పల్లె పాలనపై నిర్లక్ష్యం

ABN , First Publish Date - 2022-02-19T05:52:32+05:30 IST

పల్లె పాలనపై ప్రభుత్వం నిర్లక్ష్యం కొనసాగిస్తోంది. నిధులు లేక పంచాయతీలు దిక్కులు చూస్తున్నాయి.

పల్లె పాలనపై నిర్లక్ష్యం
శ్రీపర్రు సచివాలయం

ఏకగ్రీవ ప్రోత్సాహకాలకు కలగని మోక్షం

నిధులు ఖర్చుపై విడుదల కాని మార్గదర్శకాలు

ఆశగా ఎదురుచూస్తున్న పాలకవర్గాలు

ఏలూరు రూరల్‌, ఫిబ్రవరి 18: పల్లె పాలనపై ప్రభుత్వం నిర్లక్ష్యం కొనసాగిస్తోంది. నిధులు లేక పంచాయతీలు దిక్కులు చూస్తున్నాయి. ఏకగ్రీవ పంచాయతీల ప్రోత్సాహకాల నిధులు ఉన్నా ఖర్చు చేయలేని స్థితిలో పాలకవర్గాలు ఉన్నాయి. ఇక నిధులు విడుదలై నెలలు గడుస్తున్నా ఖర్చు చేసేందుకు ఇప్పటివరకు అవకాశం ఇవ్వలేదు. ఎన్నికలు జరిగి ఏడాది సమీపిస్తున్నా మోక్షం కలగలేదంటే పరిస్థితి అర్ధం చేసుకోవచ్చు. అధికారులను అడుగుతుంటే ఇంకా మార్గదర్శకాలు విడుదల కాలేదని చెబుతున్నారు. దెందులూరు నియోజకవర్గంలో 15 పంచాయతీలు ఉన్నాయి. వీటికి గత ఏడాది ఫిబ్రవరిలో ఎన్నికలు జరిగాయి. కొక్కిరాయలంక, పైడిచింతపాడు, పెదయాగనమిల్లి పంచాయతీలు ఏకగ్రీవమయ్యాయి. సర్పంచ్‌, వార్డు సభ్యులను ఆయా పంచాయతీ ప్రజలు ఏకగ్రీవంగా ఎన్నుకున్నారు. అప్పట్లో ఏకగ్రీవ పంచాయతీలకు ప్రోత్సాహక నిధులు అందిస్తామని ప్రభుత్వం ఆర్భాటపు ప్రకటనలు ఇచ్చింది. నిధుల విషయంలో అదిగోఇదిగో అంటూ కాలయాపన చేసింది. రెండు వేలలోపు జనాభా ఉన్న పంచాయతీలకు ఐదు లక్షలు, రెండు నుంచి ఐదు వేల జనాభా ఉన్న పంచాయతీలకు పది లక్షలు, ఐదు నుంచి పది వేలలోపు జనాభా ఉన్న పంచాయతీలకు రూ. 15 లక్షలు చొప్పున మంజూరు చేసింది. నిధులు విడుదలైనట్టు ప్రకటించారు కాని మార్గదర్శకాలు విడుదల చేయకపోవడంతో నిధుల ఖర్చుకు మోక్షం కలగడం లేదు.

వెంటాడుతోన్న నిధుల లేమి  

గ్రామాల అభివృద్ధికి నిధులు కేటాయింపు కీలకం. ఇప్పటికే సీఎఫ్‌ఎంఎస్‌ నిబంధనలతో పంచాయతీలు ఆర్థిక సమస్యలతో కొట్టుమిట్టాడుతున్నాయి. ప్రభుత్వ ఆంక్షలతో మండలంలో ఉన్న అన్ని పంచాయతీల్లో అభివృద్ధి కుంటుపడింది. ముఖ్యంగా పారిశుధ్యం అస్తవ్యస్తంగా మారడంతో పల్లె ప్రజలు ఇబ్బందులు పడుతున్నారు. ఈ నేపథ్యంలో ఏకగ్రీవ పంచాయతీలకు ఇచ్చిన నిధులతో అభివృద్ధి పనులు చేపడతామని భావించిన పాలక వర్గాలకు చిక్కులు తప్పడం లేదు. ఏ పనులకు ఎంత కేటాయించాలి, ఏ నిర్మాణాలకు ఖర్చు చేయాలి, ఇతర ప్రభుత్వ నిధులను జోడించి చేపట్టవచ్చా, పెండింగ్‌ కరెంటు బిల్లులు కట్టాలా అనే విషయాల్లో ఇప్పటివరకు స్పష్టత లేదు. ఈ నిధులు ఎలా వాడుకోవాలో అధికారికంగా ఎటువంటి మార్గదర్శకాలు జారీ కాలేదు. దీంతో పాలకవర్గాలు ఆశగా ఎదురు చూస్తున్నాయి.

Updated Date - 2022-02-19T05:52:32+05:30 IST