సూపర్‌ నిట్‌

ABN , First Publish Date - 2022-01-23T05:46:14+05:30 IST

ఆంధ్రప్రదేశ్‌ నేషనల్‌ ఇన్‌స్టిట్యూట్‌ ఆఫ్‌ టెక్నాలజీ ప్లేస్‌మెంట్స్‌ కల్పనలో సత్తా చాటింది.

సూపర్‌ నిట్‌

ఉద్యోగావకాశాల్లో గూడెం క్యాంపస్‌ ఘనత
తొలి సెమిస్టర్‌లోనే వంద శాతం ప్లేస్‌మెంట్స్‌
రూ.7.82 లక్షలకు పెరిగిన సగటు వార్షిక వేతనం
కేతన్‌ బన్సాల్‌కు అత్యధిక ప్యాకేజీ రూ.37.43 లక్షలు

 
 (తాడేపల్లిగూడెం–ఆంధ్రజ్యోతి)
ఆంధ్రప్రదేశ్‌ నేషనల్‌ ఇన్‌స్టిట్యూట్‌ ఆఫ్‌ టెక్నాలజీ ప్లేస్‌మెంట్స్‌ కల్పనలో సత్తా చాటింది. ఏపీ నిట్‌లో అర్హత సాధించిన విద్యార్థులందరికీ  బహుళ జాతి కంపెనీల్లో ఉద్యోగాలు లభించాయి. చివరి సంవత్సరం ప్రథమ సెమిస్టర్‌లోనే కంపెనీల నుంచి ఆఫర్‌లు వెతుక్కుంటూ వచ్చాయి. మొత్తం 349 మంది విద్యార్థులు క్యాంపస్‌ సెలక్షన్స్‌ కోసం నమోదు చేసుకున్నారు. సాఫ్ట్‌వేర్‌, తయారీ, నిర్మాణ రంగాల కంపెనీల నుంచి 351 ఉద్యోగాలు ఇచ్చేందుకు ఆఫర్‌ లభించింది. సగటు వార్షిక ప్యాకేజీ పెరిగింది. గత ఏడాది రూ. 6.5 లక్షలు వార్షిక ప్యాకేజీ ఉండేది. ఈ ఏడాది రూ. 7.82 లక్షలకు చేరుకుంది. చివరి సెమిస్టర్‌ పూర్తయ్యేందుకు మరో 10 నెలలు సమయం ఉంటుంది. అప్పటికీ ప్యాకేజీ మరింత పెరిగే అవకాశం ఉందని నిట్‌ అధికారులు ఆశిస్తున్నారు. ఏపీ నిట్‌లో ఆన్‌లైన్‌ ద్వారా సెలక్షన్స్‌ నిర్వహిస్తున్నారు. మొత్తం 30 కంపెనీలు వచ్చాయి. ఉద్యోగాలకు ఉపాధి అవకాశాలు కల్పించాయి. కంప్యూటర్‌ సైన్స్‌ ఇంజనీరింగ్‌ విద్యార్థి కేతన బన్సాల్‌ రూ. 37.43 లక్షల అత్యధిక ప్యాకేజీని సాధించాడు. పేరు మోసిన కంపెనీలు తీసుకురావడంలో ఈసారి అధికారులు సఫలీకృతులయ్యారు. అత్యధిక ప్యాకేజీ పొందిన విద్యార్థులు ఆంధ్రజ్యోతితో తమ అనుభవాలను పంచుకున్నారు.

సబ్జెక్ట్‌పై పట్టు సాధించాలి
కేతన బన్సాల్‌, కంప్యూటర్‌ సైన్స్‌ విద్యార్థి
విద్యార్థులు కోర్‌ సబ్జెక్ట్‌పై పట్టు సాధించాలి. సాఫ్ట్‌ స్కిల్స్‌లోనూ ప్రావీణ్యం ఉండాలి. గతేడాది నుంచి సాఫ్ట్‌ స్కిల్స్‌పై ఏపీ నిట్‌లో తర్ఫీదు ఇచ్చారు. అది నాకు ఉపయోగపడింది. అత్యధిక ప్యాకేజీతో ఉద్యోగం సాధించగలిగాను.

 సంతోషంగా ఉంది
 పులివెందుల ప్రశూన,  కంప్యూటర్‌ సైన్స్‌, పులివెందుల
ఇప్పుడు అవకాశాలు పెరిగాయి. కోడింగ్‌ బాగా నేర్చుకోవాలి.. ఆన్‌లైన్‌లో ఎంపికలు జరుగుతున్నాయి కాబట్టి ఎన్ని కంపెనీలకైనా దరఖాస్తు చేసుకోవచ్చు. కోడింగ్‌పై మా టీచర్‌లు మంచి శిక్షణ ఇచ్చారు. అట్లాసియన్‌లో  రూ. 26 లక్షల వార్షిక ప్యాకేజీకి ఎంపికయ్యాను.   
 
 కష్టపడితే ఫలితం వచ్చింది
కమటం నవ్య, మహబూబాబాద్‌, కంప్యూటర్‌ సైన్స్‌
సబ్జెక్ట్‌పై పట్టు సాధించేలా చదవాలి. అప్పుడే పూర్తిస్థాయి అవగాహన వస్తుంది. ఆన్‌లైన్‌ ఇంటర్వ్యూలు కాబట్టి ఎన్ని కంపెనీలకైనా పరీక్షలు రాసే అవకాశం ఉంటుంది. నేను అలాగే చేశాను. వార్షిక ప్యాకేజీ రూ. 24 లక్షలకు ఎంపి కయ్యాను.

మొదటి సంవత్సరం నుంచే దృష్టి పెట్టాలి
మెహంత్‌ , హైదరాబాద్‌, కంప్యూటర్‌ సైన్స్‌, ఏపీ నిట్‌
ఆఫ్‌ క్యాంపస్‌లోనే ఉద్యోగం పొందాను. మొదటి సంవత్సరం నుంచే కోడింగ్‌, కంప్యూటర్‌ సైన్స్‌ సబ్జెక్ట్స్‌, ఓపెన్‌ సోర్స్‌, ప్లోబ్లమ్‌ సాల్వింగ్‌, రీసెర్స్‌ పేపర్స్‌పై దృష్టిపెట్టాలి. ఇలా చేస్తే మంచి భవిష్యత్తు ఉంటుంది. ఒకటి రెండు సంవత్సరాలు ఉద్యోగం చేస్తాను. జీఆర్‌ఈలో మంచి స్కోర్‌ సాధించాను. తద్వారా ఉన్నత చదువులకు వెళతాను. ప్రస్తుతం రూ. 23.5 లక్షల ప్యాకేజీతో ఉద్యోగం వచ్చింది.
Read more