సర్పంచ్‌ వేధింపులు.. టీడీపీ నేత ఆత్మహత్యాయత్నం

ABN , First Publish Date - 2022-09-09T05:29:31+05:30 IST

‘నన్ను, అంగన్‌వాడీ టీచర్‌గా పనిచేస్తున్న మా అమ్మను శ్రీరామవరం గ్రామ సర్పంచ్‌ కామిరెడ్డి నాని, కామిరెడ్డి బాలు తీవ్ర ఇబ్బందులు పెడుతున్నారు.

సర్పంచ్‌ వేధింపులు.. టీడీపీ నేత ఆత్మహత్యాయత్నం
బాధితుడిని పరామర్శిస్తున్న మాజీ ఎమ్మెల్యే చింతమనేని

సెల్ఫీ వీడియోతో పోలీసులకు ఫిర్యాదు  

ఏలూరు ప్రభుత్వాసుపత్రిలో చికిత్స

మాజీ ఎమ్మెల్యే చింతమనేని పరామర్శ

దెందులూరు, సెప్టెంబరు 8 : ‘నన్ను, అంగన్‌వాడీ టీచర్‌గా పనిచేస్తున్న మా అమ్మను శ్రీరామవరం గ్రామ సర్పంచ్‌ కామిరెడ్డి నాని, కామిరెడ్డి బాలు తీవ్ర ఇబ్బందులు పెడుతున్నారు. మా అమ్మను ఉద్యోగం నుంచి తీసేయాలని చూస్తున్నారు. మా కుటుంబంపై కక్ష పూరితంగా వ్యవహరిస్తున్నారు. వారి నుంచి నా ప్రాణాలకు హాని ఉంది. అందుకే ఆత్మహత్య చేసుకుంటున్నాను’ అని టీడీపీ నేత పప్పల సాయి సెల్ఫీ వీడియో తీసి జిల్లా ఎస్పీ రాహుల్‌దేవ్‌ శర్మకు, దెందులూరు ఎస్‌ఐ వీర్రాజుకు పోస్టు చేసి పురుగుల మందు తాగేశాడు. అప్రమత్తమైన బంధువులు సాయిని ఏలూరు ప్రభుత్వాసుపత్రికి తరలించి వైద్య సేవలందిస్తున్నారు. 

అరాచక పాలన సాగుతోంది : చింతమనేని

విషయం తెలిసిన వెంటనే దెందులూరు మాజీ ఎమ్మెల్యే చింతమనేని ప్రభాకర్‌ ఆసుపత్రికి వచ్చి సాయి ని పరామర్శించారు. మెరుగైన వైద్య సేవలందించాలని వైద్యులను కోరారు. ఈ సందర్భంగా ఆయన మీడియా తో మాట్లాడుతూ టీడీపీ నాయకులు, కార్యకర్తలపై పోలీసులతో తప్పుడు కేసులు పెట్టిస్తూ ఇబ్బందులు గురి చేస్తున్న వైసీపీ నేతలకు గుణపాఠం చెప్పే రోజులు దగ్గరలోనే ఉన్నాయని హెచ్చరించారు. నియోజకవర్గం లో అరాచక పాలన కొనసాగుతోందని, తమ కార్య కర్తలను ఇబ్బందులకు గురిచేస్తున్న వైసీపీ నేత నానిపై కేసు నమోదు చేయాలని డిమాండ్‌ చేశారు. టీడీపీ మండల అధ్యక్షుడు మాగంటి నారాయణప్రసాద్‌, నియోజకవర్గ తెలుగు యువత అధ్యక్షుడు మోతుకూరి నాని, తదితరులు ఉన్నారు.

నాకు సంబంధం లేదు

‘టీడీపీ నేత సాయిని ఏనాడు ఇబ్బంది పెట్టలేదు. నన్ను రాజకీయంగా ఎదుర్కోలేక అసత్య ఆరోపణలు చేస్తున్నారు. అతని ఆత్మహత్య గొడవతో నాకు సంబం ధం లేదు. ఆధారాలుంటే ఏ శిక్షకైనా నేను సిద్ధం’ అని సర్పంచ్‌ నాని తెలిపారు. 


Updated Date - 2022-09-09T05:29:31+05:30 IST