మాండస్‌ ముప్పు..

ABN , First Publish Date - 2022-12-09T23:59:57+05:30 IST

రైతులను మాండస్‌ తుఫాను భయం వెంటాడుతోంది. కళ్లాల్లో వరి పంట ఉండటంతో వారి గుండెల్లో తుఫాన్‌ రైళ్లు పరుగెట్టిస్తోంది. బంగాళాఖాతంలో ఏర్పడిన మాండస్‌ తీవ్ర తుఫానుగా మారటంతో ఆ ప్రభావం ఏలూరు జిల్లాలో కూడా ఎక్కువగా కనిపి స్తోంది. శుక్రవారం ఉదయం నుంచి వాతావ రణంలో మార్పులు చోటు చేసుకున్నాయి. మధ్యాహ్నం నుంచి చిరుజల్లులు ప్రారంభమై రాత్రి సమయానికి జోరువానలు ప్రారంభమయ్యాయి.

మాండస్‌ ముప్పు..
ఉంగుటూరు మండలం కాకర్లమూడిలో ధాన్యం బస్తాలపై బరకాలు కప్పిన దృశ్యం

కల్లాల్లోనే వరి పంట

కొన్నిచోట్ల పూర్తికాని కోతలు

వర్షాలు కురిస్తే నష్టమే అంటున్న రైతులు

జిల్లా వ్యాప్తంగా తుఫాన్‌ వాతావరణం

ఏలూరుసిటీ, డిసెంబరు 9: రైతులను మాండస్‌ తుఫాను భయం వెంటాడుతోంది. కళ్లాల్లో వరి పంట ఉండటంతో వారి గుండెల్లో తుఫాన్‌ రైళ్లు పరుగెట్టిస్తోంది. బంగాళాఖాతంలో ఏర్పడిన మాండస్‌ తీవ్ర తుఫానుగా మారటంతో ఆ ప్రభావం ఏలూరు జిల్లాలో కూడా ఎక్కువగా కనిపి స్తోంది. శుక్రవారం ఉదయం నుంచి వాతావ రణంలో మార్పులు చోటు చేసుకున్నాయి. మధ్యాహ్నం నుంచి చిరుజల్లులు ప్రారంభమై రాత్రి సమయానికి జోరువానలు ప్రారంభమయ్యాయి. దీంతో వరి సాగు చేసిన రైతులు ఆందోళన చెందుతున్నారు. జిల్లాలో వరి కోతలు ఇంకా పూర్తి కాలేదు. చాలా ప్రాంతాల్లో వరి పంట కల్లాల్లోనే ఉంది. ధాన్యం తడిసి పోతే నష్టపోవాల్సి వస్తుందని ఆందోళన చెందుతున్నారు. ఇదీగాక కొన్ని ప్రాంతాల్లో కోసిన వరి ధాన్యం కొనుగోళ్ళు పూర్తికాకపోవటంతో వారిలో మరింత ఆందోళన కనిపి స్తోంది. జిల్లాలోని చింతలపూడి, కైకలూరు, ముసునూరు , చాట్రాయి, ఆగిరిపల్లి, నూజివీడు , మండవల్లి, కలి దిండి, ముదినేపల్లి , పెదవేగి, పెదపాడు, దెందులూరు, ఏలూరు, గణపవరం, ద్వారకాతిరుమల, జంగా రెడ్డిగూడెం, టి.నరసాపురం, లింగపాలెం, కామరవపుకోట, కొయ్యలగూడెం., పోలవరం, జీలుగు మిల్లి, కుక్కునూరు, వేలేరు పాడు, బుట్టాయిగూడెం, భీమడోలు, ఉంగు టూరు తదితర ప్రాంతాల్లో వరి కోతలు ఇంకా పూర్తి కాకపోవడంతో రైతులు ఆందోళన చెందుతున్నారు. తుఫాను నేపఽథ్యంలో పంటను రక్షించుకోవాలని ఇప్పటికే వ్యవసాయ శాఖాధి కారులు, రెవెన్యూ అధికారులు సూచనలు చేస్తున్నారు.

విపరీతమైన చలిగాలులు

తుఫాను వాతావరణం కారణంగా చలిగాలులు తీవ్రంగా వీస్తున్నాయి. దీంతో ప్రజలు బయటకు వెళ్లా లంటేనే భయపడుతున్నారు. తుఫాను ప్రభావం శని, ఆదివారాల్లో ఎక్కువగా ఉంటుందనే హెచ్చరికలు జారీ అవుతుండటంతో రైతులలో మరింత ఆందోళన మొద లైంది. గడచిన 24 గంటల్లో మండవల్లి మండలంలో 3.6 మిల్లీమీటర్లు, కలిదిండిలో 2.2 మిల్లీమీటర్లు, ముదినే పల్లిలో 1.2 మిల్లీమీటర్లు, కైకలూరులో 0.8 మిల్లీమీటర్లు వర్షపాతం నమోదైంది. తుఫాను నేపథ్యంలో అధికారులు కూడా అప్రమత్తమయ్యారు. సాయంత్రం 4 గంటల నుంచే చలిగాలుల తీవ్రత ప్రారంభమైంది. రాత్రి ఉష్ణోగ్రతలు 20 డిగ్రీలు సెంటీగ్రేడ్‌ వరకు చేరుతున్నా అంతకన్నా ఎక్కువగానే చలి ప్రభావం కనిపిస్తుందని చెబుతున్నారు. చలి ప్రభావం కారణంగా కొంతమంది అనారోగ్యాల పాలవుతున్నారు. జలుబు, జ్వరంతో బాధపడుతూ ఆసుపత్రులకు వెళుతున్నారు. ఈ వాతావరణంలో బహిరంగ ప్రదేశాల్లో తిరగవద్దని వైద్యులు చెబుతున్నారు. రహదారులపై జన సంచారం తగ్గింది.

చేపల రైతుల్లో ఆందోళన

కలిదిండి, డిసెంబరు 9 : చేపల రైతులు హడావుడిగా పట్టుబడులు చేస్తున్నారు. పట్టుబడుల సమయంలో తుఫాను ప్రభావం భారీ వర్షాలు కురిస్తే చెరువుల్లో నీరు చల్లబడి ఆక్సిజన్‌ కొరత ఏర్పడి చేపలు మృత్యువాత పడే ప్రమాదం ఉంది. దీంతో చెరువుల్లో ఆక్సిజన్‌ కొరత నివా రణకు ఖరీదైన మందులు చల్లుతు న్నారు. పండుగప్ప చెరువుల్లో నిరంత రాయంగా ఏరియేటర్లను తిప్పుతు న్నారు. చెరువుల్లో ఆక్సిజన్‌ టాబ్‌లెట్స్‌ వేస్తున్నారు. మండ లంలో 20 వేల ఎకరాల్లో తెల్ల చేపలు, 4 వేల ఎకరాల్లో పండుగప్ప సాగు చేస్తున్నారు. కిలో నుంచి రెండు కిలోల వరకు పెరిగిన తెల్ల చేపలు, 3 నుంచి 5 కిలోలు పెరి గిన పండుగప్పలను పట్టుబడి చేస్తున్నారు. మట్టగుంట, యడవల్లి, కొండంగి, కొత్తూరు గ్రామాల్లో చెరువుల్లో చేపలను హడావుడిగా పట్టుబడి చేస్తున్నారు. భారీ వర్షాలు కురిస్తే చెరువుల గట్లు తెగి గండ్లు పడే ప్రమాదం ఉండటంతో రైతులు అప్రమత్తంగా ఉండాలని మత్స్యశాఖా భివృద్ధి అధికారి బి.శ్రీని వాసరావు తెలిపారు. ఆక్సిజన్‌ కొరత నివారణకు చేపల చెరువుల్లో ఎకరానికి కిలో చొప్పున హైడ్రోజన్‌ పెరాక్సైడ్‌ పిచికారీ చేయాలన్నారు. చెరువుల్లో బోటులు తిప్పుతూ ఆయిలింజన్లతో నీటిని రీసైక్లింగ్‌ చేయాలన్నారు. దీంతో కెరటాలు రావటంతో ఆక్సిజన్‌ ఉత్పన్న మవుతుందన్నారు. పండుగప్ప చెరు వులో నిరంతరాయంగా ఏరియేటర్లు తిరిగే విధంగా చర్యలు తీసుకోవాలన్నారు.

మామిడికి దెబ్బ

నూజివీడు టౌన్‌ : ఈ తుఫాను మామిడి రైతులకు నష్టం చేకూర్చే పరిస్థితులు కనిపిస్తున్నాయి.శనివారం భారీవర్షాలు కురిసే అవకాశం ఉందని వాతావరణ శాఖ హెచ్చరికల నేపథ్యంలో రైతులకు దిగులు పట్టుకుంది. మామిడికి ప్రసిద్ధిచెందిన నూజివీడు డివిజన్‌ గత సంవత్సరం దిగుబడులు గణనీయంగా పడిపోవడంతో ప్రస్తుత సీజన్‌లో ముందస్తు పూతలు వచ్చే అవకాశం ఉందని, రైతులు ఇప్పటికే రెండు నుంచి మూడుసార్లు పురుగుమందులు పిచికారీ చేశారు. అయితే తుఫాను ప్రభావంతో భారీవర్షాలు నమోదైతే పూతల స్థానంలో ఆనలు వచ్చే అవకాశం ఉందని, ఇదేపరిస్థితి వస్తే ప్రస్తుత సీజన్‌లోనూ మామిడిరైతు తీవ్రంగా నష్టపోవాల్సి వస్తుందని రైతులు వాపోతున్నారు.

Updated Date - 2022-12-10T00:00:01+05:30 IST