వాస్తవం కాదా ? నియోజకవర్గంలోని ఎండీవోలు, తహసీల్దార్లు మీ కనుసన్నల్లోనే పనిచేయడం వాస్త వం కాదా ? చేతిలో అధికారం ఉంది కదాని.. అధికార దర్పం తో అధికారులను భయపెట్టి, వారిని చెప్పు చేతల్లో పెట్టుకున్నా రు. టీడీఆర్‌ స్కాం టీడీపీ వాళ్లు ఉన్నారని నోటితో చెప్పడం కాదు.. సీఎంతో చెప్పి సిట్టింగ్‌ జడ్జితో విచారణ జరిపించండి. వాస్తవాలు బయటపడతాయి. కరోనా సమయంలో కే టాక్స్‌ పేరిట ప్రజల వద్ద ఎంత దోచుకున్నారో అందరికీ తెలుసు. నన్ను, నా కుటుంబసభ్యులను ఉద్దేశించి మాట్లాడేస్థాయి నీది కాదు. మేం ఉంటున్న ఇంటి సమీపంలోని స్థలాన్ని మా తాతయ్య హయాంలో దేవదాయ శాఖ వేలం వేస్తే ఎవరో కొనుకున్నారు. వారి వద్ద రైస్‌మిల్‌ కోసం మేం కొన్నాం. అంతే తప్ప మీలా బ్యాంకుల్లో రుణాలు తీసుకుని టోపీలు పెట్టలేదు. నోరు అదుపులో పెట్టుకుని మాట్లాడండి’ అంటూ ఆ ప్రకటనలో హెచ్చరించారు.  


Read more