పామాయిల్‌ సిరులు

ABN , First Publish Date - 2022-04-25T05:16:34+05:30 IST

నూనె ధరలు ఆకాశాన్నంటాయి. దీనికి అనుగుణంగా ఆయిల్‌పామ్‌కు కూడా మంచి ధర లభిస్తోంది. ఇటీవల కాలంలో ఈ పంటసాగు రైతులకు సిరులు పండిస్తున్నది.

పామాయిల్‌ సిరులు

గణనీయంగా పెరుతున్న సాగు విస్తీర్ణం

వెంటాడుతున్న మొక్కల కొరత

మామిడికి ప్రత్యామ్నాయ సాగుగా రైతులు మొగ్గు

ఆగిరిపల్లి, ఏప్రిల్‌ 24 :నూనె ధరలు ఆకాశాన్నంటాయి. దీనికి అనుగుణంగా ఆయిల్‌పామ్‌కు కూడా మంచి ధర లభిస్తోంది. ఇటీవల కాలంలో ఈ పంటసాగు రైతులకు సిరులు పండిస్తున్నది. ఒకప్పుడు ఆయిల్‌పామ్‌ అంటేనే ఆమడదూరం వెళ్లే రైతాంగం ఈసాగుకు ప్రస్తుతం ఉత్సాహం చూపుతున్నారు. అంచనాలకు మించిన గిట్టుబాబు రావడమే ఇందుకు కారణం. చీడపీడలు, గిట్టుబాటుకాని ధరలతో సతమతమవుతున్న మామిడి రైతాంగానికి ఆయిల్‌ పామ్‌ ప్రస్తుతం ఆశాదీపంలా మారింది. మామిడితోటలను నరికివేసి ఆయిల్‌పామ్‌ సాగుచేసేందుకు రైతులు సిద్ధపడు తున్నారు. టన్నుకు రూ.22 వేల ధర  లభిస్తున్నందున, సాగులో రిస్క్‌ తక్కువ ఉన్నందన మెట్ట రైతాంగం ఈ సాగుపట్ల ఆసక్తి చూపుతున్నారు. తొలకరి దుక్కులు దున్నడం, డ్రిప్‌ద్వారా నీటి తడులు ఇవ్వడం మినహా ఇతర ప్రత్యేక యాజమాన్యం చేయాల్సిన అవసరం లేకపోవడంతో రైతులు ఈ సాగుకు ఆకర్షితులవుతున్నారు. అయితే ప్రస్తుతం ఆయిల్‌పామ్‌ మొక్కల కొరత వెంటాడుతోంది. ఉద్యానవనశాఖ అధికారులకు మొక్కల కోసం దరఖాస్తులు చేసుకున్నా కంపెనీల నుంచి అందని కారణంగా రైతులకు మెక్కలు పంపిణీ చేయలేక పోతున్నారు. ఆయిల్‌పామ్‌ సాగుకు పుష్కలంగా నీరు అవసరం, నీటి లభ్యత లేనివారు కూడా మొక్కలకు దరఖాస్తు చేస్తున్నారని, దీనిపై భూమిని తనిఖీ చేసి నీటి లభ్యతను బట్టే వారికి మొక్కలు మంజూరుకు సిఫార్సు చేస్తున్నట్టుగా ఉద్యానవనశాఖ అధికారులు చెబుతున్నారు. ఆగిరిపల్లి మండలంలో ప్రస్థుతం 100 హెక్టార్‌లలో సాగుకోసం దరఖాస్తులు అందినా మొక్కలు పంపిణీ చేయడం లేదు. మండలంలో దాదాపు 1700 ఎకరాలలో ఆయిల్‌పామ్‌ సాగవుతోంది.


Read more