వాహనం వచ్చేలోగా భస్మీపటలమే!

ABN , First Publish Date - 2022-12-12T00:21:07+05:30 IST

మండల కేంద్రం చాట్రాయిలో అగ్నిమాపక కేంద్రం ఏర్పాటు చేయాలని 35 ఏళ్లుగా ప్రజలు, ప్రజాప్రతినిధులు కోరుతున్నా, ఇంత వరకు కార్యరూపం దాల్చలేదు.

  వాహనం వచ్చేలోగా భస్మీపటలమే!

గతంలో స్థలం కేటాయించినా కార్యరూపం దాల్చని వైనం

35 ఏళ్లుగా విజ్ఞప్తి చేస్తున్నా పట్టించుకోని అధికారులు

మండల కేంద్రం చాట్రాయిలో అగ్నిమాపక కేంద్రం ఏర్పాటు చేయాలని 35 ఏళ్లుగా ప్రజలు, ప్రజాప్రతినిధులు కోరుతున్నా, ఇంత వరకు కార్యరూపం దాల్చలేదు. మండల వ్యవస్థ ఏర్పడిన నాటి నుంచి విజ్ఞప్తులు చేస్తున్నా, పాలకుల ఉదాసీనత వల్ల అగ్నిమాపక కేంద్రం ఏర్పాటు చేయడం లేదని ప్రజలు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.

చాట్రాయి, డిసెంబరు 11: కొన్నేళ్ళ క్రితం మండల కార్యాలయాల ఆవరణలో అగ్నిమాపక కేంద్రం ఏర్పాటుకు స్థలం కూడా కేటాయించారు తప్ప నిర్మించలేదు. చాట్రాయి మండలం పూర్తిగా గ్రామీణ ప్రాంతం. 90 శాతం కుటుంబాలు వ్యవసాయం పైనే ఆధారపడి జీవిస్తున్నాయి. అన్ని గ్రామాల్లో ఇప్పటికీ చాలా మంది పేదలు పూరి గుడిసెల్లో నివశిస్తున్నారు. అధిక శాతం మంది పక్కా ఇళ్ళు కట్టుకున్నప్పటికీ పశువులు ఉండటం వలన ఇళ్ళ పక్కనే గడ్డివాములు పెట్టుకుంటారు. షార్టు సర్క్యూట్‌, ఇతర కారణాల వలన అగ్ని ప్రమాదం సంభవిస్తే పక్క మండలం నుంచి అగ్నిమాపక శకటం వచ్చేసరికి ఆస్తి నష్టం జరిగిపోతున్నది. అగ్నిమాపక కేంద్రం విస్సన్నపేటలో ఉంది. అది మండల కేంద్రం చాట్రాయికి 12 కిమీ, శివారు గ్రామాలు యర్రవారిగూడెం, చీపురుగూడెం తదితర గ్రామాలకు 30 కిమీ దూరంలో ఉంది. అంత దూరం నుంచి ఫైరింజన్‌ వచ్చేసరిగా పూర్తి నష్టం జరిగి బాధితులు కట్టుబట్టలతో మిగిలిపోతున్నారు. గతంలో మంత్రులు, ఎమ్మెల్యేలు, ఎంపీలు చాట్రాయిలో అగ్నిమాపక కేంద్రం ఏర్పాటు చేస్తామని ఇచ్చిన హామీలు నీటి మూటలయ్యాయి. ఇప్పటికైనా ప్రభుత్వం స్పందించి చాట్రాయిలో అగ్నిమాపక కేంద్రం ఏర్పాటు చేయాలని ప్రజలు కోరుతున్నారు.

Updated Date - 2022-12-12T00:21:11+05:30 IST